దవాఖానాల్లో మందుల కొరతకు చెక్‌!

ABN , First Publish Date - 2022-12-15T03:44:10+05:30 IST

సర్కారీ దవాఖానాల్లో మందుల కొరత రాకుండా చూడటమేకాకుండా సులభంగా ఔషధాలను సేకరించేందుకు గాను వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

దవాఖానాల్లో మందుల కొరతకు చెక్‌!

ఔషధాల సేకరణ మరింత సులభం

కొనుగోళ్లకు కొత్త పాలసీ ఖరారు.. జీవో జారీ

హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): సర్కారీ దవాఖానాల్లో మందుల కొరత రాకుండా చూడటమేకాకుండా సులభంగా ఔషధాలను సేకరించేందుకు గాను వైద్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఔషధాల కొనుగోళ్లలో నూతన సంస్కరణలు తెచ్చింది. ఇకపై మందుల వినియోగం ఆధారంగా ప్రతి నెలా పర్చేజ్‌ ఆర్డర్స్‌ (పీఓ) పెట్టనుంది. ఈ మేరకు డ్రగ్స్‌ ప్రొక్యూర్‌మెంట్‌ గైడ్‌లైన్స్‌ను విడుదల చేసింది. తాజాగా ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) మందుల సేకరణలో భాగంగా ఈ కొత్త మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. మందుల కొనుగోలు బడ్జెట్‌లో డీఎంఈ పరిధిలోని ఆస్పత్రులకు 50 శాతం, వైద్య విధానపరిషత్‌కు 30 శాతం, డీహెచ్‌, ఐపీఎంకు కలిపి 20 శాతం కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. ఎసెన్షియల్‌ మెడిసిన్స్‌ లిస్టు(ఈఎంఎల్‌), అడిషనల్‌ మెడిసిన్స్‌ లిస్టు(ఏఎంఎల్‌)లో ఏమేం ఔషధాలు ఉండాలన్న దానిపై డీఎంఈ చైర్మన్‌గా 12 మందితో స్టాడింగ్‌ ఎక్స్‌పర్ట్‌ కమిటీ(ఎస్‌ఈసీ)ని వేసింది. ప్రతి ఏటా ఈ జాబితాపై సమీక్ష నిర్వహించాలి.

ఈఎంఎల్‌, ఎఎంఎల్‌ జాబితాను ఏటా డిసెంబరు 31లోగా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అందజేయాలి. దీన్ని అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల వైద్యులకు చేరేలా చర్యలు తీసుకోవాలి. వైద్యులు ఆ జాబితాలోని మందులనే రాసేలా చూడాల్సిన బాధ్యత నిపుణుల కమిటీదే. ఈ కమిటీ జాబితా ఆధారంగా టీఎ్‌సఎంఎ్‌సఐడీసీ ఏటా ఏప్రిల్‌ ఒకటి నుంచి ఔషధాల కొనుగోలు ప్రారంభించి మార్చి 31లోగా పూర్తి చేయాలి. అన్ని రకాల ఇండెంట్స్‌ రిసెప్ట్స్‌ ఈ ఔషధీ ద్వారానే చేపట్టాలి. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లో 3 నెలలు, గిరిజన ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో 2 నెలలు, ఇతర ఆస్పత్రుల్లో ఒక నెల, ఫార్మసీ స్థాయిలో అయితే ఒక వారానికి సరిపడా ఈఎంఎల్‌ ఔషధాలను నిల్వ ఉంచుకోవాలని ప్రభుత్వం తెలిపింది. వినియోగం ఆధారంగా ప్రతినెలా టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ పర్చేజ్‌ ఆర్డర్లు (పీవో) ఇవ్వాలని ఆదేశించింది. ఇక ఏఎంఎల్‌ జాబితాలోని ఔషధాలను ఇండెంట్‌ లేకుండా కొనుగోలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఔషధాల కొనుగోలుకు సంబంధించిన టెండర్లు, టెక్నికల్‌ బిడ్లను స్ర్కూటినీ చేసేందుకు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చైర్మన్‌గా పది మందితో టెక్నికల్‌ ఎవాల్యూషన్‌ కమిటీని వేసింది. అలాగే ప్రైస్‌ బిడ్డింగ్‌ పర్యవేక్షణ కోసం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్‌ (ఐఎఎస్‌ అధికారి) నేతృత్వంలో ఆరుగురు సభ్యులతో కమర్షియల్‌ ఎవాల్యూషన్‌ కమిటీని వేసింది.

మందుల కొనుగోలు ఇలా...

టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ మందుల కొనుగోలుకు జెమ్‌ ప్లాట్‌ఫామ్‌ లేదా తెలంగాణ ప్రభుత్వ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ పోర్టల్‌నే వినియోగించాలి. ప్రతి ఏటా ఏప్రిల్‌ నుంచి మార్చి మధ్యలో ఆ ఏడాదికి ఔషధాలను కొనుగోలు చేయాలి. వాడకం ఆధారంగా ఈఎంఎల్‌ జాబితాలోని ఔషధాల కోసం ప్రతినెలా పీవోలు ఇవ్వాలి. ఔషధ కొనుగోలు బాధ్యతలు నిర్వహించే టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ కార్పొరేషన్‌కు ప్రభుత్వం కమీషన్‌ ఇస్తుంది. గతంలో ఇది 7 శాతం ఉండగా.. దీన్ని 5 శాతానికి తగ్గించివేస్తూ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2022-12-15T03:44:11+05:30 IST