సింగరేణి లాభాలపై స్పష్టత ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-09-09T04:21:28+05:30 IST

సింగరేణి లాభాలను ప్రక టించడంలో యాజమాన్యం జాప్యం చేస్తుండడం కార్మికులను ఆందోళ నకు గురిచేస్తోంది. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా యేటా ఏప్రిల్‌లో సంస్థ లాభనష్టాలపై లెక్కలు తీస్తారు. జూన్‌ లేదా జూలైలో కార్మికులకు లాభాల వాటా పంచడం ఆనవాయితీ. అయితే 5 నెలలు గడుస్తున్నా లాభాల ప్రకటనపై యాజమాన్యం స్పందించడం లేదు. సంస్థ సొమ్ము ప్రభుత్వానికి ధారాదత్తం చేయడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తు న్నారు. సంస్థ వద్ద డబ్బు లేకపోవడంతో తక్కువ లాభాలు చూపించడం ద్వారా కార్మికుల వాటాను తగ్గించే యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సంఘాలు అనుమానిస్తున్నాయి.

సింగరేణి లాభాలపై స్పష్టత ఎప్పుడు?

ప్రకటించడంలో  తీవ్ర జాప్యం  

కోల్‌ ఇండియా బోనస్‌పై  28న రాంచీలో  సమావేశం  

రూ.90 వేలు చెల్లించాలని కార్మికుల డిమాండ్‌ 

మంచిర్యాల, సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి): సింగరేణి లాభాలను ప్రక టించడంలో యాజమాన్యం జాప్యం చేస్తుండడం కార్మికులను ఆందోళ నకు గురిచేస్తోంది. మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుండగా యేటా ఏప్రిల్‌లో సంస్థ లాభనష్టాలపై లెక్కలు తీస్తారు. జూన్‌ లేదా జూలైలో కార్మికులకు లాభాల వాటా పంచడం ఆనవాయితీ. అయితే 5 నెలలు గడుస్తున్నా లాభాల ప్రకటనపై యాజమాన్యం స్పందించడం లేదు. సంస్థ సొమ్ము ప్రభుత్వానికి ధారాదత్తం చేయడంతో అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్లు కార్మిక సంఘాల నాయకులు ఆరోపిస్తు న్నారు. సంస్థ వద్ద డబ్బు లేకపోవడంతో తక్కువ లాభాలు చూపించడం ద్వారా కార్మికుల వాటాను  తగ్గించే  యోచనలో యాజమాన్యం ఉన్నట్లు సంఘాలు అనుమానిస్తున్నాయి. ఈ క్రమంలో కోల్‌ ఇండియాలో కార్మికు లకు లాభాల బోనస్‌ ప్రకటించేందుకు ఈనెల 28న రాంచీలో సమావేశం జరగనుంది. గత సంవత్సరం బోనస్‌  కింద కార్మికులకు రూ.72 వేలు ప్రకటించగా ఈ సంవత్సరం రూ.90 వేలు ఇవ్వాలని కార్మికులు, కార్మిక సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.    

కార్మికుల వాటాలో కోత?

ప్రభుత్వ ఖజానాకు సంస్థ సొమ్ము పెద్ద మొత్తంలో బదిలీ చేయడం, ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో సింగరేణి కార్మికుల జీతాలు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు బ్యాంకుల్లో రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంస్థ తీసుకున్న రుణాలకు పెద్ద మొత్తంలో వడ్డీలు చెల్లించడం, ఖర్చులు అడ్డగోలుగా పెరిగిపోవడంతో కంపెనీకి లాభాలు తగ్గినట్లు ప్రచారం జరుగుతోంది. 2018-19లో రూ.1400 కోట్ల లాభం రాగా 2019-20లో రూ.1600 కోట్లు,  2020-21లో రూ.900 కోట్లు లాభాలు వచ్చాయి. ప్రస్తుతం సంస్థ ఖజానా ఖాళీ కావడంతో ఈ ఆర్థిక సంవ త్సరం లాభాలను భారీగా తగ్గించి సుమారు రూ.300 కోట్లుగా చూపే ప్రయత్నం జరుగుతున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు. ఈ లెక్కన కార్మి కుల వాటాలోనూ భారీగా వ్యత్యాసాలు ఉండే అవకాశం ఉంది.  కార్మి కుల వాటా కింద కొన్నేండ్లుగా సింగరేణి యాజమాన్యం లాభాల్లో నుంచి 28 శాతం చెల్లిస్తుండగా గతేడాది 29శాతం ప్రకటించారు. సంస్థలో  42,500 మంది కార్మికులుండగా ఈయేడు రూ.300 కోట్ల లాభాలు ప్రకటిస్తే కార్మిక వాటా 29 శాతం కింద రూ.70 కోట్ల పైచిలుకు  చెల్లిం చాల్సి ఉంటుంది. ఈ లెక్కన కార్మికులకు ఒకొక్కరికి రూ.18 వేల వరకు వచ్చే పరిస్థితి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గడిచిన నాలుగేండ్ల కాలంలో కార్మికులు లాభాల బోనస్‌ కింద రూ.50 వేలు, రూ.90 వేలు, రూ.1.5 లక్షలు, రూ.18 వేల పైచిలుకు వరకు బోనస్‌ తీసుకున్న  సందర్భాలున్నాయి.  గతేడాది అక్టోబరు నెలలో బోనస్‌ను కార్మికులకు అందజేశారు.

28న కోల్‌ ఇండియా సమావేశం

సింగరేణి తన లాభాలు ఇప్పటి వరకు ప్రకటించకపోగా కోల్‌ ఇం డియా కార్మికులకు దీపావళి బోనస్‌ చెల్లించేందుకు సిద్ధమవుతుంది. ఈ నెల 28న రాంచీలో జాతీయ కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీ యూసీ, సీఐటీయూ, బీఎంఎస్‌ హెచ్‌ఎంఎస్‌ సంఘాలతో సమావేశం నిర్వహించి లాభాల బోనస్‌ వాటాను తేల్చేందుకు సమాయత్తం అవుతుం ది. గత సంవత్సరం కోల్‌ ఇండియా లాభాల బోనస్‌ కింద ప్రతి కార్మికు నికి రూ.72,500 చెల్లించగా ఈ  సంవత్సరం రూ.90 వేలు చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్‌ చేయనున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ట్రేడ్‌ యూనియన్‌ నాయకులతోపాటు సంబంధిత బొగ్గు పరిశ్రమల అధికారు లకు సర్క్యులర్‌ జారీ చేసింది. గత సంవత్సరం కంటే బోనస్‌ పెంపుదల కోసం యాజమాన్యంపై ఒత్తిడి తేవడానికి ప్రధాన కార్మిక సంఘాలు వేచి చూస్తున్నాయి. 

ప్రభుత్వ ఖజానాకు సంస్థ సొమ్ము 

సింగరేణి సంస్థకు  చెందిన వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజా నాకు మళ్ళించినట్లు ఆరోపణలున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.40 కోట్లు ముఖ్యమంత్రి సహాయ నిధి అందజేయగా, డీఎంఎఫ్‌టీ (డిస్ర్టిక్ట్‌ మినరల్‌ ఫండ్‌) నిధులు రూ.2,740 కోట్లు హరిత హారం కోసం కార్పొరేట్‌ సొషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్సార్‌) నిధులు సుమారు రూ.263 కోట్లను సంస్థ ప్రభుత్వానికి ధారాదత్తం చేసినట్లు తెలుస్తోంది. నాలుగేండ్లుగా  ప్రభుత్వం సింగరేణికి రూ.13 వేల కోట్ల పైచిలుకు బకాయిలు పడి నట్లు సమాచారం.  జెన్‌కోలో విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన బొగ్గుకు సంబంధించి రూ.4 వేల కోట్ల వరకు ప్రభుత్వం సింగరేణికి చెల్లించాల్సి ఉండగా జైపూర్‌ విద్యుత్‌ ప్లాంటు నుంచి ప్రభు త్వం అవసరాలకు  1200 మెగావాట్ల కరెంటుకు సంబంధించి దాదాపు  రూ.9 వేల కోట్ల  బిల్లులు రావాల్సి ఉన్నట్లు సమాచారం. 

దీపావళి బోనస్‌ ఏఐటీయూసీ ఘనత

వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి 

సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌ ఇప్పించడంలో ఏఐటీయూసీ కృషి ఎంతగానో ఉంది. ఏఐటీయూసీ పోరాట ఫలితంగా కార్మికులకు దీపావళి లాభాల బోనస్‌ను సింగరేణి సంస్థ ప్రకటించింది. గత సంవత్సరం కోల్‌ ఇండియాలో రూ.72,500 బోనస్‌గా ప్రకటించినందున ఈ సంవత్సరం రూ.90 వేల వరకు పెంచడానికి యాజమాన్యంపై ఒత్తిడి తీసుకువస్తాం. సింగరేణి యాజమాన్యం కూడా లాభాల వాటాలో 35 శాతం చెల్లించాలి. 


Read more