పసివయసుకు పెద్ద కష్టం

ABN , First Publish Date - 2022-06-12T16:46:57+05:30 IST

కరోనా సమయంలో అసంఘటిత రంగ కార్మికులు చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. వాళ్లలో చాలామంది సొంతూళ్లకు వెళ్లారు

పసివయసుకు పెద్ద కష్టం

కరోనా తర్వాత మారిన పరిస్థితులు

నగరంలో పెరిగిన బాలకార్మికులు


కరోనా అనంతర పరిణామాలతో నగరంలో బాలకార్మికులు మరింత పెరిగారని నిపుణుల అంచనా. ముఖ్యంగా అసంఘటిత కార్మికుల పిల్లలు చాలామంది బడికి దూరమయ్యారు. రెండేళ్లు చదువుకి అంతరాయం తలెత్తడంతో విద్యా ప్రమాణాలు సన్నగిల్లినట్లు బాలల హక్కుల సంఘాలు గుర్తించాయి.   ఇదే సమయంలో బస్తీల్లో బాల్యవివాహాలు పెరిగినట్లు సామాజిక వేత్తలు చెబుతున్నారు. దీన్నొక అత్యవసర పరిస్థితిగా ప్రభుత్వం గుర్తించాలనేది వారి డిమాండ్‌


హైదరాబాద్‌ సిటీ: కరోనా సమయంలో అసంఘటిత రంగ కార్మికులు చాలామంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. వాళ్లలో చాలామంది సొంతూళ్లకు వెళ్లారు. కరోనా తగ్గుముఖం పట్టాక అందులో కొందరు తిరిగి నగరాలకు వచ్చినా, వారి పిల్లలు మాత్రం స్కూళ్లలో కనిపించడంలేదని సామాజిక కార్యకర్తల అభిప్రాయం. కరోనా అనంతర పరిణామాల్లో హైదరాబాద్‌లోని పిల్లల స్థితిగతుల మీద కొద్దిరోజుల కిందట ఎంవీఎఫ్‌ ఫౌండేషన్‌ అధ్యయనం చేసింది. కరోనాకి ముందు, తర్వాత స్కూళ్లలోని పిల్లల నమోదులో తలెత్తిన భేదాన్ని వాళ్లు గుర్తించారు. సుమారు 20 శాతం మంది పిల్లలు చదువుకు దూరమైనట్లు తెలుస్తోంది. తరగతిలో మొగ్గతొడగాల్సిన బాల్యం కార్ఖానాల్లో తెల్లారుతుందనడానికి ఎంవీఎఫ్‌ క్షేత్రస్థాయి అధ్యయనంలో వెలుగుచూసిన వాస్తవాలే నిదర్శనం. అభివృద్ధికి, ఆధునికతకు ఆలవాలమనుకునే నగరంలో బాల్యానికి ఆదరవు లేకపోవడం విచారకరం. 


స్మార్ట్‌ఫోన్లు లేక..

స్మార్ట్‌ఫోన్లు వంటి సాంకేతిక పరికరాలు అందుబాటులో లేకపోవడంతో బస్తీల్లోని చాలామంది పేద పిల్లలు కరోనా సమయంలో ఆన్‌లైన్‌ తరగతులకూ హాజరుకాలేకపోయారు. రెండేళ్ల సుదీర్ఘ సెలవులు రావడంతో పాఠ్యాంశాలను మరిచిపోయారు. దాంతో విద్యాప్రమాణాలు సన్నగిల్లడం, చదువుమీద ఆసక్తి తగ్గడం తదితర కారణాలతో పిల్లలు కొందరు బడి మానేశారు. వీధి వ్యాపారాలు వంటి వాటిల్లో నష్టపోయిన కొంతమంది, కరోనా అనంతరం అప్పు తీర్చడం కోసమో, ఆర్థిక అవసరాల కోసమో తమ పిల్లలను పనుల్లో కుదిర్చినట్టు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే, బాలలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించడంతో స్కూల్లో ఉండాల్సిన పిల్లలు ఎక్కడెక్కడ బతుకీడుస్తున్నారనే విషయం తెలియడంలేదు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు నోచుకోని కుటుంబాలకు ఆర్థిక ఆసరా కల్పించడంతో పాటు వారి పిల్లల పరిస్థితి మీద ప్రభుత్వానికి పట్టింపు ఉండాలనేది బాలల హక్కుల పరిరక్షకులు కోరుతున్నారు.


ప్రత్యేక విధానం అవసరం..

కరోనా అనంతర పరిణామాల్లో బస్తీల్లోని చాలామంది అబ్బాయిలు బాలకార్మికులుగా మారారు. బాల్యవివాహాల సంఖ్య పెరిగింది. కానీ దీనిమీద ప్రభుత్వం ఎక్కడా పట్టించుకున్న సందర్భం లేదు. విద్యాప్రమాణాలు తగ్గడం కూడా బాలకార్మికులు పెరగడానికి కారణం. ప్రభుత్వం పేద విద్యార్థుల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ప్రత్యేక విధానాన్ని ప్రవేశపెట్టాలి. 

-బ్రదర్‌ వర్గీస్‌, డైరెక్టర్‌, 

మంట్‌ ఫోర్ట్‌ సోషల్‌ ఇనిస్టిట్యూట్‌

పాఠశాల విద్యాశాఖ, లేబర్‌ డిపార్టుమెంట్‌ కలిసి..

కరోనా సమయంలో నగరాల నుంచి సొంతూళ్లకు వెళ్లిన వలస శ్రామికుల పిల్లలు ఇక్కడ స్కూళ్లలోనూ లేరు. అలా అని ఊర్లలోని బడుల్లోనూ లేరు. మా అధ్యయనంలో పాఠశాలల్లో కనిపించని 20 శాతం మంది పిల్లల జాడను ప్రభుత్వం గుర్తించాలి. అందుకు పాఠశాల విద్యాశాఖ, లేబర్‌ డిపార్టుమెంట్‌ కలిసి పనిచేయాలి. 

-ఆర్‌. వెంకటరెడ్డి, ప్రతినిధి, ఎంవీఎఫ్‌ ఫౌండేషన్‌

Updated Date - 2022-06-12T16:46:57+05:30 IST