బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే దేవుళ్లు, హిందువులపై దాడులు
ABN , First Publish Date - 2022-12-31T23:57:37+05:30 IST
రాష్ట్రంలో హిందువులంతా ఐక్యంగా ఉంటున్నారని, హిందుత్వం పెరిగిపోతోందన్న కారణంతో పక్కా ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే దేవుళ్లు, హిందువులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు.
నాస్తిక సమాజం వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్
కూకట్పల్లి, డిసెంబర్ 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హిందువులంతా ఐక్యంగా ఉంటున్నారని, హిందుత్వం పెరిగిపోతోందన్న కారణంతో పక్కా ప్లాన్ ప్రకారం బీఆర్ఎస్ ప్రోద్బలంతోనే దేవుళ్లు, హిందువులపై దాడులు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. దేవుడిని నమ్మని వాళ్లు, దేవుళ్లను తిట్టేవాళ్లు, హిందూధర్మాన్ని హేళన చేసేవాళ్లు, హిందూ సమాజంపై చిల్లరగా మాట్లాడే వాళ్లకు రాష్ట్రం అడ్డాగా మారిందని అన్నారు. కూకట్‌పల్లిలోని అయ్యప్పస్వామి గుడిలో శనివారం జరిగిన పడిపూజకు హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. నాస్తిక సమాజం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో హిందూ దేవుళ్లను దూషించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. హిందూ ధర్మంపై అభ్యంతకర వ్యాఖ్యలు చేసే వారి వ్యవహారంలో ప్రభుత్వం పక్కా ప్లాన్ ప్రకారమే వ్యవహరిస్తోందని, కేవలం కేసులు నమోదు చేసి నిందితులను వదిలేస్తున్నారని ఆరోపించారు. హిందువులు ఇతర మతాల గురించి మాట్లాడితే మాత్రం... పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయ్యప్పస్వామి, శివుడిని, దేవి, దేవతలను అసభ్య పదజాలంతో తిట్టిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. హిందూ దేవుళ్లను కించపరిచిన వ్యక్తుల విషయంలో పోలీసులు, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోపాటు రక్షణ పేరుతో కాపాడే ప్రయత్నం చేయడం సరైన పద్ధతికాదన్నారు. హిందూ దేవుళ్ల గురించి తప్పుగా మాట్లాడే మున్నావర్ ఫారూక్‌కు ప్రభుత్వం రెడ్ కార్పెట్ వేసి, పోలీసు బందోబస్తు నడుమ నగరం నడిబొడ్డున మీటింగ్ పెట్టించారని ఆరోపించారు. నాస్తిక సమాజం సమావేశంలో హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన వ్యక్తిని ఓ రాష్ట్ర మంత్రి పొగడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణలో హిందూ సమాజం రగిలిపోతున్న ప్రస్తుత తరుణంలో సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మురళీధర్‌రావు, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, మాధవరం కాంతారావు పాల్గొన్నారు.
18 నుంచి నియోజకవర్గాలకు..
హైదరాబాద్, డిసెంబర్ 31(ఆంధ్రజ్యోతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 18 నుంచి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ కమిటీలతో సమావేశం కానున్నారు. ప్రతిపాదిత షెడ్యూల్ ప్రకారం 20-25 రోజుల పాటు ఈ సమావేశాలు జరుగనున్నాయి. పార్టీని సంస్థాగతంగా బలపేతం చేయడంలో భాగంగా సంజయ్ పోలింగ్ బూత్ కమిటీలతో మాట్లాడి అభిప్రాయాలను తీసుకోనున్నారు. పార్టీ సిద్ధాంతాలు, భవిష్యత్ కార్యచరణను వివరిస్తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని ఆయన వివరించనున్నారు. పార్టీ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ నుంచి ఈ సమావేశాలను ప్రారంభించే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది. ఈ మేరకు శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జరిగిన ముఖ్య నేతలు చర్చించారు.