హిల్‌ఫోర్ట్‌ ప్యాలెస్‌ పునరుద్ధరణ కేసులో హైకోర్టు

ABN , First Publish Date - 2022-12-10T02:45:25+05:30 IST

చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోని హిల్‌ఫోర్ట్‌ ప్యాలెస్‌ (రిట్జ్‌ హోటల్‌) పునరుద్ధర ణ విషయంలో సీనియర్‌ ఐఏఎస్‌, ఇతర అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది.

హిల్‌ఫోర్ట్‌ ప్యాలెస్‌ పునరుద్ధరణ కేసులో హైకోర్టు

వారితో ఏపనీ కావడం లేదు

ఐఏఎస్‌ అర్వింద్‌కుమార్‌ 23న హాజరుకావాలి

హైదరాబాద్‌, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): చారిత్రక కట్టడంగా గుర్తింపు పొందిన హైదరాబాద్‌లోని హిల్‌ఫోర్ట్‌ ప్యాలెస్‌ (రిట్జ్‌ హోటల్‌) పునరుద్ధర ణ విషయంలో సీనియర్‌ ఐఏఎస్‌, ఇతర అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై హైకోర్టు శుక్రవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అధికారులను కోర్టుకు పిలవడం పనికిమాలిన (యూజ్‌లెస్‌) లాంఛనంగా మారిపోయినట్లు అర్థమవుతున్నదని ఽధర్మాసనం వ్యాఖ్యానించింది. అధికారుల వల్ల ఏపనీ కావడం లేదని అభిప్రాయపడింది. హిల్‌ఫోర్ట్‌ పునరుద్ధరణ పనులు ప్రారంభం కాకపోవడంపై వివరణ ఇచ్చేందుకు తమ ఎదుట హాజరుకావాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శి కేఎస్‌ శ్రీనివాసరాజు, ఆర్థికశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌, టూరిజం కార్పొరేషన్‌ ఎండీ బి.మనోహర్‌రావు, హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌ ఎస్‌.బాలకృష్ణ శుక్రవారం చీఫ్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌, సీవీ భాస్కర్‌రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం ఎదు ట రెండోసారి హాజరయ్యారు.

మున్సిపల్‌శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ హాజరుకాకపోవడంపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. తాము ఆదేశించినా హాజరుకాలేదని, అర్వింద్‌కుమార్‌ ప్రవర్తన సరిగా లేదని వ్యాఖ్యానించింది. వచ్చే వాయిదాకు కూడా రాకపోతే అరెస్ట్‌ వారంట్‌ జారీచేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. హిల్‌ ఫోర్ట్‌.. తెలంగాణ వారసత్వ సంపదకు అద్దంపట్టే కట్టడమని, దీన్ని పునరుద్ధరించాలని పేర్కొంటూ 2020 ఫిబ్రవరిలో వ్యాజ్యం దాఖలైంది. ప్రొసీడింగ్స్‌ మొదలై రెండున్నరేళ్లయినా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదని కోర్టు పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పిలవక తప్పడం లేదని పేర్కొంది. అర్వింద్‌కుమార్‌ సహా ఇతర అధికారులందరూ సీఎ్‌సతోపాటు ఈ నెల 23న హాజరుకావాలని ఆదేశించింది. పునరుద్ధరణ పనులకు సంబంధించి కచ్చితమైన ప్రతిపాదనలు, టైంలైన్‌తో రావాలని స్పష్టంచేసింది. ఈ ఆదేశాలు అమలుకాకపోతే తప్పు చేసిన అధికారులందరిపై కోర్టు ధిక్కరణ ప్రొసీడింగ్స్‌ ప్రారంభిస్తామని పేర్కొంది.

Updated Date - 2022-12-10T12:21:48+05:30 IST