సర్కారు వారి మరో వెంచర్.. రూ.600 కోట్ల ఆదాయమే లక్ష్యం

ABN , First Publish Date - 2022-04-26T16:25:59+05:30 IST

సర్కారు వారి మరో వెంచర్.. రూ.600 కోట్ల ఆదాయమే లక్ష్యం

సర్కారు వారి మరో వెంచర్.. రూ.600 కోట్ల ఆదాయమే లక్ష్యం

  • ఉప్పల్‌ భగాయత్‌ ఫేజ్‌- 3
  • లే అవుట్‌లో చిన్న ప్లాట్లు 
  • 40 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న హెచ్‌ఎండీఏ
  • మౌలిక సదుపాయాలకు రూ.25 కోట్లు

ఉప్పల్‌ భగాయత్‌ ఫేజ్‌-1, ఫేజ్‌-2 లే అవుట్లు హెచ్‌ఎండీఏకు కాసుల వర్షాన్ని కురిపించాయి. అక్కడి భూములను దక్కించుకోవడానికి ఆశావహులు తీవ్రంగా పోటీ పడ్డారు. కొందరు అధిక ధరలు వెచ్చించి మరీ తమ సొంతం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌ఎండీఏ మరో లే అవుట్‌ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం 40 ఎకరాలను సిద్ధం చేస్తోంది.


హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌ తూర్పు భాగంలో రియల్‌ భూమ్‌కు ఊతమిచ్చిన ఉప్పల్‌ భగాయత్‌లో చదరపు గజం హాట్‌ హాట్‌గా మారింది. అక్కడ చిన్న ప్లాట్లకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా మరో కొత్త లే అవుట్‌ దిశగా హెచ్‌ఎండీఏ అడుగులు వేస్తోంది. ఆ ప్రాంతంలో అందుబాటులో ఉన్న మరో 40 ఎకరాల స్థలంలో కనీసం రూ.600 కోట్ల ఆదాయమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తోంది. రూ.25 కోట్లతో అత్యాధునిక మౌలిక సదుపాయాలను కల్పించి ఆకర్షణీయంగా లేఅవుట్‌ను తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తోంది. 


2005లో ఉప్పల్‌ మండలం పరిధిలోని ఉప్పల్‌ భగాయత్‌లోని రైతుల నుంచి 733 ఎకరాల భూములను హెచ్‌ఎండీఏ సేకరించింది. ఇందులో 143 ఎకరాలను మెట్రో రైలు కోసం, 100 ఎకరాలు వాటర్‌బోర్డుకు కేటాయించారు. అయితే ఫేజ్‌-1 కింద 413 ఎకరాల్లో భారీ లేఔట్‌ను హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. ఇందులో 100, 80, 60, 40 అడుగులతో రోడ్లను నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దింది. భూములిచ్చిన రైతులకూ లే అవుట్లలోని ప్లాట్లను పంపిణీ చేశారు. మిగిలిన ప్లాట్లను పలు విడుతల్లో హెచ్‌ఎండీఏ విక్రయించింది. అదేవిధంగా ఉప్పల్‌ భగాయత్‌లోనే మల్లీపర్పస్‌ జోన్‌లో ఉన్న 70.11 ఎకరాలను ఫేజ్‌-2 లేఅవుట్‌ పేరుతో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసింది. ప్లాట్లను కూడా విక్రయించింది.


వంద ఎకరాలు ఉండగా..

నాగోల్‌ నుంచి ఉప్పల్‌ వైపు వెళ్ళే మార్గంలో కుడి వైపు ఉప్పల్‌ భగాయత్‌ ఫేజ్‌-1 లేఅవుట్‌ ఉండగా, కుడి వైపున ఫేజ్‌-2 లేవుట్‌ చేశారు. అయితే ఫేజ్‌-1 లేఅవుట్‌ వెనుక భాగంలో హెచ్‌ఎండీఏకు సుమారు వంద ఎకరాల వరకు స్థలం ఉండేది. అయితే పలు విడతల్లో వివిధ కుల సంఘ భవనాలకు భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇలా పలు కుల సంఘాలకు భూములను కేటాయించగా ప్రస్తుతం 40ఎకరాల వరకు భూమి అందుబాటులో ఉంది.


అభివృద్ధి పనుల కోసం టెండర్లు..

ఉప్పల్‌ భగాయత్‌లోని ఫేజ్‌-3 లేఅవుట్‌ను అభివృద్ధి కోసం రూ.25కోట్లు వ్యయం చేయాలని నిర్ణయించారు. పనులు చేపట్టేందుకు ఇటీవల హెచ్‌ఎండీఏ అధికారులు టెండర్లను కూడా ఆహ్వానించారు. ఫేజ్‌-3 లేఅవుట్‌లో 30 నుంచి 40అడుగుల మేర విస్తీర్ణం కలిగిన రోడ్లు నిర్మించనున్నారు. విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ సరఫరా వ్యవస్థను, ఫుట్‌పాత్‌లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ, పార్కుల అభివృద్ధి తదితర పనులు చేపట్టనున్నారు. 9 నెలల్లో లేఅవుట్‌ అభివృద్ధి చేయడానికి నిర్ణయించారు. అయితే ఓ వైపు లేఅవుట్‌ అభివృద్ధి పనులు చేపడుతూనే మరో వైపు ప్లాట్లను ఈ-వేలం వేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలన చేస్తున్నారు. లేఅవుట్‌ అభివృద్ధి చేసిన తర్వాత ప్లాట్లకు వచ్చే ధర, అభివృద్ధి చేయకముందు ప్లాట్లకు వచ్చే ధరపై అంచనాలు రూపొందిస్తున్నట్లు తెలిసింది.


లక్ష చదరపు గజాలు..

ఉప్పల్‌ భగాయత్‌లోని ఫేజ్‌-1, ఫేజ్‌-2 లేఅవుట్‌లో మిగిలిన ప్లాట్లను ఇటీవలే హెచ్‌ఎండీఏ ఈ-వేలం వేసిన విషయం విధితమే. ఆ సందర్భంలోనే ఫేజ్‌-3 పేరుతో రెండెకరాల నుంచి ఐదు ఎకరాల విస్తీర్ణంలో గల భూమిని చదరపు గజాల్లో విక్రయించడానికి ప్లాన్‌ చేశారు. కానీ భారీ విస్తీర్ణంతో చ.గజం ధర గణనీయంగా పడిపోయింది. అప్‌సెట్‌ ధర హెచ్‌ఎండీఏ రూ.35 వేలు నిర్ణయిస్తే, చిన్న ప్లాట్లు రూ.70 వేల నుంచి లక్షకు పైగా అమ్ముడుపోయాయి. కానీ పెద్దప్లాట్లు అప్‌సెట్‌ ధర రూ.35వేల కంటే వెయ్యి మాత్రమే అధికంగా అమ్ముడుపోయాయి. ఈ క్రమంలోనే ఉప్పల్‌ భగాయత్‌లో పెద్ద ప్లాట్ల కంటే చిన్న ప్లాట్లకు భారీ డిమాండ్‌ ఉందని గ్రహించిన అధికారులు అందుకనుగుణంగా ప్రణాళికలు రూపొందించారు. 40 ఎకరాల విస్తీర్ణంలోని లేఅవుట్‌లో రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలకు స్థలం పోగా లక్ష చదరపు గజాల భూమి విక్రయానికి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చదరపు గజం సగటున రూ.60 వేలకు అమ్ముడుపోయినా హెచ్‌ఎండీఏకు రూ.600 కోట్ల ఆదాయం వస్తుందని అంచనాలు వేస్తున్నారు.

Updated Date - 2022-04-26T16:25:59+05:30 IST