రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాల్సిందే!

ABN , First Publish Date - 2022-11-08T05:18:08+05:30 IST

రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రెండు నెలలుగా తన వద్దే పెండింగ్‌లో పెట్టుకున్న గవర్నర్‌ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

రాజ్‌భవన్‌కు వచ్చి చర్చించాల్సిందే!

పెండింగ్‌ బిల్లులపై గవర్నర్‌ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ

అటవీ వర్సిటీ బిల్లులో చాన్స్‌లర్‌గా సీఎం ఉండడమే కారణమా?

హైదరాబాద్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను రెండు నెలలుగా తన వద్దే పెండింగ్‌లో పెట్టుకున్న గవర్నర్‌ తమిళిసై.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఆ బిల్లులు చట్టంగా మారితే న్యాయపరమైన చిక్కులుంటాయని అనుమానాలు వ్యక్తం చేశారు. దీంతో.. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం-రాజ్‌భవన్‌ మధ్య కొనసాగుతున్న రగడ.. తారాస్థాయికి చేరుకుంటోంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా.. సెప్టెంబరు 12న విద్యాశాఖకు సంబంధించిన ఎనిమిది కీలక బిల్లులు ఆమోదం పొందిన విషయం తెలిసిందే. ఇందులో.. ప్రైవేటు వర్సిటీల బిల్లు, సిద్దిపేట జిల్లా ములుగులో ఏర్పాటుచేయనున్న అటవీ వర్సిటీ బిల్లు, విశ్వవిద్యాలయాల నియామకాల చట్ట సవరణ బిల్లు ఉన్నాయి. ఈ బిల్లులకు గవర్నర్‌ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు.

రాజ్యాంగంలో గవర్నర్‌కు ఉన్న అధికారాల మేరకు.. వాటిని ఆమోదించవచ్చు లేదంటే మరింత సమాచారం కోరుతూ/సవరణలు ప్రతిపాదిస్తూ అసెంబ్లీకి తిప్పి పంపవచ్చు. రెండోసారి అసెంబ్లీ పంపే బిల్లులను తప్పకుండా ఆమోదించాల్సి ఉంటుంది. తన దగ్గర పెండింగ్‌లో పెట్టుకునే బిల్లులను రాష్ట్రపతి పరిశీలనకు పంపే అవకాశాలున్నా యి. పైన పేర్కొన్న మూడు బిల్లుల విషయంలో గవర్నర్‌ తన నిర్ణయాన్ని వెల్లడించలేదు. తాజాగా సోమవారం ‘అటవీ విశ్వవిద్యాలయ బిల్లు’పై గవర్నర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు, బిల్లుపై చర్చించేందుకు రాష్ట్ర విద్యాశాఖ, యూజీసీ ప్రతినిధులను ఆమె రాజ్‌భవన్‌కు ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే.. తమకు గవర్నర్‌ నుంచి ఎలాంటి లేఖ అందలేదని విద్యాశాఖ మంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సాధారణంగా వర్సిటీలకు గవర్నర్‌ చాన్సలర్‌గా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్‌ కమిటీ ప్రతిపాదనలతో.. వైస్‌చాన్సలర్ల పేరును సూచిస్తే.. ఆ జాబితాలోంచి ఒకరిని గవర్నర్‌ వీసీగా నియమిస్తారు. అయితే.. అటవీ విశ్వవిద్యాలయం బిల్లు విషయంలో ముఖ్యమంత్రిని చాన్సలర్‌గా పేర్కొన్నారు. దీనిపై గవర్నర్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది. దీంతోపాటు.. అన్ని వర్సిటీలకు ఒకే నియామక బోర్డు బిల్లు కూడా పెండింగ్‌లో ఉంది. 80 వేల పోస్టులను భర్తీ చేయాలని లక్ష్యం నిర్దేశించుకున్న ప్రభుత్వానికి ఈ బిల్లు కీలకమైనది.

అమిత్‌ షాతోతమిళిసై భేటీ

న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి సీఎం కేసీఆర్‌ చేసిన ఆరోపణలను తమిళిసై కేంద్ర మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఉప ఎన్నికలో గెలిచేందుకు కేసీఆర్‌ అక్రమాలకు పాల్పడ్డారని, అనేక మంది నేతలు తమ ఫోన్లు ట్యాప్‌ అయ్యాయని ఆరోపణలు చేశారని చెప్పినట్లు సమాచారం. మునుగోడు ఎన్నికకు ముందు ఢిల్లీకి హడావిడిగా వచ్చిన తమిళిసై రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై నివేదిక ఇవ్వాలని భావించారు. అయితే ఎన్నిక తర్వాత కలవాలని హోం శాఖ అధికారులు చెప్పడంతో ఆమె సోమవారం ఢిల్లీ వచ్చి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. గవర్నర్‌గా తాను మూడేళ్లు పూర్తి చేసుకున్నానని, ఈ సమయంలో చేపట్టిన కార్యక్రమాలపై ప్రచురించిన పుస్తకాన్ని అమిత్‌ షాకు అందించి, ఆశీస్సులు తీసుకున్నానని తమిళిసై మీడియాకు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం చర్చకొచ్చిందా..? అని విలేకరులు ప్రశ్నించగా.. మౌనం వహించారు. తాజా రాజకీయ అంశాలపై చర్చించారా..? అని అడగగా.. ‘‘నేను రాజకీయ నాయకురాలిని కాదు’’ అని సమాధానమిచ్చారు.

Updated Date - 2022-11-08T05:18:09+05:30 IST