KCR ప్రకటనతో నిరుద్యోగుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది కానీ..

ABN , First Publish Date - 2022-03-10T14:51:50+05:30 IST

ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. డిగ్రీలు, పీజీలు పూర్తిచేసి ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం..

KCR ప్రకటనతో నిరుద్యోగుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది కానీ..

  • పోస్టులు స్వల్పం.. పోటీ తీవ్రం
  • కేసీఆర్‌ ప్రకటనతో నిరుద్యోగుల్లో ఉత్సాహం
  • జిల్లా విద్యాశాఖలో 219 పోస్టుల ఖాళీ
  • బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు 14 వేలకు పైనే..


ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న నిరుద్యోగుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. డిగ్రీలు, పీజీలు పూర్తిచేసి ఏళ్ల తరబడి ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న తరుణంలో కేసీఆర్‌ ప్రకటనతో ఆశలు చిగురించాయి. అయితే, పోస్టులు వందల్లో, నిరుద్యోగులు వేలల్లో ఉండడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. ఈ నేపథ్యంలో మెళకువల కోసం కోచింగ్‌ సెంటర్లకు పరుగులు తీస్తున్నారు. ప్రధానంగా టీచర్‌ కొలువు కోసం బీఈడీ, డీఈడీ అభ్యర్థులు కసరత్తు ప్రారంభించారు.


హైదరాబాద్‌ సిటీ : గ్రేటర్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 47 ప్రభుత్వ, ప్రైవేట్‌ బీఈడీ కాలేజీలున్నాయి. ఇందులో ఏటా 4700 మంది విద్యార్థులు బీఈడీ పూర్తి చేస్తున్నారు. 12 డీఈడీ కళాశాలల్లో ఏటా 480 మంది కోర్సులను పూర్తిచేస్తున్నట్లు తెలుస్తోంది. 2017 తర్వాత నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం టీఆర్‌టీ నోటిఫికేషన్‌ విడుదల చేయకపోవడంతో ఉపాధ్యా య వృత్తికోర్సులు చేస్తున్న వారి సంఖ్య ఏటా పెరుగుతూనే ఉంది. 2019 నుంచి 2021 వరకు బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు 14,100 మంది ఉండగా, 1440 మంది డీఈడీ అభ్యర్థులున్నట్లు తెలిసింది. నోటిఫికేషన్లు లేక కొందరు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో పని చేస్తుండగా, మరికొందరు ఆటోలు, క్యాబ్‌లు నడుపుతూ, వ్యాపారాలు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు.


పని భారం

జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. దీనికితోడు కరోనా సమయంలో విద్యా వలంటీర్లను తొలగించడంతో ఉపాధ్యాయులపై పని భారం పెరిగింది. ఫిల్మ్‌నగర్‌, ఎన్‌బీటీనగర్‌, బోరబండ, ముషీరాబాద్‌ పాఠశాలల్లో 1000 మందికిపైగా విద్యార్థులుండడంతో మూడు, నాలుగు సెక్షన్లు చేసి పాఠాలను బోధిస్తున్నారు. సింగిల్‌ టీచర్‌ స్కూళ్లలో బోధన కుంటుపడుతోంది.


జిల్లాలో మొత్తం 5, 268 పోస్టులు

ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ చేసిన ప్రకటనతో నిరుద్యోగులు పోటీ పరీక్షలకు మళ్లీ సిద్ధమవుతున్నారు. జిల్లాలో వివిధ కేటగిరీల్లో మొత్తం 5,268 పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో 219 పోస్టులు విద్యాశాఖలో ఉన్నట్లు తెలియడంతో బీఈడీ, డీఈడీ అభ్యర్థులు ఉత్సాహంతో ఉన్నారు. లోకల్‌ కేటగిరీలో తప్పకుండా ఉద్యోగం సాధిస్తామనే ధీమాతో సిద్ధమవుతున్నారు. 


స్వాగతిస్తున్నాం : రవీందర్‌, టీపీటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నాం. విద్యాశాఖలో గుర్తించిన అన్ని ఖాళీల నియామకానికి నోటిఫికేషన్‌ విడుదల చేయాలి. గురుకులాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ అవర్లీ బేస్డ్‌, ఔట్‌ సోర్సింగ్‌ టీచర్లను రెగ్యులర్‌ చేయాలి. 


పోస్టులన్నీ భర్తీ చేయాలి : జీవన్‌, ఏబీవీపీ స్టేట్‌ జాయింట్‌ సెక్రటరీ

నాలుగేళ్లుగా ఖాళీగా ఉన్న 1.92 లక్షల ఉద్యోగాల్లో కేవలం 91,142 ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు మాత్రమే ప్రభుత్వం ప్రకటించింది. ఖాళీ ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసి కేసీఆర్‌ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.


జేఎన్‌టీయూహెచ్‌లో 240 టీచింగ్‌ పోస్టుల ఖాళీ

జేఎన్‌టీయూ హైదరాబాద్‌లో టీచింగ్‌ పోస్టులు 240, నాన్‌ టీచింగ్‌ పోస్టులు 148 వరకు ఖాళీలున్నాయని గతేడాది జేఎన్‌టీయూహెచ్‌ ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపింది. ఈ ఏడాది నుంచి సుల్తానాపూర్‌లోని ఫార్మసీ కళాశాల, సిరిసిల్లలోని ఇంజనీరింగ్‌ కళాశాలలు అందుబాటులోకి తీసుకురాగా ప్రస్తుతం ఉన్న ప్రొఫెసర్లను అక్కడ ప్రిన్సిపాల్స్‌గా నియమించారు. టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగులను కాంట్రాక్ట్‌ పద్ధతిలో తీసుకున్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తారా, లేదా అన్నది ఆసక్తిగా మారింది. 


వాటర్‌బోర్డు సిబ్బందిలో నిరుత్సాహం 

పదకొండు వేల మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వాటర్‌బోర్డులో పని చేస్తున్న సిబ్బంది ఆ జాబితాలో తాము కూడా ఉన్నామని ఆరా తీశారు. మీరంతా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు కాదని, ఔట్‌ సోర్సింగ్‌లో ఓ ఏజెన్సీ తరఫున పని చేస్తున్నారని చెప్పడంతో ఉసూరుమంటూ వెనుదిరిగారు. వాటర్‌బోర్డులో పని చేస్తున్న సిబ్బందిలో ఒక్కరు కూడా కాంట్రాక్ట్‌ ఉద్యోగులు లేకపోగా, ఔట్‌ సోర్సింగ్‌ ప్రతిపాదికన మూడు వేల మందికి పైగా పని చేస్తున్నారు.

Updated Date - 2022-03-10T14:51:50+05:30 IST