జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక ద్వారా ఉద్యమం

ABN , First Publish Date - 2022-12-07T03:43:25+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వాములైన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక ద్వారా ఉద్యమం చేపట్టబోతున్నట్టు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు.

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఐక్యవేదిక ద్వారా ఉద్యమం

గృహ వసతిని ఏర్పాటుచేయాలి

దళిత జర్నలిస్టులకు దళితబంధు వర్తింపచేయాలి

ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ

ఖమ్మం చర్చికాంపౌండ్‌, డిసెంబరు 6: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగస్వాములైన జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి జర్నలిస్టు సంఘాల ఐక్యవేదిక ద్వారా ఉద్యమం చేపట్టబోతున్నట్టు ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తెలిపారు. మంగళవారం ఖమ్మంలో మాట్లాడుతూ 2104ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్‌ఎస్‌ జర్నలిస్టుల కోసం ప్రకటించిన హామీల్లో ఏ ఒక్కదాన్ని అమలు చేయలేదని ఆరోపించారు. జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు, ఇళ్లు తదితర హామీల్లో 10శాతం కూడా అమలు కాలేదన్నారు. జర్నలిస్టులకు పూర్తిస్థాయిలో అక్రెడిటేషన్లు, హెల్త్‌కార్డులు అందలేదన్నారు. సంక్షేమపథకాల అమలులో దేశంలోనే అగ్రభాగంలో ఉన్నట్టు చెబుతున్న ప్రభుత్వం, జర్నలిస్టుల సంక్షేమ పథకాలు అమలుచేయడంలో వెనుకబడే ఉందన్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాలలో రిటైర్డ్‌ జర్నలిస్టులకు పెన్షన్‌ సౌకర్యం ఉందని గుర్తు చేశారు. ఇదే తరహాలో తెలంగాణలో కూడా జర్నలిస్టులకు పెన్షన్‌ సౌకర్యం కల్పించాలని, గృహవసతి కల్పించాలని కోరారు.

మంత్రి హరీ్‌షరావు, ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు, ముఠా గోపాల్‌ తమ పరిధిలోని దళిత జర్నలిస్టులకు దళితబంధు పథకాన్ని మంజూరుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత జర్నలిస్టులకు దళితబంధు పథకం అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక ఆదేశాలు జారీచేయాలని కోరారు. నూతనంగా ఏర్పాటైన మహాజన సోషలిస్టు వర్కింగ్‌ జర్నలిస్టు యూనియన్‌ జాతీయ మహాసభలు ఫిబ్రవరి 23న హైదరాబాదులో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం గుర్తింపు కలిగిన అన్ని జర్నలిస్టుల సంఘాలతో కలిసి జాతీయ మహాసభలను నిర్వహిస్తామని తెలిపారు. ఈసందర్భంగా టీయూడబ్ల్యుజే(ఐజేయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.రాంనారాయణ జర్నలిస్టుల సమస్యలపై మంద కృష్ణమాదిగకు వినతిపత్రం అందించారు.

Updated Date - 2022-12-07T03:43:25+05:30 IST