ఉద్యోగులను వేధిస్తున్న ఏసీబీ అధికారులు
ABN , First Publish Date - 2022-12-07T03:50:08+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి నిరోధక సంస్థ(ఏసీబీ)లోని కొందరు అధికారులు వేధిస్తున్నారని, వాటిని మానుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది.
విచారణ సమయంలో అధికారుల తీరుపై అభ్యంతరం
సున్నిత మనస్కుల ఆత్మహత్యలు
తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు ఏ.పద్మాచారి
హైదరాబాద్, డిసెంబర్ 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను అవినీతి నిరోధక సంస్థ(ఏసీబీ)లోని కొందరు అధికారులు వేధిస్తున్నారని, వాటిని మానుకోవాలని తెలంగాణ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. తెలంగాణలో విచారణ సందర్భంగా ఏసీబీ అధికారుల తీరు అభ్యంతరకరంగా ఉందని తెలంగాణ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షుడు ఏ. పద్మాచారి ఆరోపించారు. ఈ వేధింపులు తట్టుకోలేక సున్నిత మనస్తత్వం కలిగిన కొంతమంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులు కీలక పాత్ర పోషించారన్నారు. జల్పల్లి మున్సిపల్ కమిషనర్ జి.ప్రవీణ్‌కుమార్ ఇంట్లో సోదాలు చేపట్టిన ఏసీబీ అధికారులు, ఆయనపై భౌతిక దాడి చేశారని ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులపై కూడా దాడులు చేశారని, తనవి కాని ఆస్తులు తనవని ఒప్పుకోవాలంటూ బలవంతంగా కాగితాలపై సంతకాలు చేయించుకున్నారన్నారని తెలిపారు. ఇలా ఏసీబీ అధికారులు తమ పరిధిని దాటి ఉద్యోగులపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిడి వల్లనో, వేరే ఒత్తిడి వల్ల ఏసీబీ అధికారులు దాడి చేశారో ఆ శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వం విచారణ జరిపితే నిజాలు వెల్లడవుతాయన్నారు. ఆయన ఏమైనా తప్పు చేసి ఉంటే శాఖా పరమైన విచారణ జరిపించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కాని ఏసీబీ దాడులు ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టరాదని సీఎం కేసీఆర్ పలుమార్లు చెప్పినా, ఏసీబీ అధికారుల్లో మార్పు రావడం లేదని చెప్పారు. ప్రవీణ్ కుమార్ ఇంట్లో ఏసీబీ అధికారులు ప్రవర్తించిన తీరుపై హైకోర్టులో పిటిషన్ వేశామన్నారు. ఏసీబీ బనాయించిన కేసులను త్వరగా పరిష్కరించి ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.