మాతాశిశువుల కష్టాలు తీరెదెప్పుడు?

ABN , First Publish Date - 2022-12-12T22:08:55+05:30 IST

ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో రూ.17.50 కోట్ల అంచనాతో ప్రభుత్వం ఎంసీహెచ్‌ (మదర్‌ ఆండ్‌ చైల్డ్‌ హెల్త్‌ సెంటర్‌)ను నిర్మించింది.

మాతాశిశువుల కష్టాలు తీరెదెప్పుడు?

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 12: ప్రభుత్వాసుపత్రిలో గర్భిణులు, బాలింతలకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలో రూ.17.50 కోట్ల అంచనాతో ప్రభుత్వం ఎంసీహెచ్‌ (మదర్‌ ఆండ్‌ చైల్డ్‌ హెల్త్‌ సెంటర్‌)ను నిర్మించింది. ఎంసీహెచ్‌ ప్రారంభించి సరైన చికిత్స, వసతులు లభిస్తుండగా వర్షాకాలంలో వరద ముంపునకు భవనం నీట మునిగింది. గర్భిణులు, బాలింతలకు గతంలో మాదిరిగా జిల్లా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వరద వచ్చిన రాత్రి బాలిం తలను హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. కోట్లాది రూపా యలు ఖర్చు చేసి నిర్మించిన భవనం అందుబాటులో లేకపోవడంతో సుదూర ప్రాంతాల నుంచి ప్రసవానికి వచ్చే నిరుపేద, మధ్య తరగతి కుటుంబానికి చెందిన గర్భిణులు ఇబ్బందుల పాలవుతున్నారు. జిల్లా కేం ద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నా బెడ్‌లు సరిపోవడం లేదు. ప్రసవ అనంతరం శిశువులతో వరండాలోనే చికిత్స అందిస్తున్నారు. బాలింతలు, వారితో వచ్చే అటెండెంట్‌లు స్థలాభావంతో చలితో వణికిపోతున్నారు.

ఆరు నెలలుగా భవనానికి తాళం

ఎంసీహెచ్‌ భవనానికి ఆరు నెలలుగా తాళం వేసి ఉంది. భవనాన్ని శుభ్రం చేసినప్పటికి కొన్ని పనులు మిగిలిపోవడంతో అందుబాటులోకి రావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకుంటేనే భవనం అందుబాటులోకి వచ్చి బాలింతలకు చికిత్స అందుతుంది. ప్రసవం తర్వాత గర్భిణులు, బాలింతలు శిశువుల కోసం ప్రత్యేక గదులు కేటాయించాలని గర్భిణులు పేర్కొంటున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రి అసౌకర్యాలకు నెలవు

జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పలు వార్డులు మొదలుకొని మరుగుదొడ్ల వరకు పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఆసుపత్రిలో ఇన్‌, ఔట్‌ పేషంట్‌లు అసౌకర్యాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు వెచ్చిస్తున్నా సిబ్బంది, సంబంధిత అధికారులు శుభ్రత పాటించేందుకు చొరవ చూపడం లేదని, సిబ్బందిని నియంత్రించడంలో విఫలమయ్యారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు.

వరండాలోనే చికిత్స.....

వార్డులలో బెడ్‌లు సరిపోకపోవడంతో బాలింతలకు వరండాలోనే చికిత్స అందిస్తున్నారు. డ్యూటీ వైద్యులు, నర్సింగ్‌ సిబ్బంది వరండా ఆవరణలోనే సెలైన్‌లు పెట్టడం, మందులు ఇస్తున్నారు. చలికాలం కావడంతో రోగులు, అటెండెంట్లు అక్కడే వేచి ఉండడంతో గుంపులు గుంపులుగా చేరడంతో రద్దీ ఏర్పడుతోంది.

అద్దె భవనమైనా తీసుకోవాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేందుకు కృషి చేయాలని వైద్యు లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆశాలను, ఏఎన్‌ఎంలను అప్ర మత్తం చేసి గర్భిణులను ప్రభుత్వ ఆసుపత్రిలోకి చేరవేస్తున్నారు. ప్రభుత్వం అద్దె భవనాన్ని తీసుకొని బాలింతలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

పిల్లలకు చికిత్స అక్కడే

ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వైపు చిన్నారుల గది, మరోవైపు గర్భిణులకు చికిత్స అందించడంతో పక్కపక్కనే వైద్య సేవలు పూర్తి స్థాయిలో అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అనారోగ్యంతో వచ్చే పిల్లలు, గర్భిణులు ఒకే వరండాలో ఉండడంతో ఇన్ఫెక్షన్‌లు సోకే అవకాశం ఉంది. రెండు వార్డులకు కనీస దూరాన్ని పాటించాలని బాలింతలు అభిప్రాయపడు తున్నారు. అలాగే సిబ్బంది సమయపాలన పాటించడం లేదని, సెలవు దినాల్లో అందుబాటులో ఉండరని రోగులంటున్నారు. వైద్యులు, సిబ్బంది ప్రత్యేక సమయపాలన చాట్‌ను ఏర్పాటు చేయాలని, సమయపాలన పాటించని వారిపై అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

కేసీఆర్‌ కిట్లులో జాప్యం

కేసీఆర్‌ కిట్లు, ప్రభుత్వం అందించే పారితోషికంలో జాప్యం జరుగు తుందని బాలింతలు పేర్కొంటున్నారు. కింది స్థాయి వైద్య సిబ్బంది డేటా ఎంట్రీ, తదితర విషయాలపై నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో కేసీఆర్‌ కిట్లు, ప్రభుత్వం నుంచి వచ్చే నగదులో జాప్యం నెలకొంటుంది. ప్రసవమైన మరుసటి రోజే పథకం వర్తింపజేసే విధంగా చూడాలని బాలింతలు కోరుతున్నారు.

బాత్రూంలను పరిశుభ్రంగా ఉంచాలి....కళ్యాణి, బెల్లంపల్లి

ప్రభుత్వాసుపత్రిలో అడ్మిట్‌ అయి ఐదు రోజులవుతోంది. వాష్‌రూంలు వాసన వస్తున్నాయి. చెప్పులు ఎక్కడపడితే అక్కడ విడుస్తూ అపరిశుభ్రంగా నడుస్తున్నారు. అధికారులు చర్యలు చేపట్టి బాత్రూంలను ఎప్పటికప్పుడు శుభ్రపర్చాలి. బాలింతలకు ఇన్ఫెక్షన్‌ త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున అటెండెంట్‌లను కొద్ది మందినే లోపలికి అనుమతించాలి.

స్వీయ పరిశుభ్రత పాటించాలి.....సూపరింటెండెంట్‌ హరిష్‌చందర్‌రెడ్డి

పరిశుభ్రత కోసం అనేక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసు ్తన్నాం. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నప్పటికి ఆసుపత్రికి వచ్చే వారు అర్ధం చేసుకోవడం లేదు. స్వీయ పరిశుభ్రత ఎవరికి వారు ఆలోచనాత్మకంగానే వ్యవహరిస్తేనే తప్ప సమస్యను పరిష్కరించలేం. మెరుగైన వైద్య సదుపాయాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. భవనం అందుబాటులోకి వస్తే మరింత వసతులు సమకూరే అవకాశం ఉంటుంది. ఎక్కడా ఎలాంటి నిర్లక్ష్యం చూపడం లేదు.

Updated Date - 2022-12-12T22:08:58+05:30 IST