కంటి వెలుగుకు 200 కోట్లు

ABN , First Publish Date - 2022-11-30T02:19:30+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న కంటి వెలుగు-2 కార్యక్రమానికి రూ.200 కోట్లు కేటాయించింది.

కంటి వెలుగుకు 200 కోట్లు

వచ్చే ఏడాది జనవరి 18న ప్రారంభం

100 రోజుల్లో కార్యక్రమం పూర్తి చేసి

గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించాలి

ఈసారి 1.54 కోట్ల మందికి స్ర్కీనింగ్‌

55 లక్షల కళ్లద్దాల పంపిణీకి చర్యలు

వారానికి ఐదు రోజులు కంటి పరీక్షలు

కళ్లద్దాల బాక్సులపై బార్‌ కోడ్‌లు

స్కాన్‌ చేస్తే లబ్ధిదారుల వివరాలు

శిక్షణ కార్యక్రమంలో మంత్రి హరీశ్‌

హైదరాబాద్‌, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న కంటి వెలుగు-2 కార్యక్రమానికి రూ.200 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది జనవరి 18 నుంచి మొదలయ్యే ఈ కార్యక్రమానికి అవసరమయ్యే నిధులకు పాలనాపరమైన అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో అందరికీ కంటి పరీక్షలు చేసేందుకు రూ.250 కోట్లు అవసరమని వైద్య శాఖ ప్రతిపాదనలు పంపగా... సర్కారు రూ.200 కోట్ల మంజూరుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కంటి వెలుగు కార్యక్రమాన్ని వంద పనిదినాల్లో పూర్తి చేయాలని, తద్వారా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు పిలుపునిచ్చారు. డీఎంహెచ్‌వోలు, డిప్యూటీ డీఎంహెచ్‌వోలు, క్వాలిటీ కంట్రోల్‌ టీమ్స్‌, ప్రోగ్రాం ఆఫీసర్లకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో శిక్షణ కార్యక్రమాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తొలి విడత కంటి వెలుగులో 1.54 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించి, 50 లక్షల కళ్ళద్దాలు ఇచ్చామన్నారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సామూహిక కంటి పరీక్షల కార్యక్రమంగా నిలిచిందన్నారు. మరోమారు కంటి వెలుగు మొదలుపెట్టామన్నారు.

ఈసారి కోటిన్నర మందికి పరీక్షలు చేసి, 55 లక్షల మందికి కళ్లద్దాలు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. ఇందులో 30 లక్షల రీడింగ్‌ గ్లాసెస్‌, 25 లక్షల ప్రిస్ర్కిప్షన్‌ గ్లాసెస్‌ ఉన్నాయన్నారు. రీడింగ్‌ గ్లాసె్‌సను ముందుగానే అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రిస్ర్కిప్షన్‌ అద్దాలను పరీక్షలు చేసిన నెల రోజుల్లో పంపిణీ చేస్తామన్నారు. జనవరి 10 నాటికే 10-15 లక్షల కళ్లజోళ్లను పంపిణీ చేస్తామన్నారు. కళ్లద్దాల బాక్స్‌పై బార్‌ కోడ్‌ ఉంటుందని, దాన్ని స్కాన్‌ చేయగానే లబ్ధిదారుల వివరాలు తెలుస్తాయన్నారు. కంటి వెలుగులో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలను భాగస్వామ్యం చేసి విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. గతంలో కంటి వెలుగును 8 నెలల్లో చేశామని, ఈసారి 100 పనిదినాల్లో చేయాలని నిర్ణయించామని తెలిపారు. వారంలో శని, ఆది మినహా మిగిలిన అన్ని రోజులు కొనసాగుతుందన్నారు. మొదటిసారి 827 బృందాలు పని చేస్తే, ఇప్పుడు ఆ సంఖ్యను 1,500కు పెంచామన్నారు.

969 పీహెచ్‌సీ డాక్టర్ల ఫైనల్‌ జాబితాను డిసెంబరు 1న విడుదల చేస్తామని ప్రకటించారు. 1,500 మంది చొప్పున అప్టోమెట్రిస్టులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను త్వరగా నియమించాలని అధికారులను ఆదేశించారు. 1,500 వాహనాలను సిద్ధం చేయాలన్నారు. రెగ్యులర్‌ వైద్య సేవలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జనవరి 5న కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తామన్నారు. జనవరి 1 వరకు ఆటో రిఫ్రాక్టో మిషన్లను వైద్య బృందాలకు పంపుతామన్నారు. క్వాలిటీ కంట్రోల్‌ టీమ్స్‌ను రాష్ట్రస్థాయిలో 10, జిల్లాకొకటి ఏర్పాటు చేస్తామన్నారు. వీరికి ఎల్వీ ప్రసాద్‌, సరోజినీ దేవి కంటి ఆస్పత్రి సహకారంతో రెసిడెన్షియల్‌ ట్రైనింగ్‌ ఇస్తామన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాప్‌ ద్వారా ఎప్పటికప్పుడు అద్దాల డిమాండ్‌ తీర్చేలా ఆటోమేటిక్‌ ఆర్డర్‌ ఫెసిలిటీ ఉంటుందన్నారు. ఈ యాప్‌ పనితీరుపై శిక్షణ ఇస్తామన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సమస్యలతో బాధ పడకూడదనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఉన్నారని మంత్రి తెలిపారు. కంటి వెలుగు కార్యక్రమంలో బాగా పనిచేసే వారికి శాఖాపరమైన గుర్తింపు ఉంటుందన్నారు. విధుల్లో నిర్లక్యంగా ఉంటే చర్యల తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2022-11-30T02:19:31+05:30 IST