హైదరాబాద్ పేరు నిలపాలి : రాణా
ABN , First Publish Date - 2022-06-29T16:56:42+05:30 IST
స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి, ప్రపంచ పటంలో హైదరాబాద్ పేరును నిలపాలని ప్రముఖ నటుడు దగ్గుపాటి రాణా కోరారు. హైటెక్ సిటీలో

హైదరాబాద్ సిటీ: స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ ఖ్యాతిని సాధించి, ప్రపంచ పటంలో హైదరాబాద్ పేరును నిలపాలని ప్రముఖ నటుడు దగ్గుపాటి రాణా కోరారు. హైటెక్ సిటీలో మంగళవారం టీహబ్ నూతన భవన ప్రారంభోత్సవంలో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజా ప్రతినిధులకు, సినిమాలకు, క్రీడలకు, స్టార్టప్ సంస్థలకు టీ హబ్ కేరా్‌ఫగా నిలిచిందన్నారు. గతంలో ఒకే సంస్థలో ఏళ్ల తరబడి పనిచేసేవారని, కానీ నేటి యువకులు ఇతరుల వద్ద పనిచేయకుండా, తామే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా మారి ఇతరులకు పని కల్పిస్తున్నారని ప్రశంసించారు. అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. స్టార్ట్‌పల కోసం టీహబ్‌ను ప్రారంభించిన కేటీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు.
ఫ్రెండ్లీ పీపుల్స్, సేఫ్ సిటీ : ఆపర్చునిటీ హైదరాబాద్‌లో వక్తలు
దేశంలోని ఇతర నగరాలతో హైదరాబాద్‌ను పోల్చడం కుదరదని, నగరానికి ఉన్న ప్రత్యేకతల కారణంగానే పెట్టుబడులు, సంస్థలు వస్తున్నాయని పలు స్టార్టప్ సంస్థల సీఈఓలు అభిప్రాయం వ్యక్తం చేశారు. టీహబ్ ప్రారంభ సందర్భంగా ‘ఆపర్చునిటీ హైదరాబాద్’ పేరుతో నిర్వహించిన చర్చా వేదికలో జినోటీ సీఈఓ ఆనంద్ అరవింద్, రెడ్డి ఫ్యూచర్స్ ఫండ్ మేనేజింగ్ పార్ట్‌నర్ కేశవ రెడ్డి, క్వాంటెలా ఫౌండర్ చైర్మన్ శ్రీధర్ గాంధీ, ఎండియా పార్ట్‌నర్స్ ఎండీ సతీస్ ఆంధ్ర, ఎక్సిప్లోమిక్ లిమిటెడ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్ కొల్లిపర తదితరులు పాల్గొన్నారు.
తప్పులు చేసి, పాఠాలు నేర్చుకున్నా : స్విగ్గీ కో ఫౌండర్ సీఈఓ శ్రీహర్ష మాజేటి
సరైన సమయంలో, సరైన చోటులో, సరైన వ్యక్తులు కలిసి పనిచేస్తే కచ్చితంగా విజయం సాధిస్తామని స్విగ్గీ కో ఫౌండర్, సీఈఓ శ్రీహర్ష అన్నారు. తాము మొదటిగా ప్రారంభించిన స్టార్టప్ బండిల్ నిర్వహణ సమయంలో ఎదుర్కొన్న పాఠాలతో స్విగ్గీని ప్రారంభించామన్నారు. ఓటమి పాఠాలను నేర్పుతుందని, ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయాలన్నారు.
బిజినెస్ పెరిగితే అభివృద్ధి కాదు: మీషో సీఈఓ విదిత్ ఆత్రే
బిజినెస్ పెరిగితే అభివృద్ధి సాధించినట్లు కాదని, సాధారణ ప్రజల నమ్మకాన్ని సాధించినపుడే సంస్థ విజయవంతమవుతుందని మీషో సీఈఓ విదిత్ ఆత్రే అన్నారు. మీషో ప్రారంభించిన అనతి కాలంలోనే యునీకార్న్ సంస్థగా ఎదగడంలో ఉద్యోగులది కీలక పాత్ర అన్నారు. తమ సంస్థ యునీకార్న్ గ్రూపులో చేరేందుకు కొనుగోలు దారులు సంస్థపై ఉంచిన నమ్మకమే కారణమన్నారు.