‘సికింద్రాబాద్‌’కు మొండి చెయ్యి

ABN , First Publish Date - 2022-09-30T16:04:10+05:30 IST

దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రబింధువైన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి ఆశలు అడియాశలయ్యాయి. చారిత్రక టర్మినల్‌ పునరాభివృద్ధికి కేంద్రం చోటు

‘సికింద్రాబాద్‌’కు మొండి చెయ్యి

స్టేషన్ల పునరాభివృద్ధిలో దక్కని చోటు

చారిత్రక టర్మినల్‌ను విస్మరించిన కేంద్రం


హైదరాబాద్‌ సిటీ: దక్షిణ మధ్య రైల్వేకు కేంద్రబింధువైన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ అభివృద్ధి ఆశలు అడియాశలయ్యాయి. చారిత్రక టర్మినల్‌ పునరాభివృద్ధికి కేంద్రం చోటు కల్పించకపోవడంపై రైల్వే యూనియన్‌, ప్రయాణికులు మండిపడుతున్నారు. సౌత్‌సెంట్రల్‌లో అత్యంత ప్రాధాన్యం కలిగిన స్టేషన్‌ డెవల్‌పమెంట్‌ను పట్టించుకోకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బ్రిటిష్‌ కాలంలో నిర్మాణమైన దేశంలోని ప్రఖ్యాతిగాంచిన రైల్వే స్టేషన్లను సరికొత్తగా తీర్చిదిద్ది ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని ఆయా ప్రాంతాలకు చెందిన ప్రజాప్రతినిధులు, రైల్వే సంఘాలు కొంతకాలంగా కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నాయి. ఇందులో భాగంగా దక్షిణ మధ్య రైల్వేకు తలమానికమైన సికింద్రాబాద్‌ స్టేషన్‌కు సంబంధించి కూడా పార్లమెంట్‌ సభ్యులు కేంద్రాన్ని కోరుతున్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో దేశంలోని న్యూఢిల్లీ, అహ్మదాబాద్‌, సీఎ్‌సఎంటీ ముంబయి రైల్వే స్టేషన్ల పునరాభివృద్ధికి రూ.10వేల కోట్ల పెట్టుబడితో పచ్చజెండా ఊపిన ప్రభుత్వం సికింద్రాబాద్‌ స్టేషన్‌ విస్మరించడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. 


సఖ్యత లేకపోవడంతోనేనా..!

రైల్వే అభివృద్ధి విషయంలో కేంద్రం కొంతకాలంగా శీతకన్ను వేస్తోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తమతో సఖ్యతగా లేదనే భావనతో నిధుల కేటాయింపులో మొండి చేయి చూపిస్తోందని టీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపిస్తుండగా, ఎనిమిదేళ్లలో తెలంగాణలో రూ.9,494 కోట్లతో 12 రకాల కొత్త ప్రాజెక్టులు చేపట్టామని బీజేపీ మంత్రులు చెబుతున్నారు. అయితే రూ.827 కోట్లతో చేపట్టిన ఎంఎంటీఎస్‌ రెండో దశ నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా రూ.529 కోట్లలో ఇప్పటివరకు కేవలం రూ.129 కోట్లు మాత్రమే ఇవ్వగా, తాము రూ.400 కోట్ల వరకు ఇచ్చామని చెబుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకపోవడంతోనే మెరుగైన ప్రాజెక్టులు ముందుకుసాగడంలేదని సభలు, సమావేశాల్లో వాపోతోంది. ఏది ఏమైనా నిత్యం లక్షన్నర మందికి సేవలందిస్తున్న సికింద్రాబాద్‌ స్టేషన్‌ అభివృద్ధికి మోక్షం లభించకపోవడంపై ప్రయాణికులు తీవ్ర నిరాశకు గురయ్యారు.


రూ.653 కోట్లతో ప్రతిపాదన..

సౌత్‌ సెంట్రల్‌ రైల్వే ఆదాయానికి పెద్ద దిక్కుగా నిలుస్తున్న సికింద్రాబాద్‌ స్టేషన్‌ను ఎయిర్‌పోర్టు తరహాలో అభివృద్ధి చేస్తామని కొంతకాలంగా కేంద్ర మంత్రులు చెబుతున్నారు. సుమారు రూ.653 కోట్లతో సికింద్రాబాద్‌ స్టేషన్‌ను నూతనంగా తీర్చిదిద్ది దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధిలో మైలురాయిగా నిలిచే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఇటీవల మెదక్‌ రైల్వేస్టేషన్‌ ప్రారంభోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇదే విషయాన్ని విలేకరుల వద్ద వెల్లడించారు. అయితే మంత్రులు స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ మెగా స్టేషన్ల పునరాభివృద్ధి ప్రతిపాదనల్లో సికింద్రాబాద్‌ను పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది.

Read more