అమ్మ నాన్నోయ్..
ABN , First Publish Date - 2022-11-05T05:58:14+05:30 IST
బిడ్డలు తనను బాగా చూడటం లేదని, తాను సంపాదించిన ఆస్తిలో వారికి చిల్లిగవ్వ ఇచ్చేది లేదంటూ హనుమకొండలో ప్రజలకు డబ్బు పంచి వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి గుర్తున్నాడా
ఆస్తి కోసం.. బిడ్డ చనిపోయినట్లు నకిలీ ధ్రువపత్రం
ప్రజలకు డబ్బు పంచి వార్తల్లోకి ఎక్కిన వ్యక్తే ఇతడు!
గిఫ్ట్ డీడ్ చేసిన ఇంటి స్వాధీనం కోసం తాజా నాటకం
జీడబ్ల్యూఎంసీ నుంచి అక్రమంగా మరణ ధ్రువపత్రం
రిజిస్ట్రేషన్ ఆఫీస్‌లో లంచంతో డాక్యుమెంట్ మార్పు
పోలీసులకు ఫిర్యాదు చేసిన కుమార్తె.. కేసు నమోదు
హనుమకొండ క్రైం, నవంబరు 4: బిడ్డలు తనను బాగా చూడటం లేదని, తాను సంపాదించిన ఆస్తిలో వారికి చిల్లిగవ్వ ఇచ్చేది లేదంటూ హనుమకొండలో ప్రజలకు డబ్బు పంచి వార్తల్లోకి ఎక్కిన వ్యక్తి గుర్తున్నాడా? ఇప్పుడదే వ్యక్తి సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. బతికున్న బిడ్డ మరణించినట్లుగా సర్టిఫికెట్ తెచ్చి గతంలో గిఫ్ట్ డీడ్ చేసిన ఇంటిని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే బిడ్డ తనను చూడటం లేదంటున్నాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. హనుమకొండ పోచమ్మకుంటకు చెందిన సముద్రాల ఐలయ్య మేస్త్రీ. ఈయనకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. పిల్లలకు చిన్నతనంలోనే తలా కొంత స్థలం కేటాయించి మూడు ఇళ్లు నిర్మించాడు. వాటిని గిఫ్ట్‌డీడ్ చేసి రిజిస్ట్రేషన్ పత్రాలను తన వద్దనే ఉంచుకున్నాడు. పెళ్లిళ్ల సమయంలో ఇద్దరు బిడ్డలకు తలో ఇంటిని కట్నంగా ఇచ్చాడు. చిన్న కుమార్తె విజయలక్ష్మిని 2011లో మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామానికి చెందిన అన్నారపు వెంకటేశ్వర్లుకు ఇచ్చి పెళ్లి చేశాడు.
కట్నం కింద.. పోచమ్మకుంటలో 2009లో వంద చదరపు గజాల్లో రిజిస్ట్రేషన్ చేసిన ఇంటిని ఇస్తానని ఒప్పుకొన్నాడు. అయితే, అదే ప్రాంతంలో అద్దెకు ఉంటూ ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న కూతురు, అల్లుడు పత్రాలు ఇవ్వమని చాలాకాలంగా అడుగుతున్నా కారణాలు చెబుతూ ఐలయ్య జాప్యం చేస్తున్నాడు. వారి ఒత్తిడి పెరగడంతో.. చివరకు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో పనిచేసే ఓ వ్యక్తిని కలిసి సలహా తీసుకున్నాడు. ఎలాగైనా ఇల్లు తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యేలా చూడాలని పెద్ద మొత్తంలో డబ్బు ముట్టజెప్పాడు. బిడ్డ మరణించినట్లు సర్టిఫికెట్ తెస్తే ఇల్లు దక్కించుకోవచ్చని ఆ ఉద్యోగి సూచించాడు. దీంతో 2009 మే 19న సుబేదారిలోని ఓ ఆస్పత్రిలో వైద్యం పొందుతూ విజయలక్ష్మి చనిపోయినట్లు ఐలయ్య సర్టిఫికెట్ సంపాదించాడు. దానితో వరంగల్ కార్పొరేషన్ నుంచి.. 2009 జూన్ 10వ తేదీతో మరణ ధ్రువపత్రం పొందాడు.
ఈ పత్రంతో.. విజయలక్ష్మికి గిఫ్ట్ డీడ్ చేసిన ఇంటిని తన పేరుమీదకు మార్చాని గత నెల 27న వరంగల్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేశాడు. దళారీ ద్వారా చూసీచూడనట్లు నటించిన రిజిస్ట్రేషన్ అధికారులు.. డబ్బు ఆశతో ఐలయ్య పేరు మీదకు పత్రాలను మార్చారు. దళారీ మంగళవారం అసలు పత్రాలు ఐలయ్యకు తెచ్చి ఇచ్చాడు. ఇది తెలిసి విజయలక్ష్మి హనుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సెక్షన్ 420 కింద కేసు నమోదు చేశారు. పోలీసులు ఫోన్ చేసి ఐలయ్యను స్టేషన్‌కు రావాలని కోరగాఆరోగ్యం బాగా లేదని, హైదరాబాద్‌లో ఉన్నట్లు చెప్పినట్టు సమాచారం. కాగా, ఈ తతంగం అంతటినీ తనకు ఇచ్చిన ఇంట్లో అద్దెకు ఉంటున్న పోలీసు అధికారి నడిపిస్తున్నట్టు విజయలక్ష్మి ఆరోపిస్తోంది. మరోవైపు విజయలక్ష్మి డెత్ సర్టిఫికెట్ నకిలీది అని బల్దియా అధికారులు తేల్చారు. దీనిపై లోతుగా పరిశీలిస్తున్నారు.