చలో సొంటూర్..!

ABN , First Publish Date - 2022-10-01T18:17:32+05:30 IST

బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగర ప్రజలు సొంతూరి బాట పట్టారు. దీంతో ప్రయాణికులతో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌, జూబ్లీ

చలో సొంటూర్..!

బతుకమ్మ, దసరా పండుగకు పయనం

ఒక్కరోజే జిల్లాలకు 150కి పైగా ప్రత్యేక బస్సులు


హైదరాబాద్‌ సిటీ: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగర ప్రజలు సొంతూరి బాట పట్టారు. దీంతో ప్రయాణికులతో మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌, జూబ్లీ బస్టాండ్లు కిటకిటలాడాయి. శుక్రవారం రాత్రి వరకు తెలంగాణలోని పలు జిల్లాలకు షెడ్యూల్‌ బస్సులతో పాటు 150 వరకు ప్రత్యేక బస్సులు, ఏపీ జిల్లాలకు 30 ప్రత్యేక బస్సులు వెళ్లాయని, బెంగళూర్‌ నుంచి హైదరాబాద్‌కు 21 బస్సులు నడిపినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ పెరిగితే మరో 500 బస్సులను కూడా సమీప జిల్లాలకు నడిపేలా ఆర్టీసీ సిద్ధంగా ఉంచిందన్నారు.

రేపటి నుంచి మరిన్ని..

పండగ దగ్గర పడుతుండటంతో అక్టోబర్‌ 1న 549, రెండున 684, మూడున 766, నాలుగున 838, ఐదున 119 ప్రత్యేక బస్సులు సిద్ధంగా ఉంచినట్లు రంగారెడ్డి రీజియన్‌ మేనేజర్‌ ఎ.శ్రీధర్‌ తెలిపారు. ట్రాఫిక్‌ను దృష్టిలో పెట్టుకొని రెండో తేదీ నుంచి ఉప్పల్‌ క్రాస్‌ రోడ్‌ నుంచి జిల్లాలకు బస్సులను అందుబాటులో ఉంచుతామన్నారు. సీబీఎస్‌ నుంచి కర్నూల్‌, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, మదనపల్లి వైపు షెడ్యూల్‌, స్పెషల్‌ బస్సులు నడుపుతున్నారు. 


ఫీట్లు చేస్తేనే సీట్లు..!

హైదరాబాద్‌ సిటీ/సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): పండుగకు ఊరెళ్లే ప్రయాణికులతో రైల్వేస్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. వృత్తి, ఉపాధిరీత్యా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉంటున్న పొరుగు ప్రాంతాల ప్రజలు భార్య, పిల్లలను వెంటపెట్టుకుని రైళ్లలో తరలివెళ్తుండడంతో ఫ్లాట్‌ఫాంలపై రద్దీ కనిపిస్తోంది. శుక్రవారం నుంచి ప్రైవేటు విద్యాసంస్థలు కూడా సెలవులు ఇవ్వడంతో చాలామంది సికింద్రాబాద్‌, కాచిగూడ, నాంపల్లి, లింగంపల్లి స్టేషన్ల నుంచి అందుబాటులో ఉన్న రైళ్లలో తరలివెళ్లారు. ఒక్కరోజే ఆయా స్టేషన్ల నుంచి దాదాపు 3.50 లక్షల మంది ప్రయాణించినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి. దీంతో రిజర్వేషన్లు అయిపోవడం, జనరల్‌ బోగీలు కిక్కిరిసి ఉండడంతో ప్రయాస తప్పడం లేదు. దసరా పండగకు ఊరెళ్లేవారు నానా ఇబ్బందులు పడుతున్నారు. అదనపు రైళ్లను ఇంకా అందుబాటులోకి తీసుకురాలేదని ప్రయాణికులు వాపోతున్నారు. 

Read more