మూడో రోజు రైతుల ఖాతాల్లో రూ.687 కోట్లు
ABN , First Publish Date - 2022-12-31T04:22:59+05:30 IST
రైతుబంధు పథకం కింద మూడో రోజైన శుక్రవారం 5,49,891 మంది అన్నదాతల ఖాతాల్లో...
మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): రైతుబంధు పథకం కింద మూడో రోజైన శుక్రవారం 5,49,891 మంది అన్నదాతల ఖాతాల్లో రూ.687.89 కోట్లు జమయ్యాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర ప్రభు త్వం ఏం చేసినా విపక్షాలు విమర్శించడమే పనిగా పెట్టుకున్నాయన్నారు. దేశంలో రైతుకు చేయూతనిచ్చిన ఏకైక రాష్ట్రం ఒక్క తెలంగాణేనని పేర్కొన్నారు.
పోస్టాఫీసుల ద్వారా రైతులకు రైతుబంధు నగదు
రైతుబంధు ఆర్ధికసాయం నగదును పోస్టాఫీసులు, పోస్టల్ ఏటీఎంల నుంచి ఉచితంగా డ్రా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు తపాలాశాఖ హైదరాబాద్ రీజియన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన రైతులు నగదు డ్రా చేసుకోవడం కోసం సమీప పట్టణ, నగర ప్రాంతాలకు వెళ్లి సమయాన్ని వృథా చేసుకునే అవసరం లేకుండానే పోస్టాఫీ సు సహకారంతో ఇంటివద్దనే ఉచితంగా నగదు డ్రా చేసుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. రైతుబంధు నిధులు 5762 మైక్రో పోస్టల్ ఏటీఎంలు, 5386 బ్రాంచ్ పోస్టాఫీసుల్లో నగదు డ్రా చేసుకునేందుకు అనువుగా ఆయా కేంద్రాలకు నగదును సరఫరా చేసినట్లు అధికారులు తెలిపారు. ఆధార్ అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతా గల రైతులు రిజిస్టర్డ్ మొబైల్‌తో పోస్టాఫీసు లేదా పోస్టల్ మైక్రో ఏటీఎంలను సంప్రదించిన పక్షంలో బ్యాంక్ లింక్ చేసి వేలి ముద్రను ముద్రించి, మొబైల్‌లో వచ్చిన ఓటీపీ తెలియజేయడం ద్వారా నగదును పొందవచ్చని తపాలాశాఖ అధికారులు చెప్పారు. రోజుకు రూ. 10వేల వరకు నగదు పొందవచ్చన్నారు.