మహిళా శక్తి ప్రపంచానికే స్ఫూర్తి
ABN , First Publish Date - 2022-03-08T04:41:08+05:30 IST
ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉద్యోగులుగా, ప్రజాప్రతినిధులుగా తమ సత్తాచాటుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతమైన మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరి యాల్లో మహిళలు బొగ్గుబావుల్లోను, ఉపరి తలంపైనా పని చేస్తున్నారు.
ఓర్పు, సహనం వారి సొంతం
నేడు ప్రపంచ మహిళా దినోత్సవం
మంచిర్యాల కలెక్టరేట్, మార్చి 7 : ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళలు నేడు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అన్ని రంగాల్లో పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తూనే ఉద్యోగులుగా, ప్రజాప్రతినిధులుగా తమ సత్తాచాటుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతమైన మందమర్రి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరి యాల్లో మహిళలు బొగ్గుబావుల్లోను, ఉపరి తలంపైనా పని చేస్తున్నారు.
మహిళల అభ్యున్నతి ద్వారానే కుటుంబం, సమాజాభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రభు త్వాలు సైతం మహిళల సంక్షేమానికి ప్రత్యేక పథకాలను ప్రవేశపెడుతున్నాయి. రాజ కీయాల్లో కూడా మహిళలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. చట్టసభల్లో రిజర్వేషన్లను అమలు చేయడంతో పార్లమెంట్ నుంచి పంచాయతీ, మున్సిపల్ వరకు రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. మంగళవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవం పురస్కరించుకుని ప్రత్యేక కథనం...
మహిళా దినోత్సవ నేపథ్యం...
అణచివేతకు గురవుతున్న మహిళల సమస్యలపై మార్చి 8, 1910న డెన్మార్క్ రాజధాని కోపన్‌హాగన్‌లో అంతర్జాతీయ మహిళాసభ జరిగింది. పదిగంటల పనిదినం, పురుషులతో సమానంగా వేతనం చెల్లించాలని 1845లో పశ్చిమ పెన్సిల్వేనియాలోని బట్టల మిల్లులో సమ్మె మొదలైంది. సమ్మెలో మహిళా కార్మికులే కీలక భూమిక పోషించగా, క్రమంగా పోరాటం అన్ని ప్రాంతాలకు వ్యాపించి చివరకు 1857 మార్చి8న సమ్మె విజయవంతమైంది. ప్రారంభంలో దీనిని అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవంగా వివిధ దేశాల్లో పలు తేదీల్లో నిర్వహించేవారు. 1977లో ఐక్యరాజ్య సమితి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడంతో ప్రపంచ వ్యాప్తంగా మహిళా దినోత్సవాన్ని మార్చి 8న నిర్వహించుకొంటున్నాం.
సమానత్వంతోనే సుస్థిరత
భారతి హోళికేరి, కలెక్టర్
లింగ సమానత్వంతోనే సుస్థిరత ఏర్పడుతుంది. పిల్లల నుంచి పెద్దల వరకు లింగ బేధం లేకుండా సమాజస్థాపన జరగాలి. చట్టాలు ఎన్ని ఉన్నా ఎవరికి వారు మార్పు చెంది పరిపక్వంగా ఆలోచించాలి. ఆడ పిల్లలుగా పుట్టినందుకు గర్వపడాలి. ప్రకృతితో, దేవతలతో స్ర్తీని పోలుస్తారు కాని సమానత్వం ఆలోచన ప్రతీ ఒక్కరికి కలగాలి. స్ర్తీని గౌరవించినప్పుడే మనుగడ, అభివృద్ధి.
మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు
నల్లాల భాగ్యలక్ష్మి, జడ్పీ చైర్‌పర్సన్
రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి వారి అభ్యుదయానికి కృషి చేస్తోంది. పట్టుదలతో అనుకున్నది సాధించాలి. రాష్ట్రంలో మహిళల భద్రతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చట్టాలు తీసుకురావడం అభినందనీయం. సమాజంలో చైతన్యం రావాలంటే మహిళలు రాజకీయాల్లో మరింత చురుగ్గా పాల్గొనాలి.
ఓర్పు, సహనం మహిళల సొంతం
స్నేహ సరిగమ, ప్రభుత్వ వైద్యురాలు. మంచిర్యాల
ప్రభుత్వం మహిళలకు అందించే రిజర్వేషన్‌లే కాకుండా అన్ని రంగాల్లో ప్రత్యేక గుర్తింపునివ్వాలి. మహిళల బాగోగులు, త్యాగాలు గుర్తించి అభినందించడమే కాకుండా ఎల్లవేళలా ప్రేమాభిమానాలు, ప్రోత్సాహాన్ని అందించడంలో ప్రతీ ఒక్కరు బాధ్యతగా వ్యవహరించాలి. ఓర్పు, సహనంతో మహిళలు అనేక సమస్యలను పరిష్కరించి సమాజంలో ప్రత్యేకతను చాటుకోవాలి.
మహిళలకు చేయూతనిస్తున్న సింగరేణి సేవా సమితి
మందమర్రిటౌన్: తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి సంస్థలో మహిళలకు సింగరేణి సేవా సమితి చేయూతనిస్తోంది. వారి కోసం ప్రత్యేక స్వయం ఉపాధి శిక్షణ కోర్సులను ప్రవేశపెట్టి వారి కాళ్లపై వారు నిలబడే విధంగా కృషి చేస్తోంది. మందమర్రి ఏరియాలో ఇప్పటి వరకు దాదాపు 12 వేల మందికి పైగా మహిళలకు స్వయం ఉపాధి శిక్షణను అందించింది. టైలరింగ్, బ్యూటిషియన్, అల్లికలు, పేపర్ బ్యాగుల తయారీ, కంప్యూటర్ శిక్షణతో పాటు మగ్గం వర్కులో శిక్షణ ఇస్తోంది. శిక్షణ పూర్తి చేసిన వారు షాపులను ఏర్పాటు చేసుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. పట్టణాలకే కాకుండా సింగరేణి పరిసర ప్రాంత గ్రామాలకు విస్తరిస్తున్నాయి.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
- చింతల లక్ష్మీశ్రీనివాస్, సింగరేణి సేవా సమితి అధ్యక్షురాలు
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలనేదే తమ లక్ష్యం. సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పూర్తి చేసిన మహిళలు సొంతంగా ఉపాధి ఏర్పాటు చేసుకుని ఆర్ధిక ప్రగతి సాధించడం ఆనందంగా ఉంది. మహిళలు తల్చుకుంటే ఏదైనా సాధిస్తారనడానికి తాము ప్రవేశపెట్టిన కోర్సులు ఉదాహరణగా చెప్పవచ్చు. మహిళల ఆర్ధిక ప్రగతే సింగరేణి సేవా సమితి లక్ష్యం.