నౌహీరా కేసులో రూ.78.63 కోట్ల ఆస్తుల అటాచ్
ABN , First Publish Date - 2022-12-15T03:13:48+05:30 IST
నౌహీరా షేక్ రూ. 5 వేల కోట్ల మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రూ. 78.63 కోట్లు విలువచేసే ఆస్తులను బుధవారం అటాచ్ చేశారు....
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): నౌహీరా షేక్ రూ. 5 వేల కోట్ల మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు రూ. 78.63 కోట్లు విలువచేసే ఆస్తులను బుధవారం అటాచ్ చేశారు. తమ సంస్థల్లో పెట్టుబడులు పెడితే ఏడాదికి 36ు అధిక మొత్తం చెల్లిస్తాంటూ నౌహీరా షేక్ దేశవ్యాప్తంగా వేల మందికి రూ. 5 వేల కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టిన విషయం తెలిసిందే. ఆమె ఈ నిధులను షెల్ కంపెనీల ద్వారా మళ్లించినట్లు ఈడీ ఇప్పటికే 2018లో గుర్తించి, మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసింది. ఎస్‌ఏ బిల్డర్ అండ్ డెవలపర్స్ ద్వారా టోలిచౌకిలో ఆస్తులు కొనుగోలు చేసేందుకు రూ.148 కోట్లు దారిమళ్లించినట్లు ఈడీ గుర్తించింది. ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 70 కోట్లు మాత్రమే ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. మిగతా మొత్తంలో రూ.41 కోట్లను కోల్‌కతా, షిల్లాంగ్‌లోని నీలాంచల్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్‌తోపాటు మరికొన్ని షెల్ కంపెనీలకు దారిమళ్లించినట్లు అధికారులు గుర్తించారు. ఆ నిధులను ఆయా సంస్థల నుంచి సల్లార్‌పురియా సంస్థ రుణాల పేరుతో తిరిగి తీసుకున్నట్లు దర్యాప్తులో ఆధారాలను సేకరించారు. ఆ సంస్థకు చెందిన రూ. 41.05 కోట్ల విలువైన స్థిరాస్తులు, బ్యాంకు బ్యాలెన్స్‌లను అటాచ్ చేసినట్లు ఈడీ ఒక ప్రకటనలో వెల్లడించారు.