పుస్తకానికి పట్టం

ABN , First Publish Date - 2022-12-24T00:33:04+05:30 IST

‘ఈ స్మార్ట్‌ యుగంలో పుస్తకాలు చదివేవారెవరండి.!’ అనేవాళ్లకు దీటైన సమాధానం ఎన్టీఆర్‌ స్టేడియంలోని పుస్తకాల జాతర.

పుస్తకానికి పట్టం

‘ఈ స్మార్ట్‌ యుగంలో పుస్తకాలు చదివేవారెవరండి.!’ అనేవాళ్లకు దీటైన సమాధానం ఎన్టీఆర్‌ స్టేడియంలోని పుస్తకాల జాతర. యువత, విద్యార్థులతో పుస్తక మహోత్సవ ప్రాంగణం శుక్రవారం కళకళలాడింది. చిన్నారుల వినూత్న వేషధారణ ప్రదర్శన ఆకట్టుకుంది. పుస్తకావిష్కరణలు, చర్చాగోష్ఠులతో పుస్తకాల పండుగ రెండో రోజు సందడిగా సాగింది.

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 23 (ఆంధ్రజ్యోతి):

పిల్లల కోసం..

కథామృతం - 82

చిన్నారులను పుస్తక ప్రపంచంలోకి విహరింపచేస్తుంది ‘మంచిపుస్తకం’. పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు వాళ్లు ప్రత్యేకంగా బొమ్మల కథలు, పుస్తకంతో స్నేహం వంటి కొన్ని అరుదైన పుస్తకాల సిరీ్‌సను ప్రచురించారు. బాలలు ఇష్టపడేలాంటి కథలు, నవలలు సుమారు 250టైటిల్స్‌ పుస్తకాలను ఇక్కడ చూడచ్చు. చందమామ కథలు పదిసంపుటాలు, పంచతంత్ర కథలు, అక్బర్‌ బీర్బల్‌, తెనాలి రామకృష్ణ, విక్రమార్క, భేతాళ కథల తదితర బాల సాహిత్యం కథామృతం స్టాల్‌ -82లో లభ్యమవుతుంది.

ఈ విద్యార్థులు రచయితలు

స్టాల్‌ నెంబర్‌ 38లోకి అడుగుపెట్టగానే ఇరవైఏళ్లలోపు విద్యార్థులు పది మంది తారసపడతారు. వారంతా పుస్తకాలు కొనేందుకు కాదు.. తాము రాసిన పుస్తకాలను పాఠకులకు పరిచయం చేసేందుకు వచ్చారు. అందులో నందిని కొక్కెర్‌ ‘నీతో జర మాట్లాడాల’ అని రాస్తే.. ఇంటర్‌ చదివే శ్రవణ్‌ ‘ఫ్లైయింగ్‌ రెయింబో’ పేరుతో ఇంగ్లిష్‌లో కవిత్వం రాశాడు. నిజామాబాద్‌ జిల్లా వడ్డాయత్‌ తండాకి చెందిన శ్రీజ సిరిగిరి ‘చిన్నతల్లి కోరిక’ పేరుతో వాళ్ల నాన్న జీవితకథను పాఠకలోకం ముందు ఉంచింది. తేజస్విని ‘మదిలో నదిలా...’, అర్చన ‘రేపటి గమనం రేపటి వైపు’, సదా ‘ది అన్‌సీన్‌ రాబరీ’ కవితా సంపుటి ఇలా... ఒక్కొక్కరూ ఒక్కో పుస్తకం రాశారు. వీరంతా తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ వసతి గృహాల్లో ఉంటూ చదువుతున్నవారే. ‘100 ఎయిమ్‌’ ప్రాజెక్టులో భాగంగా వందమంది రచయితలను తయారుచేయాలనే సంకల్పంతో విద్యార్థుల రచనలను ప్రచురించినట్లు సమన్వయకర్త సంధ్యాదీప్తి తెలిపారు.

పుస్తకాల జాతరలో నేడు...

సందర్శన వేళలు: మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 వరకు

కిషోర్‌ కుమార్‌ రాసిన ‘మార్పు’ పుస్తకావిష్కరణ - మధ్యాహ్నం 3 గంటలకు

శ్రీలేఖ కలువకుంట రచించిన ‘యూనిక్‌ థింకింగ్‌’ - సాయంత్రం 4 గంటలకు

బూర్ల వెంకటేశ్వర్లు ‘తెలంగాణ భాషానుశీలన’ - సాయంత్రం 5 గంటలకు

ప్రముఖ కేన్సర్‌ స్పెషలిస్టు నోరి దత్తాత్రేయతో సంభాషణ - సాయంత్రం 6 గంటలకు

మతసామరస్యం పై కవిత్వం ‘అలయ్‌ - బలయ్‌’ - సాయంత్రం 7గంటలకు

కళాకారిణి పద్మినీ బృందం పప్పెట్రీ షో - రాత్రి 8గంటలకు

మనుషులంతా ఒక్కటే అని మరవద్దు

మనుషులంతా ఒక్కటే అనే విషయాన్ని జ్ఞానమెరిగిన మనిషి ఎందుకు మరిచిపోతున్నాడో అర్థంకావడం లేదని డా. బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య సీతారామారావు ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాల జాతరలోని అలిశెట్టి ప్రభాకర్‌ సాహిత్య వేదికపై ‘మతసామరస్యం’ చర్చాగోష్ఠిలో పాల్గొన్న పలువురు వక్తలు గంగాజమునా తెహజీబ్‌ సంస్కృతిని పరిరక్షించే రచనలను పునశ్చరణ చేసుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. హైదరాబాద్‌ సహజీవన సౌందర్యాన్ని ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌ వివరించారు. కార్యక్రమంలో సాహిత్య అకాడమీ యువపురస్కార గ్రహీత మెర్సీ మార్గరేట్‌, తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌, వీక్షణం ఎడిటర్‌ ఎన్‌. వేణుగోపాల్‌ పాల్గొన్నారు.

సంభాషణ కార్యక్రమంలో భాగంగా కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద పురస్కార గ్రహీత సజయ ‘అశుద్ధ భారత్‌’ పుస్తకంపై శుక్రవారం మట్లాడారు. జర్నలిస్టు భాషాసింగ్‌ దేశమంతా పర్యటించి, క్షేత్రస్థాయి పరిశోధనతో ఇంగ్లిష్‌లో రాసిన ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించడంలో తనకు ఎదురైన అనుభవాల గురించి, కుల వ్యవస్థలోని అమానుషాల గురించి వివరించారు.

కవయిత్రి శిలాలోలిత రాసిన ‘నేను ఇక్కడి భూమిని’ కవితా సంపుటిని తెలంగాణ ఉద్యమకారిణి తిరునగరి దేవకీ దేవి ఆవిష్కరించారు.

కొండపల్లి నిహారిణి ‘కాల ప్రభంజనం’ కవితా సంపుటిని ఎలనాగ ‘టెంపెస్ట్‌ ఆఫ్‌ టైమ్‌’ ఆంగ్ల అనువాదం శుక్రవారం అలిశెట్టి ప్రభాకర్‌ సాహిత్య వేదికపై ఆవిష్కరించారు.

Updated Date - 2022-12-24T00:33:06+05:30 IST