బోనం.. వైభవం..

ABN , First Publish Date - 2022-07-18T05:54:30+05:30 IST

కొద్దిరోజులుగా నగరంపై ప్రతాపం చూపుతున్న వరుణుడు కాస్త శాంతించడంతో లష్కర్‌ బోనాల వేడుకలకు భక్తులు పోటెత్తారు.

బోనం.. వైభవం..

ఘనంగా లష్కర్‌ జాతర

అమ్మవారికి సాక, మొక్కుల సమర్పణ

బోనాలతో లష్కర్‌ శోభాయమానంగా వెలుగొందింది. సికింద్రాబాద్‌ వీధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. ఉజ్జయినీ మహాకాళి దర్శనానికి తరలివచ్చిన జనంతో ఆలయ పరిసరాలు కళకళలాడాయి. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, ఫలహార బండ్ల ఊరేగింపులతో ఆదివారం లష్కర్‌ బోనాల జాతర అత్యంత వైభవంగా కొనసాగింది. మరోవైపు.. గోల్కొండ కోట, పాతబస్తీ పరిసరాలు కూడా బోనాలు, ఘటాలతో సందడిగా మారాయి. 


సికింద్రాబాద్‌/రాంగోపాల్‌పేట్‌/రెజిమెంటల్‌బజార్‌/అడ్డగుట్ట జూలై 17 (ఆంధ్రజ్యోతి) : కొద్దిరోజులుగా నగరంపై ప్రతాపం చూపుతున్న వరుణుడు కాస్త శాంతించడంతో లష్కర్‌ బోనాల వేడుకలకు భక్తులు పోటెత్తారు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ కుటుంబ సభ్యులు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకే అమ్మవారికి తొలి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత భక్తులను బోనాలు సమర్పించేందుకు ఆలయంలోకి అనుమతించారు. మహిళలు, యువతులు నెత్తిన బోనాలతో తరలివచ్చారు. అమ్మవారికి బోనాలు, సాక సమర్పించారు. మొక్కులు తీర్చుకున్నారు. శాసనమండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత ఆదయ్యనగర్‌లోని తలసాని నివాసం నుంచి బంగారు బోనంతో ఆలయాన్ని చేరుకున్నారు. మహాకాళి అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

ఆకర్షణీయంగా ఫలహార బండ్లు

లష్కర్‌ బోనాల జాతరలో శివసత్తుల, పోతరాజుల విన్యాసాలు, ఫలహార బండ్ల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణీయంగా నిలిచాయి. ఆదివారం రాత్రి లష్కర్‌లోని వివిధ ప్రాంతాల నుంచి ఊరేగింపుగా తీసుకువచ్చిన ఫలహార బండ్లను చూసేందుకు భక్తులు బారులు తీరారు. కాగా, రెండేళ్ల క్రితం వరకూ లష్కర్‌ జాతరకు విదేశీ భక్తులు కూడా హాజరయ్యేవారు. ఈసారి వారు కనిపించ లేదు. కరోనా కారణమని నిర్వాహకులు భావిస్తున్నారు.


సైడ్‌లైట్స్‌..

 ఉదయం 10.20 గంటలకు హైకోర్టు న్యాయమూర్తి నంద అమ్మవారిని దర్శించుకున్నారు. 

10.30  సమయంలో ఆలయం భక్తులు పెద్దగా కనిపించ లేదు.

10.55కు మీడియా ప్రతినిధుల్ని పోలీసులు బయటికి పంపించారు.

11.35కు ఎమ్మెల్సీ కవిత బోనంతో ఆలయానికి వచ్చారు.

11.40 లోపలకు పంపాలని కవిత అనుచరులు పోలీసులతో ఘర్షణ పడ్డారు.

11.45 నుంచి భక్తుల రాక పెరిగింది. 

సాయంత్రం ఆలయ ప్రాంగణంలోని క్యూలు బోసిపోయి కనిపించాయి. 

ఈసారి జాతరకు ఆశించినంత మంది భక్తులు కనిపించ లేదు.

ఎమ్మెల్సీ కవిత రాకతో బందోబస్తు పేరుతో పోలీసులు అతిగా వ్యవహరించారని ఆరోపణలు వినిపించాయి. 

షీ టీం అదనపు డీసీపీ శిరీష, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ సంధ్య, కానిస్టేబుళ్లు మహిళలకు రక్షణగా నిలిచారు. ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు.


తరలివచ్చిన ప్రముఖులు

ఉజ్జయినీ మహాకాళి అమ్మవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి, హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివా్‌సయాదవ్‌, ఇంద్రకరణ్‌రెడ్డి, సీహెచ్‌.మల్లారెడ్డి, మహమూద్‌అలీ, మల్కాజిగిరి లోక్‌సభ సభ్యుడు, పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, శాసనసభ్యులు ముఠా గోపాల్‌, మేయర్‌ విజయలక్ష్మి, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ మేయర్‌ బండ కార్తీకరెడ్డి, రాష్ట్ర బ్రేవరీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గజ్జెల నాగేష్‌ తదితరులు ఉన్నారు. 


పాతబస్తీలో ఘటాల ఊరేగింపు 

చాంద్రాయణగుట్ట, జూలై 17 (ఆంధ్రజ్యోతి) : పాతబస్తీలో ఘటాల ఊరేగింపు ఆదివారం సాయంత్రం ఘనంగా ప్రారంభమైంది. వేలాది మంది భక్తులు ఘటాలను తిలకించారు. టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అంజన్‌కుమార్‌ యాదవ్‌, కార్పొరేటర్లు ఆలె భాగ్యలక్ష్మి, శంకర్‌ యాదవ్‌ స్వాగతం పలికారు. కళాకారుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, బ్యాండ్‌ మేళాల మధ్య ఊరేగింపు కొనసాగింది. ఉమ్మడి దేవాలయం ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేశ్‌ తివారి ఆధ్వర్యంలో శాలిబండలోని కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వాగతం పలికారు. 


గురువు స్థానంలో ఉండాలి..

మన దేశం విశ్వ గురువు స్థానంలో ఉండాలని కోరుకుంటున్నా. బోనాల పండుగ హైదరాబాద్‌ ప్రజలకు చాలా ప్రత్యేకం. ఇలాంటి సాంప్రదాయం దేశంలో ఎక్కడా లేదు. కరోనా పూర్తిగా ఓడిపోవాలని కోరుకున్నా. 

- జి.కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి


వరుణ శాంతి హోమాలు

తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని వర్షాలతో బాధ పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచనలతో రాష్ట్రంలోని పలు దేవాలయాల్లో వరుణ శాంతి హోమాలు నిర్వహించాం. దీంతో వానలు తగ్గాయి. అమ్మవారి దయతో ఎవరికీ ఇబ్బందులు కలగలేదు. 200 సంవత్సరాల చరిత్ర కలిగిన ఉజ్జయినీ మహాకాళి అమ్మవారు, మాణిక్యాల అమ్మవారు జంటనగరాల్లో ఉండడం ఎంతో అదృష్టం. 

- కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్సీ 

 బుద్ధి మారకుంటే.. వారినే మార్చాలని..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. క్రూరమైన బుద్ధితో పాలించే వారి మనసు మార్చాలని, మారకుంటే వారినే మార్చాలని అమ్మవారిని కోరుకున్నాను. 

-  రేవంత్‌రెడ్డి ఎంపీ





Updated Date - 2022-07-18T05:54:30+05:30 IST