ఆకెళ్ళ నాటిక రచన పోటీ ఫలితాలు వెల్లడి
ABN , First Publish Date - 2022-08-04T05:32:08+05:30 IST
విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, ఆకెళ్ళ ఫౌండేషన్ నిర్వహణలో
రవీంద్రభారతి, ఆగస్టు 3(ఆంధ్రజ్యోతి): విశ్వశాంతి కల్చరల్ అసోసియేషన్, ఆకెళ్ళ ఫౌండేషన్ నిర్వహణలో రెండు తెలుగు రాష్ట్ర స్థాయిలో నాటికల రచనా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో ఎంపిక చేసిన ఉత్తమ రచనల వివరాలను బుధవారం రవీంద్రభారతి పైడి జయరాజ్ ప్రివ్యూ థియేటర్‌లో జరిగిన మీడియా సమావేశంలో రసరంజని సంస్థ అధ్యక్షుడు, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డా.కేవీ.రమణాచారి వెల్లడించారు. నాటిక రచనా పోటీల్లో ఆధునిక పరిస్థితుల్లోనూ 78 ఎంట్రీలు రావటం విశేషమని రంగస్థలానికి మనుగడ ఉందని నిరూపిస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. న్యాయ నిర్ణేతల కమిటీ నిర్ణయించిన మేర సింహప్రసాద్ రచించిన గ్రహణంకు ప్రథమ, వల్లూరి శిప్రసాద్ రచించిన మెండి అంచులుకు ద్వితీయ, పెద్దింటి అశోక్‌కుమార్ రచించిన మరణ వార్తకు తృతీయ బహుమతులు లభించాయని తెలిపారు. మూడు కన్సోలేషన్ బహుమతులకు భరత్‌కుమార్ అద్దేపల్లి రచించిన ఆలితో అగచాట్లు, అనంత శయన రచించిన సర్వేజనా, జి.నాగేశ్వరరావు రచించిన మలిసంథ్య నాటికలు ఎంపికయ్యాయని తెలిపారు. ప్రథమ బుహుమతి రూ. 50వేలు, ద్వితీయ బహుమతి రూ. 30వేలు, తృతీయ బహుమతి రూ. 20వేలు, కన్సోలేషన్ బహుమతి ఒక్కొక్కరికి రూ. 5 వేలు నగదు పురస్కారాలను అందజేయనున్నట్టు తెలిపారు. ఆగస్టు నెలలో రవీంద్రభారతిలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు తెలియజేశారు. కార్యక్రమంలో రంగస్థల ప్రముఖులు బీ.ఎన్.రెడ్డి, సమ్మెట గాంథి, ఆకెళ్ళ, సంగీత నాటక అకాడమీ కార్యదర్శి వసుంధర తదితరులు పాల్గొన్నారు.