NTR Stadium: పుస్తకాలపండగొచ్చింది..

ABN , First Publish Date - 2022-12-23T12:56:55+05:30 IST

నగరానికి పుస్తకాల పండగొచ్చింది. సాహితీ ప్రియులను ఎన్టీఆర్‌ స్టేడియానికి రమ్మని ఆహ్వానిస్తోంది. పిల్లలను

NTR Stadium: పుస్తకాలపండగొచ్చింది..

నగరానికి పుస్తకాల పండగొచ్చింది. సాహితీ ప్రియులను ఎన్టీఆర్‌ స్టేడియానికి రమ్మని ఆహ్వానిస్తోంది. పిల్లలను ఆకట్టుకునే బొమ్మల కథలు, యువత మనోవికాసానికి తోడ్పడే రచనలు, ఆలోచనల్ని పదునెక్కించే సామాజిక శాస్త్ర గ్రంథాలు, ఉద్యోగార్థులకు అక్కరకొచ్చే రకరకాల పుస్తకాలెన్నో ఇక్కడ కొలువుదీరాయి. తొలిరోజు విద్యార్థులు, యువతతో కొన్ని పుస్తక స్టాళ్లు కళకళలాడాయి. ఈ పుస్తకాల జాతర జనవరి 1 వరకూ అలరించనుంది.

బాలగోపాల్‌ రచనలు

తెలుగునేల గర్వించదగిన సామాజిక శాస్త్రవేత్త కె.బాలగోపాల్‌. ఆయన రచనలు పుస్తక ప్రదర్శనలోని స్టాల్‌ నెంబర్‌ - 192లో లభ్యమవుతాయి. అందులో ‘కోర్టుతీర్పులు సామాజిక న్యాయం’ తోపాటు సరళీకరణ - విధ్వంసం ఐదు సంపుటాలు, జలపాఠాలు, కల్లోలలోయ 50 ఏళ్ల కశ్మీర్‌, కశ్మీర్‌పై బాలగోపాల్‌, మనిషి మార్క్సిజం, రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం, రూపం - సారం, అణుశక్తి విధ్వంసం, అంతర్జాతీయం, అణచివేత - అణచివేత చట్టాలు తదితర పుస్తకాలున్నాయి. బుక్‌ ఫెయిర్‌ సందర్శకులకు పదిశాతం రాయితీ ఇస్తున్నారు.

వినూత్నంపన్నెండేళ్లకే రచయిత్రిగా...

కరోనా కాలంలో ఇళ్ళకే పరిమితమైన పిల్లలు కొందరు సినిమాలు చూసుంటారని విన్నాం. మరికొందరు వీడియోగేమ్స్‌లో లీనమైనట్లు చూశాం. కానీ 12ఏళ్ల వైష్ణవి మాత్రం పుస్తకాలు రాయడం ప్రారంభించింది. అదీ ఒక్కటి, రెండు కాదు.. ‘జాజ్‌ గ్యాంగ్‌’ సిరీస్‌ పేరుతో మూడు పుస్తకాలను రాసింది. ప్రస్తుతం పదోతరగతి చదువుతున్న వైష్ణవి గురువారం పుస్తక ప్రదర్శనలో తన రచనానుభవాలను సందర్శకులతో పంచుకున్నారు.

రూ.50కే ఆణిముత్యాల్లాంటి రచనలు

యాబై రూపాయలకు ఒకపూట అల్పాహారమే రాదు.. ఇక పుస్తకాలేమిటి అనుకుంటున్నారా. దేశదేశాల సాహిత్యంలోని ఆణిముత్యాల్లాంటి రచనలను, మహనీయులను తెలుగు పాఠకులకు పరిచయం చేయాలనే సంకల్పంతో పీకాక్‌ క్లాసిక్స్‌ యాభైకి పైగా టైటిల్స్‌ను ప్రచురించింది. అందులో గొగోల్‌ ‘మృతజీవులు’, మొపాస కథలు, దస్తయెవస్కీ ‘తిరస్కృతులు’, షేక్స్‌పియర్‌ కథలు, ‘బక్‌’ జాక్‌లండన్‌ ఒక కుక్క కథ, అలెగ్జాండర్‌డ్యూమా ‘ప్రతీకారం’, సర్‌ సీవీరామన్‌, ఐన్‌స్టయిన్‌, మేడం మేరీ క్యూరీ, శ్రీనివాస రామానుజన్‌, జీవిత చరిత్రలు, బుద్ధుడు జీవితం - సందేశం వంటి 44పైగా టైటిల్స్‌... ఒక్కొక్కటీ పుస్తక ప్రదర్శనలో రూ. 50కే అందిస్తున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ ‘భారతీయ తత్వశాస్త్రం’ - రూ.700 విలువ చేసే ఐదు సంకలనాలపై రూ.200 రాయితీ ప్రకటించారు. పీకాక్‌ క్లాసిక్స్‌ ప్రచురణల కోసం స్టాల్‌ నెంబరు -193లో సంప్రదించవచ్చు.

తెలంగాణ సాహిత్య అకాడమీ స్టాల్‌ ప్రారంభం

బుక్‌ ఫెయిర్‌లోని తెలంగాణ సాహిత్య అకాడమీ ప్రచురణల స్టాల్‌ను గురువారం ‘ఆంధ్రజ్యోతి’ ఎడిటర్‌ కె. శ్రీనివాస్‌, తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌ మామిడి హరికృష్ణ, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని డిజిటల్‌ రూపంలో భద్రపరిచి, భవిష్యత్తు తరాలకు అందించే ‘తెలంగాణ డిజిటల్‌ రిపాజిటరీ’ స్టాల్‌ను గురువారం ఐటీ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ జయేష్‌ రంజన్‌ ప్రారంభించారు.

బుక్‌ ఫెయిర్‌లో నేడు

సందర్శనీయ వేళలు - మధ్యాహ్నం2 నుంచి రాత్రి 8.30గంటల వరకు

మధ్యాహ్నం 2గంటలకు - చిన్నారులకు విచిత్ర వేషధారణ పోటీలు

సాయంత్రం 4గంటలకు - ‘తొడిమలేని మొగ్గ’ పుస్తకావిష్కరణ

సాయంత్రం 6గంటలకు - కొండపల్లి నిహారిణి పుస్తకావిష్కరణ

Updated Date - 2022-12-23T12:56:57+05:30 IST