దిగుబడులపై దిగులు!

ABN , First Publish Date - 2022-09-30T06:36:45+05:30 IST

జిల్లాలో సాగయ్యే పంటలలో పత్తి పంట ప్రధానంగా కనిపిస్తుంది. ఈ యేడు పత్తి పంట తెల్లబంగారం కానుందన్న చర్చ జోరుగా సాగుతోంది.

దిగుబడులపై దిగులు!

పత్తి ఏరుతున్న రైతు కూలీలు(ఫైల్‌)

కురుస్తున్న వర్షాలతో పత్తి రైతుల ఆందోళన

ఈ సారి రికార్డు స్థాయిలో ధర పలికే అవకాశం

అడ్వాన్సులు ఇచ్చేందుకు ముందుకొస్తున్న వ్యాపారులు

మద్దతును మించితే సీసీఐ కొనుగోళ్లు నామమాత్రమే

మరో పక్షం రోజుల్లో ప్రారంభంకానున్న పత్తి కొనుగోళ్లు


ఆదిలాబాద్‌, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో సాగయ్యే పంటలలో పత్తి పంట ప్రధానంగా కనిపిస్తుంది. ఈ యేడు పత్తి పంట తెల్లబంగారం కానుందన్న చర్చ జోరుగా సాగుతోంది. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 5లక్షల 72వేల ఎకరాలు కాగా ఈ సారి అధికంగా 3 లక్షల 98వేల ఎకరాల్లో పత్తి పంట సాగైనట్లు వ్యవసాయాధికారులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లుగా పత్తి పంటను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడంతో పత్తి సాగు వైపే రైతులు మొగ్గు చూపారు. ఈ సారి సమృద్ధిగా వర్షాలు కురియడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించడంతో పత్తి పంట ఏపుగా పెరిగి ఆశాజనకంగా కనిపిస్తోంది. కానీ ప్రస్తుతం కాయ దశలో ఉన్న పత్తి పంటకు అధిక వర్షాలతో నష్టం వాటిల్లే అవకాశం ఉందంటున్నారు. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో చీడ పీడల ఉధృతి పెరిగి అధిక తేమతో కాయ పక్వానికి రాకుండా నలుపుభారీ నాణ్యత లేకుండా పోతోందని రైతులు వాపోతున్నారు. అలాగే పక్వానికి వచ్చిన కాయలు నేలరాలి పోతున్నాయని ఎన్ని సార్లు మందులను పిచికారీ చేసినా కాయలు నిలువడం లేదంటున్నారు. ఈ యేడు భారీ వర్షాల కారణంగా వరద ఉధృతికి లక్ష ఎకరాలకు పైగా పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో పత్తి పంటకు అనుకూలమైన నల్ల రేగడి నేలలు ఉన్నప్పటికీ అధిక తేమతో దిగుబడులు తగ్గనున్నాయని చెబుతున్నారు. ఈ యేడు ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్లు మాత్రమే దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరో పక్షం రోజుల్లో పత్తి దిగుబడులు చేతికి వచ్చే అవకాశం ఉంది. గతేడు క్వింటాలు పత్తికి మద్దతును మంచిన ధర పలకడంతో భారీ డిమాండ్‌ ఏర్పడింది. ఈ సారి కూడా అంతంత మాత్రంగానే దిగుబడులు వచ్చే అవకాశం ఉండడంతో పత్తి పంట తెల్లబంగారమయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

రైతుల వద్దకు పరుగులు..

గత యేడాదిగా అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి భారీ డిమాండ్‌ ఏర్పడడంతో ముందే అప్రమత్తమైన పత్తి వ్యాపారులు రైతుల వద్దకు పరుగులు తీస్తున్నారు. కమిషన్‌ ఏజెంట్ల ద్వారా ముందుగానే అడ్వాన్సులను చెల్లించేందుకు ముందుకొస్తున్నారు. గ్రామాల్లో మోతుబారి రైతుల సహకారంతో అడ్వాన్సులు ఇస్తూ ఒప్పందం చేసుకుంటున్నారు. ఎకరాన 5 నుంచి 6 క్వింటాళ్ల పత్తి దిగుబడులు వచ్చే అవకాశం ఉన్న రైతులకు ఎకరాన 3, 4 క్వింటాళ్ల దిగుబడులను అంచనా వేస్తూ అడ్వాన్సుల రూపంలో డబ్బులు ముట్టచెబుతున్నారు. క్వింటాళుకు ముందే రూ.6వేల నుంచి రూ.7వేల వరకు చెల్లిస్తున్నారు. పంట చేతికి రాక ముందే పైసలు చేతికి అందడంతో అన్నదాతల్లో ఆనందం కనిపిస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా ఈ సారి పత్తి పంటకు భారీ డిమాండ్‌ ఏర్పడుతోంది. దిగుబడులు భారీగా తగ్గుతాయన్న ప్రచారంతో రైతులను మభ్యపెడుతూ తమకే విక్రయించాలని వ్యాపారులు జాగ్రత్త పడుతున్నారు. కొందరు వ్యాపారులైతే నగదును చెల్లిస్తూ అగ్రిమెంట్‌ను కూడా రాసుకుంటున్నట్లు తెలుస్తోంది. పోటీపడి మరి అడ్వాన్సులు చెల్లించేందుకు ఆసక్తి చూపుతున్నారు. 

సీసీఐ కొనుగోళ్లు అనుమానమే..

అందరూ అనుకున్నట్లుగా పత్తి ధరలు మద్ధతును మించితే సీసీఐ సంస్థ పత్తిని కొనుగోలు చేయడం అనుమానంగానే కనిపిస్తోంది. మద్దతు ధర క్వింటాలుకు రూ.6225 ఉన్న ఈ సారి రూ.10వేలకు పైగా ధర పలికే అవకాశం ఉందంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి నూలుకు డిమాండ్‌ పెరుగడంతో మద్దతు ధరకు మించి ధర పలుకుతుందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలికితే రైతులు బయట మార్కెట్‌లోనే ప్రైవేట్‌ వ్యాపారులకు విక్రయంచేందుకు ఆసక్తి చూపే అవకాశం ఉంది. దీంతో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిన ఫలితం ఉండదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కాని తేమ, నాణ్యత పేరిట ప్రైవేటు వ్యాపారులు భారీగా కోతలు విధిస్తే రైతులు కొంత మేరకు నష్ట పోయే అవకాశాలు లేక పోలేదు. ఈ సారి తేమ శాతంతో కొర్రీలు పెట్టకుండా నేరుగా పంటను కొనుగోలు చేయాలని రైతులు చెబుతున్నారు. భారీ వర్షాలు, గులాబీ పురుగు ఉధృతి కారణంగా దిగుబడులు తగ్గి పోయే అవకాశం ఉందని రైతులు వాపోతున్నారు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పత్తి పంటను సాగు చేస్తున్న వ్యాపారులు కోతలు పెట్టి నష్టం చేస్తున్నారని వాపోతున్నారు. నాణ్యత, తేమ శాతం నిబంధనలు లేకుండా నేరుగా పత్తిని కొనుగోలు చేయాలని కోరుతున్నారు. 

పత్తికి రైతులకు మంచి రోజులు

- శ్రీనివాస్‌ (జిల్లా మార్కెటింగ్‌ అధికారి)

ఈ యేడు కూడా పత్తి రైతులకు మంచి రోజులు రానున్నాయి. భారీ వర్షాల కారణంగా దిగుబడులు తగ్గుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో మద్ధతును మించిన ధరలు వచ్చే అవకాశం ఉంది. గతేడు చివరి సమయంలో క్వింటాల్‌కు రూ.10వేలకు పైగా ధర పలికింది. ఈ యేడు కూడా ప్రారంభం నుంచి చివరి వరకు మంచి ధరలే ఉంటాయి. రైతులు తొందరపడకుండా సరైన ధరకు పంటను విక్రయించుకుని లాభం పొందాలి. ఆధరబాదరగా దళారులకు అమ్మేసుకుని నష్టపోవద్దు. అలాగే అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తికి మంచి డిమాండ్‌ ఉంది.


Read more