ప్రసిద్ధ కథా, నవలా రచయిత చావా శివకోటి అస్తమయం

ABN , First Publish Date - 2022-12-21T03:32:50+05:30 IST

ప్రసిద్ధ తెలుగు కథా, నవలా రచయిత చావా శివకోటి(82) మంగళవారం కన్నుమూశారు.

ప్రసిద్ధ కథా, నవలా రచయిత  చావా శివకోటి అస్తమయం

ఖమ్మం సాంస్కృతికం, డిసెంబరు 20: ప్రసిద్ధ తెలుగు కథా, నవలా రచయిత చావా శివకోటి(82) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఖమ్మం మామిళ్లగూడెంలోని తన కూతురు నివాసంలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినపల్లి గ్రామంలో 1940లో చావాపెంటయ్య, ఈశ్వరమ్మ దంపతులకు శివకోటి జన్మించారు. ఆయనకు భార్య ప్రసూనాంబ, కుమార్తె, కుమారుడు ఉన్నారు. స్టువర్ట్‌పురం, కథలోయ్‌ కథలు పుస్తకాలతో పాటు అనేక నవలలు, వందలకు పైగా కథలు రాశారు. ఆంధ్రజ్యోతి నవ్య తదితర వారపత్రికల్లో సీరియళ్లు రాశారు. గోపీచంద్‌ శతజయంతి పేరుతో అప్పట్లోనే సాహిత్య సభలు నిర్వహించి సినారె, దాశరథి, వేటూరి, సిరివెన్నెల లాంటి ప్రసిద్ధ రచయితలను ఖమ్మం పిలిచి సన్మానించారు. సినారె, దాశరథిల సమకాలిక రచయితగా శివకోటి ప్రసిద్ధి పొందారు. సాహిత్యం రంగంలో ఆయన చేసిన కృషికిగాను 2020 డిసెంబరు 31న చివరిసారిగా గుడిపాటి వెంకటాచలం అవార్డును అందుకున్నారు.

Updated Date - 2022-12-21T03:32:51+05:30 IST