HYD : 11 ఏళ్లు.. 100కు పైగా చోరీలు.. చివరికి జరిగిన సీన్ ఇదీ..

ABN , First Publish Date - 2022-03-05T14:44:03+05:30 IST

అతని పేరు షేక్‌ యానిమ్‌ అలియాస్‌ సలీమ్‌.. వయసు 38, ఊరు జగిత్యాల...

HYD : 11 ఏళ్లు.. 100కు పైగా చోరీలు.. చివరికి జరిగిన సీన్ ఇదీ..

హైదరాబాద్‌ సిటీ : అతని పేరు షేక్‌ యానిమ్‌ అలియాస్‌ సలీమ్‌.. వయసు 38, ఊరు  జగిత్యాల. 2010 నుంచి చోరీలు చేస్తున్నాడు. ఈ 11 ఏళ్లలో 100కు పైగా చోరీలు చేశాడు.. ఒక అత్యాచారం కేసు సహా పలు చోరీ కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. మరోసారి రాచకొండ పోలీసులు చిక్కి కటకటాలపాలయ్యాడు. వివరాలను రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వెల్లడించారు. షేక్‌ యామిన్‌ అలియాస్‌ సలీమ్‌.. నగరానికి వలసవచ్చి రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పరిధిలో ఉంటూ కూలి పనులు చేస్తూ జీవిస్తుండేవాడు. జల్సాలు, చెడు వ్యసనాలకు బానిసగా మారి దొంగతనాలకు తెగబడ్డాడు. రాచకొండ, సైబరాబాద్‌, జోగులాంబ గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌, కామారెడ్డి, మెదక్‌, నల్గొండ, నిజామాబాద్‌ జిల్లాలలో కేసులున్నాయి. 


2010లో జగిత్యాలలో అరెస్టు చేసి జైలుకు పంపారు. బయటకొచ్చి మళ్లీ చోరీలు చేసి నిజామాబాద్‌ పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. 2015లో  మీర్‌పేట పోలీసులకు, ఆ తర్వాత అత్యాచారం కేసులో 2018లో నిర్మల్‌ రూరల్‌ పోలీసులకు, 2019లో మరోసారి నిర్మల్‌ పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లాడు.  గతనెల 5న అబ్ధుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసి దోచేశాడు.


పోలీసులు అతన్ని కటకటాల్లోకి నెట్టారు. అతని నుంచి 18.20 లక్షల విలువైన 350 గ్రాముల బంగారం, 1.5 కేజీ వెండి, 1.50లక్షల నగదు, టీవీ, ల్యాప్‌టాప్‌ ఇలా మొత్తం రూ. 23.80లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. పలు దొంగతనాల్లో యామిన్‌తో కలిసి చోరీలకు, నేరాలకు పాల్పడిన పాత నేరస్థులు ఉస్మాన్‌, లక్ష్మణ్‌, మరో గుర్తుతెలియని వ్యక్తి పరారీలో ఉన్నారు. వారిని కూడా త్వరలోనే పట్టుకుంటామని సీపీ పేర్కొన్నారు.

Read more