ఇంధన పరిరక్షణలో రాష్ట్రానికి మరో అవార్డు

ABN , First Publish Date - 2022-12-15T03:30:02+05:30 IST

తెలంగాణను మరో జాతీయ అవార్డు వరించింది.

ఇంధన పరిరక్షణలో రాష్ట్రానికి మరో అవార్డు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను మరో జాతీయ అవార్డు వరించింది. గ్రూప్‌-2లోని రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎ్‌సరెడ్కో) సర్టిఫికెట్‌ ఆఫ్‌ మెరిట్‌ అవార్డు సొంతం చేసుకుంది. 32వ జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి రాజ్‌ కుమార్‌ సింగ్‌ చేతుల మీదుగా రెడ్కో చైర్మన్‌ వై.సతీశ్‌ రెడ్డి, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జానయ్య ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా సతీశ్‌ రెడ్డి మాట్లాడుతూ ఇంధన పరిరక్షణలో తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకుగాను ఈ పురస్కారం లభించిందన్నారు. దేశంలోనే తొలిసారిగా ఎనర్జీ కన్జర్వేషన్‌ బిల్డింగ్‌ కోడ్‌ను మున్సిపల్‌ చట్టంలో చేర్చిన రాష్ట్రంగా తెలంగాణ ఘనత సాధించిందన్నారు. ఈ అవార్డు తమకెంతో ఉత్సాహాన్నిచ్చిందని, రాబోయే రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఇది ప్రోత్సాహకరంగా ఉంటుందని సతీశ్‌ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-12-15T03:30:11+05:30 IST