గాంధీ విగ్రహం తొలగింపుతో ఆందోళన

ABN , First Publish Date - 2022-12-31T23:57:39+05:30 IST

భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన కొత్తల్లో భారత్‌ యూత్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం అది.

 గాంధీ విగ్రహం తొలగింపుతో ఆందోళన

ఉప్పల్‌, డిసెంబర్‌ 31 (ఆంధ్రజ్యోతి): భారత దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన కొత్తల్లో భారత్‌ యూత్‌క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహం అది. పలు చారిత్రక సంఘటనలకు సాక్ష్యంగా నిలిచిన ఆ విగ్రహాన్ని జీహెచ్‌ఎంసీ అధికార సిబ్బంది రాత్రికిరాత్రే తొలగించారు. శనివారం ఉదయం అక్కడ విగ్రహం కనిపించకపోవడంతో స్థానికంగా కలకలం రేగింది. పార్టీలతో సంబంధం లేకుండా పాత ఉప్పల్‌ గ్రామానికి చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధుల మధ్య ఈ అంశం చర్చనీయాంశమైంది. చివరకు రోడ్డు విస్తరణలో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు తొలగించారనే విషయం తెలిసి తమకు సమాచారం ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. శనివారం గ్రామ పెద్దలు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు గాంధీ విగ్రహం తొలగించిన చోటే ఎమ్మెల్యే భేతి సుభాష్‌ రెడ్డితో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఉప్పల్‌ కాంగ్రెస్‌ ఏ-బ్లాక్‌ అధ్యక్షుడు మందముల పరమేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ గాంధీ విగ్రహం తొలగింపుపై సమాచారం ఇవ్వకపోవడాన్ని ఆక్షేపించారు. భారత్‌ యూత్‌క్లబ్‌ ప్రతినిధులు మాట్లాడుతూ తొలగించిన చోటే కొత్తగా విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, స్వాధీనం చేసుకున్న స్థలానికి గాను తమక్లబ్‌కు నష్ట పరిహారం ఇవ్వాలని, అధికారులపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ విగ్రహం తొలగింపును నిరసిస్తూ ఆందోళన చేసేందుకు సిద్ధమవడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చివరకు అధికారులు స్పందించి నేషనల్‌ హైవేస్‌ అథారిటీ అధికారుల సూచనల మేరకు తొలగించిన ఈ గాంధీ విగ్రహానికి మెరుగులు దిద్ది అక్కడే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేయడంతో పాటు ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌ అరుణ కుమారి, ఈఈ నాగేందర్‌, టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మేకల శివారెడ్డి, వివిధ పార్టీలకు చెందిన గ్రామ నాయకులు పుబ్బ నర్సింహారెడ్డి, సల్లా రాజిరెడ్డి, ధర్మారెడ్డి, కందికంటి అశోక్‌ కుమార్‌ గౌడ్‌, మేకల హనుమంత్‌ రెడ్డి, బజారు జగన్‌, గోనె అర్జున్‌ రెడ్డి, మేకల మధుసూధన్‌ రెడ్డి, రేబెల్లి రాజు, వేముల సంతోష్‌ రెడ్డి, భారత్‌ యూత్‌క్లబ్‌ అధ్యక్షుడు అర్జున్‌ గౌడ్‌, బొమ్మగోని దాస్‌ గౌడ్‌, బజారు మురళీ గౌడ్‌, మహంకాళి లక్ష్మణ్‌, పోగుల దయాకర్‌ రెడ్డి, బోరంపేట కృష్ణ, బిక్కుమళ్ల అంజయ్య, చింతల నర్సింహా రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:57:55+05:30 IST