పుస్తకాల పండగొస్తోంది
ABN , First Publish Date - 2022-12-16T01:21:52+05:30 IST
నగరవాసి ముంగిట ప్రతి ఏటా డిసెంబరులో కొలువు దీరే అక్షర సంక్రాంతి సందడి వారం ముందే మొదలైంది.
ఈనెల 22 నుంచి ప్రారంభం
కొలువుదీరనున్న కొత్త పుస్తకాలు
ఆవిష్కరణలకు వేదిక కానున్న బుక్ ఫెయిర్
హైదరాబాద్ సిటీ, డిసెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): నగరవాసి ముంగిట ప్రతి ఏటా డిసెంబరులో కొలువు దీరే అక్షర సంక్రాంతి సందడి వారం ముందే మొదలైంది. 22నుంచి ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ప్రారంభం కానున్న బుక్ ఫెయిర్ ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే, అప్పుడే సామాజిక మాధ్యమాల్లో బుక్‌ఫెయిర్ వేదికగా సాగనున్న పుస్తకావిష్కరణల ఆహ్వానాలు చక్కర్లు కొడుతున్నాయి. చాలామంది కవులు, రచయితలు పునర్ముద్రణలు, కొత్త ప్రచురణల హడావిడిలో నిమగ్నమయ్యారు. ఎప్పటిలాగే ఈసారి 300 పుస్తక లోగిళ్లు బుక్ ఫెయిర్‌లో నెలవుకానున్నాయి. ఇది కరోనా కాలానంతర బుక్ ఫెయిర్ కానుండటంతో ఈ సారి విడుదల అవ్వనున్న కొత్తపుస్తకాల సంఖ్య ఎక్కువగానే ఉండొచ్చంటున్నారు ప్రచురణ కర్తలు. అన్వీక్షికీ పబ్లికేషన్స్ సంస్థ 22పై చిలుకు కొత్త టైటిల్స్‌ను ఈ బుక్ఫెయిర్లో పాఠకులకు పరిచయం చేయనుంది. ఛాయా ప్రచురణలు 15 కొత్త పుస్తకాలను తీసుకురానుంది. బుక్ ఫెయిర్ సొసైటీ నిర్వాహకులు సైతం ఈ ఏడాది పుస్తకావిష్కరణలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
సరికొత్త ప్రచారం
ఇదివరకెన్నడూ లేనంతగా ఈ ఏడాది పుస్తకానికి సరికొత్త ప్రచారం తోడైంది. పఠనాసక్తిని పెంపొందించడంతోపాటు మంచి పుస్తకాలను పాఠకులకు పరిచయం చేయాలనే సంకల్పంతో కొందరు పుస్తక ప్రేమికులు సామాజిక మాధ్యమాల ద్వారా వారికి నచ్చిన పుస్తకాలను పరిచయం చేస్తున్నారు. అలా సోషల్ మీడియా గ్రూపుల్లో పుస్తక ప్రదర్శన నేపథ్యం మీదే చర్చ కొనసాగడం విశేషం.
మంచిపుస్తకం వేదిక ఇప్పటికే పుస్తక పరిచయం పేరుతో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎన్నడూ పుస్తకాల ముఖం ఎరుగని కొందరు యువతీయువకులు సామాజిక మాధ్యమాల ద్వారానో, సెలబ్రిటీలు చెప్పారనో, సాహిత్య పఠనంలోకి అడుగుపెడుతున్నవారికి కొదవలేదు.
పిల్లల కోసం ప్రత్యేకం..
బుక్ఫెయిర్లో తెలుగు, ఇంగ్లిషు భాషల్లో బాలసాహిత్యం ప్రత్యేక ఆకర్షణ. మంచి పుస్తకం, నేషనల్ బుక్ ట్రస్ట్ తదితర ప్రచురణ సంస్థలు చిన్నారులు మెచ్చే కథలు, బొమ్మల పుస్తకాలతో పలకరిస్తాయి. పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించడం, వాళ్ల సృజనను ప్రోత్సహించడంలో భాగంగా బుక్ ఫెయిర్ సొసైటీ పిల్లలకు ప్రత్యేకంగా చిత్రలేఖనం, స్టోరీ టెల్లింగ్, క్విజ్ తదితర పోటీలనూ నిర్వహించనుంది.
పోటీ పరీక్షలకు తోడ్పడే..
బుక్‌ఫెయిర్ కోసం సాహితీ అభిమానులు, పుస్తక ప్రియులు మాత్రమే కాదు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతోన్న యువతీ, యువకులూ ఎదురుచూస్తున్నారు. బుక్ ఫెయిర్‌లో తెలుగు అకాడమీ, అంబేడ్కర్ వర్సిటీ, తెలుగు వర్సిటీతోపాటు మరికొందరు పోటీ పరీక్షలకు తోడ్పడే పుస్తకాలతో స్టాళ్లు నిర్వహిస్తుంటారు. మిగతా రోజుల్లో పరిచయం కాని పుస్తకాలను బుక్ ఫెయిర్‌లో చూడచ్చని కూడా యువత పుస్తకాల జాతర ప్రాంగణానికి బారులుదీరడం ప్రతియేటా చూస్తుంటాం. ప్రస్తుతం నోటిఫికేషన్ల కాలం నడుస్తోంది కనుక, ఈ ఏడాది ఆ సంఖ్య మరింత పెరగవచ్చని పరిశీలకుల విశ్లేషణ.