‘డబుల్‌’ ఇళ్ల పంపిణీలో జాప్యమెందుకు..?

ABN , First Publish Date - 2022-11-18T22:23:17+05:30 IST

గూడు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వ హామీ సంవత్సరాలు గడుస్తున్నా నెరవేరడం లేదు. జిల్లాలో 70 శాతం మేర డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీకి నోచుకోవడం లేదు.

‘డబుల్‌’ ఇళ్ల పంపిణీలో జాప్యమెందుకు..?

మంచిర్యాల, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): గూడు లేని పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న ప్రభుత్వ హామీ సంవత్సరాలు గడుస్తున్నా నెరవేరడం లేదు. జిల్లాలో 70 శాతం మేర డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పూర్తయినా లబ్ధిదారులకు పంపిణీకి నోచుకోవడం లేదు. డబుల్‌ బెడ్రూం ఇండ్లు నిర్మించడం పేదల ఆత్మగౌరవ ప్రతీక అని ప్రకటించుకున్న తెలంగాణ సర్కారు సకాలంలో అర్హులకు అందజేయడంలో విఫలమవుతోంది. ఏడేళ్ల సుదీర్ఘకాలం అనంతరం అధికారులు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియకు శ్రీకా రం చుట్టినా పథకానికి అడుగులు ముందుకు పడటం లేదు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2616 డబుల్‌ ఇళ్లు మం జూరయ్యాయి. ఒక్కొక్కటి రూ.5.30 లక్షల అంచనాతో నిర్మించ తలపె ట్టగా మరో 806 ఇళ్ల నిర్మాణం చేపట్టవలసి ఉంది. ఏడేళ్ల కాలంలో జిల్లా వ్యాప్తంగా కేవలం 1044 ఇళ్లు పూర్తికాగా జిల్లా కేంద్రం మినహా మరె క్కడా లబ్ధిదారులకు పంపిణీ చేసిన దాఖలాలు లేవు.

నిర్మాణం పూర్తయినా

మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల పరిధిలో మొత్తం 2616 డబుల్‌ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. వీటిలో మంచిర్యాల నియోజకవర్గానికి 685 ఇండ్లు మంజూరు కాగా 620 ఇళ్ల నిర్మాణం చివరి దశకు చేరుకుంది. మరో 65 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. చెన్నూరు నియోజకవర్గానికి 1146 మంజూరు కాగా వీటిలో మందమ ర్రిలో 560, క్యాతన్‌పల్లి మున్సిపాలిటీకి 286, చెన్నూరుకు 300 ఇండ్లు కేటాయించారు. వీటిలో 194 ఇళ్ల నిర్మాణం ఇప్పటికీ ప్రారంభం కాలేదు. మిగతా వాటిలో మందమర్రిలో 160 ఇళ్లు 50 శాతం పూర్తికాగా, 400 ఇళ్లు చివరి దశలో ఉన్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గానికి 585 ఇళ్లు మంజూరయ్యాయి. వీటిలో 170 ఇళ్ల నిర్మాణం కొనసాగుతుండగా మరో 415 ఇళ్లకు సంబంధించి స్థల వివాదం కొనసాగుతోంది.

లబ్ధిదారులను ఎంపిక చేసినా

రెండు పడక గదుల ఇండ్ల కేటాయింపునకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. మొదటి విడు తలో భాగంగా జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 620 గృహాల ను అర్హులకు కేటాయించేందుకు కలెక్టర్‌ భారతిహోళికేరి ఆదేశాల మేరకు ప్రాథమిక విచారణ ప్రారంభించారు. ఇందులో భాగంగా మీ-సేవ ద్వారా అందిన 2,958 దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వార్డుల వారీగా ప్రాథమిక జాబితాను తయారు చేసి ఆగస్టు 29న మున్సిపల్‌, తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రచురించారు. జాబితాపై ఆక్షేపణలు ఉంటే ఏడు రోజు ల్లోగా తెలియజేయాలని సూచించారు. ఆక్షేపణలు తెలియజేసేందుకు విధించిన గడువు ముగిసి కూడా 80 రోజులు కావస్తోంది. అయినప్పటికీ అధికారులు అర్హుల తుది జాబితాను విడుదల చేయకపోవడంతో డబుల్‌ ఇళ్ల పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు.

పారదర్శకంగా జరిగేనా...?

ఇళ్ల నిర్మాణం పూర్తయినప్పటికీ లబ్ధిదారుల ఎంపిక చేపట్టకపోవడం పై రాజకీయ ప్రమేయముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో లబ్ధిదారుల ఎంపిక అసలు పారదర్శకంగా జరుగుతుందా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జిల్లా కేంద్రంలో గతంలో ఎంపిక చేసిన లబ్ధి దారుల విషయంలో రాజకీయ ప్రమేయం ఉందనే ఆరోపణలు వెలువ డటంతో పంపిణీ ప్రక్రియను అధికారులు వాయిదా వేశారు. మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి గతేడాది ఏప్రిల్‌ 7న రాజీవ్‌నగర్‌లో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, కలెక్టర్‌ భారతి హోళికేరిలు కేవలం 30 మంది లబ్ధిదారులకు ఇళ్లు పంపిణీ చేశారు. అప్పటికే 358 పూర్తికాగా లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా అధికారులు ముంద డుగు వేయలేకపోయారనే ప్రచారం జరిగింది. చెన్నూరు, బెల్లంపల్లి నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం కారణంగా పంపిణీ ప్రక్రియ ముందుకు సాగడం లేదనే ఆరోపణలున్నాయి.

స్థలాలు కోల్పోయిన వారి పరిస్థితి దయనీయం

జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో 2007-08లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇందిరమ్మ పథకం కింద ఇళ్లు లేని నిరుపేదలకు సర్వే నెంబర్‌ 345లో నివేశన స్థలాలు పంపిణీ చేసింది. ఎంపిక చేసిన లబ్ధిదారులకు అధికా రులు పట్టాలు జారీ చేయడంతోపాటు 75 గజాల చొప్పున స్థలాలనూ అప్పగించారు. మంచిర్యాల మున్సిపాలిటీ పరిధిలోని అప్పటి 32 వార్డుల్లో 22 వార్డులకు చెందిన సుమారు మూడు వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. వాటిలో దాదాపు 80 శాతం మంది బేస్మెంట్లు, పిల్లర్లు నిర్మించుకున్నారు. మరికొందరు ఆర్థిక పరిస్థితుల కారణంగా స్థలాలను ఖాళీగా వదిలివేయగా స్థోమత ఉన్న వారు ఇండ్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తరువాత డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయం తెరమీదకు వచ్చింది. దీంతో 2019-20లో అధికారులు సర్వే నెంబర్‌ 345లో వెలసిన నిర్మాణాలను కూల్చివేశారు. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. లబ్ధిదారులు తమ వద్ద ఉన్న ఆధారాలతో ఆందోళనకు దిగడంతో అధికారులు వారితో సంప్రదింపులు జరిపారు. స్థలాలు కోల్పోయిన వారిని డబుల్‌ బెడ్రూం ఇళ్లకు ఎంపిక చేస్తామని, ప్రస్తుతం ఉన్న కట్టడాలను తొలగించి అదే ప్రాంతంలో డబుల్‌ ఇల్లు నిర్మిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ప్రస్తుతం డబుల్‌ ఇళ్ల పంపిణీ ప్రక్రియకు సన్నాహాలు జరుగుతున్నందున తమకు అవకాశం కల్పిస్తారే మోనని బాధితులు గంపెడాశతో ఎదురు చూస్తున్నారు.

Updated Date - 2022-11-18T22:23:21+05:30 IST