పెళ్లికి నిరాకరించారని తల్లీకూతుళ్లపై హత్యాయత్నం

ABN , First Publish Date - 2022-10-17T17:28:41+05:30 IST

నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లికి నిరాకరించారనే అక్కసుతో ఓ యువకుడు తల్లీకూతుళ్లపై పెట్రోల్‌ పోసి హత్యాయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవటంతో వారు

పెళ్లికి నిరాకరించారని తల్లీకూతుళ్లపై హత్యాయత్నం

పెట్రోలు పోసి నిప్పంటించేందుకు యత్నించిన యువకుడు

గ్రామస్థులు అడ్డుకోవటంతో దక్కిన ప్రాణాలు 

పోలీసుల అదుపులో నిందితుడు


హైదరాబాద్/ధారూరు : నిశ్చితార్థం జరిగిన తర్వాత పెళ్లికి నిరాకరించారనే అక్కసుతో ఓ యువకుడు తల్లీకూతుళ్లపై పెట్రోల్‌ పోసి హత్యాయత్నం చేశాడు. స్థానికులు అడ్డుకోవటంతో వారు ప్రాణాలతో బయటపడ్డారు. పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ఈ ఘటన వికారాబాద్‌ జిల్లా ధారూరు మండల పరిధిలోని గడ్డమీది గంగారం గ్రామంలో ఆదివారం జరిగింది. ఎస్‌ఐ నరేందర్‌, స్థానికుల కథనం ప్రకారం..... గడ్డమీది గంగారం గ్రామానికి చెందిన గొల్ల రాకేష్‌ (27) కుటుంబంతో కలిసి హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు.


ఇతడు ఆటోమొబైల్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన గొల్ల భారతమ్మ కూతురు శ్రావణి (22)తో రాకే్‌షకు గతేడాది నిశ్చితార్థం జరిగింది. భారతమ్మ.. రాకే్‌షను ఇల్లరికం తెచ్చుకున్నారు. ఈ క్రమంలో రాకే్‌ష, శ్రావణిపై అనుమానం పెంచుకుని గొడవపడుతూ వేధించటం మొదలుపెట్టారు. పెళ్లి కాకముందే వేధింపులకు గురిచేస్తున్న రాకేష్‌ ప్రవర్తన నచ్చని భారతమ్మ గ్రామ పెద్దలకు విషయం తెలిపింది. నాలుగు నెలల క్రితం గ్రామంలో సర్పంచ్‌, పెద్దల సమక్షంలో నిర్వహించిన పంచాయితీలో రాకే్‌షతో జరిగిన నిశ్చితార్థాన్ని శ్రావణి తల్లి రద్దు చేసుకుంది. అనంతరం ఆమెకు వేరే  పెళ్లి సంబంధాలు చూస్తోంది. ఈ విషయం తెలుసుకున్న రాకేష్‌.. ఎలాగైనా శ్రావణినే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వారం రోజులుగా నగరం నుంచి గడ్డమీది గంగారం గ్రామానికి వచ్చి వెళుతున్నాడు. ఆదివారం పెట్రోల్‌ బాటిల్‌తో వెళ్లిన రాకేష్‌ తల్లీకూతుళ్లతో గొడవపడ్డాడు. తాను శ్రావణినే పెళ్లి చేసుకుంటానని ఆగ్రహంతో ఊగిపోతూ వారిపై  పెట్రోల్‌ పోసి హత్యాయత్నానికి యత్నించాడు. స్థానికులు గమనించి రాకే్‌షను అడ్డుకోవటంతో అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నరేందర్‌ సిబ్బందితో గ్రామానికి వెళ్లి జరిగిన ఘటనపై విచారణ జరిపి నిందితుడు రాకే్‌షను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.

Updated Date - 2022-10-17T17:28:41+05:30 IST