అన్ని వర్గాల అభివృద్ధికి కృషి

ABN , First Publish Date - 2022-08-16T04:03:37+05:30 IST

అమరుల స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో నిర్వహించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు.

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి
వేడుకలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ అర్కేపుడి గాంధీ

- బంగారు తెలంగాణ ప్రభుత్వ ధ్యేయం

- స్వాతంత్య్ర వజ్రోత్సవంలో ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ

ఆసిఫాబాద్‌/ ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 15: అమరుల స్ఫూర్తితో రాష్ట్రంలోని అన్ని వర్గాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ పేర్కొన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని మార్కెట్‌యార్డులో నిర్వహించిన భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో భాగంగా ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. జిల్లాలోని 335గ్రామపంచాయతీల్లో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇంటిపన్ను రూ.4.04కోట్లకు గాను రూ.3.99 కోట్లు వసూలు చేశామన్నారు. జిల్లాలో రైతు బందు పథకం కింద 2022-23 వానాకాలంలో 1,14,435 మంది రైతు ఖాతాల్లో రూ.191 కోట్లను జమ చేశామన్నారు. రైతుబీమా పథకం కింద 70629 మంది రైతులు అర్హత పొందారని 2021 సంవత్సరంలో జిల్లాలో 321 రైతు నామినీలకు రూ.5లక్షల చొప్పున వారి ఖాతాల్లో రూ.16.05 కోట్లు జమ చేశామన్నారు. గొర్రెల పంపిణీలో భాగంగా రెండో విడతలో 2904యూనిట్లను లబ్ధిదారులకు సరఫరా చేశామన్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 351నర్సరీలలో 75,580 లక్షల మొక్కలను పెంచామన్నారు. జిల్లాలో డబుల్‌ బెడ్‌ రూం 1223 ఇళ్లకు టెండర్లు పిలువగా 567 ఇళ్లకు అగ్రిమెంట్‌లు పూర్తయ్యాయని అన్నారు. జిల్లాలో రోడ్ల పునరుద్దరణకు రూ.19 కోట్లు మంజూరు మంజూరు చేశామన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 28705మంది గర్భిణులకు రూ.18.70 కోట్ల ప్రభుత్వ సాయం అందజేశామన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమంలో 213పాఠశాలలు మంజూరు చేశామన్నారు. ఉపాధిహామి పథకం ద్వారా 64వేల కుటుంబాలకు 29.70లక్షల పనిదినాలు ఉపాధి కల్పించి రూ.41కోట్లు కూలీల డబ్బులు చెల్లించామన్నారు. జిల్లాలో ఆసరా పథకం కింద 45337 మంది లబ్ధిదారులకు ఆసరా పెన్షన్లను అందిస్తున్నామన్నారు. గిరి వికాసం పథకం ద్వారా 245వినియోగదారుల సంఘాలను ఎంపిక చేసి రూ.1.45కోట్ల వ్యయంతో 65బోరుబావులను ఏర్పాటు చేశామన్నారు. మిషన్‌ భగీరథ పథకం ద్వారా జిల్లాలో 1144 ఆవా సాలకు సురక్షిత మంచినీటిని అందించామన్నారు. దళిత బంధు పథకం ద్వారా ఆసిఫాబాద్‌ నియోజక వర్గంలో 77మంది, సిర్పూర్‌ నియోజకవర్గంలో 100మందిని ఎంపిక చేశామన్నారు. ప్రభుత్వ అధికార యంత్రాంగం సమన్వయంతో పనిచేసి జిల్లాను మరింత ప్రగతి పథంలో నడిపించి జిల్లా అభివృద్ధికి ఎళ్లవేళలా కృషి చేయాలన్నారు. కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌, ఎస్పీ సురేష్‌కుమార్‌, అదనపుకలెక్టర్‌లు చాహత్‌బాజ్‌పాయ్‌, రాజేశం, జడ్పీ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, డీఆర్వో సురేష్‌, జడ్పీటీసీలు అరిగెల నాగేశ్వర్‌రావు, అరుణ, సంతోష్‌, అజయ్‌ అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. 

స్టాళ్ల పరిశీలన

ఆయా శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను ప్రభుత్వ విప్‌ అర్కపుడి గాంధీ పరిశీలించారు. వైద్యఆరోగ్యశాఖ, జిల్లా వెనకబడిన తరగతులశాఖ, జిల్లా దళితాభివృద్ధి శాఖ, అటవీశాఖ, స్త్రీశిశు సంక్షేమ శాఖ, మత్స్యశాఖ, వ్యవసాయశాఖ తదితర శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఆధ్వర్యంలో లబ్ధిదారులకు మంజూరైన యూని ట్లను పంపిణీ చేశారు. 

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పట్టణంలోని వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు, నృత్యాలు, సోలో డ్యాన్సులు, ఏకపాత్రాభినయం అందరినీ ఆకట్టుకున్నాయి.

Read more