వేతనవెతలు
ABN , First Publish Date - 2022-08-18T05:42:19+05:30 IST
గ్రామస్థాయిలో ఉన్న సాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు మిషన్ కాకతీయ పథకం తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో మిషన్ భగీరథ పథ కాన్ని ప్రవేశపెట్టింది.

జిల్లాలో‘భగీరథ’ సిబ్బందికి నాలుగేళ్లుగా చాలీచాలని వేతనాలు
ఐదు నెలలుగా వేతనాల కోసం తప్పని ఎదురుచూపులు
రోజురోజుకూ పెరుగుతున్న శ్రమదోపిడీ
ఆందోళనలో వంద మందికి పైగా సిబ్బంది
పదిరోజుల వ్యవధిలో రెండుసార్లు సమ్మె
తాజాగా ఐదు మండలాలకు మరోసారి నిలిచిన మిషన్ భగీరథ
ఖానాపూర్, ఆగస్టు 17 : గ్రామస్థాయిలో ఉన్న సాగు నీటి సమస్యలను పరిష్కరించేందుకు మిషన్ కాకతీయ పథకం తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే సదుద్దేశంతో మిషన్ భగీరథ పథ కాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని తెచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలనే పట్టుదలతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా యుద్ధ ప్రాతిపదికన మిషన్ భగీరథ పనులను చేపట్టారు. ఒకదశలో ప్రతి ఇంటింటికీ నీళ్లు ఇవ్వని క్రమంలో తాను ఓట్లు అడిగేందుకు మీ ముందుకు రాను అని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేశారంటే ఈ పథకం అమలు చేయాలని పట్టుదల ఆయనలో ఎంతగా ఉండేదో స్పష్టమవుతుంది. ఇంత గొప్పలక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం క్షేత్రస్థాయిలో కొంత మంది అధికారుల నిర్లక్ష్యంతో నవ్వుల పాలవుతోంది. ఇంటింటికీ నల్లానీరు అందజేయడంలో క్షేత్రస్థాయి పనిచేసే సిబ్బంది అయినటు వంటి వాటర్ లైన్మెన్లు, పైప్ జాయింటర్స్, సూపర్వైజర్లు, ఇంజనీర్లు కీలకపాత్ర వహి స్తారు. కానీ అటువంటి వారిని వేతనాలు ఇవ్వకుండా నెలల తరబడిగా ఇబ్బందులు పెడుతున్న సంఘటన జిల్లాలోని కడెం మిషన్ భగీరథ సెగ్మెంట్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో 100 మందికి పైగా సిబ్బంది సమ్మేకు దిగారు. సిబ్బంది సమ్మెతో మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయి రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం నీరుగారిపోతుంది.
చాలీచాలని వేతనాలు..శ్రమదోపిడీ
కడెం మిషన్ భగీరథ గ్రిడ్పరిధిలో పనిచేస్తున్న సిబ్బంది తీవ్ర ఇబ్బం దులు పడుతున్నట్లు ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. ఈ సెగ్మెంట్ పరిధిలో ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్ ఐదు మండలాలకు మిషన్ భగీ రథ ద్వారా నీటిని సరఫరా చేసేందుకు 91 మంది వాటర్ లైన్మెన్లు, ఐదుగురు సూపర్వైజర్లు, ముగ్గురు ఇంజనీర్లు, ఏడుగురు పైప్ జాయిం టర్స్ ఇలా వంద మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ఇప్పటికీ చాలీచాలని వేతనాలు చెల్లిస్తూ ప్రభుత్వం నుంచి కాంట్రాక్టు తీసుకున్న కంపెనీలు కాలం వెళ్లదీస్తున్నాయనే ఆరోపణలు వినిపిస్తు న్నాయి. వాటర్ లైన్మెన్లకు దినసరి వేతనం ప్రభుత్వం నుంచి సదరు కాంట్రాక్టు కంపెనీకి రోజుకు 490 రూపాయల చొప్పున మంజూరవు తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ లెక్కన రూ.14వేల కు పైగా ఒక్కో వాటర్ లైన్మెన్ జీతం ప్రభుత్వం లెక్క కట్టి కాంట్రాక్టు కంపెనీలకు ముట్ట చెబుతుందని తెలుస్తోంది. అయినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం సిబ్బందికి చాలీచాలని వేతనాలే దిక్కవుతున్నాయి. తమకు కేవలం నెలకు రూ.7 వేలవేతనం మాత్రమే సదరుకంపెనీ చెల్లిస్తోందని వాటర్ లైన్మెన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క చాలీచాలని వేతనాలు చెల్లిస్తున్న భరిస్తూ పనిచేస్తున్న సిబ్బందిపై పనిభారం సైతం రోజురోజుకు పెరుగు తుంది. ఒక్కో వాటర్‌లైన్ మీదకు ఆరు నుండి 8 గ్రామాల వరకు ఇన్‌చార్జీలుగా బాధ్యతలు అప్పగించడంతో తీవ్రఇబ్బందులు పడుతున్నట్లు వారు చెబుతున్నారు. పేరుకు మాత్రమే ఉదయం సాయంత్రం పని ఉంటుందని చెబుతున్న అధికారులు తమను కనీసం ఇతర పనులకు వెళ్ల కుండా ఎప్పుడు అవసరం వచ్చినా ఫోన్లు చేసి పిలిపిస్తున్నట్లు ఆవేదన చెందుతున్నారు. పక్క జిల్లాలలో వాటర్ లైన్మెన్గా పనిచేస్తున్న వారికి రూ.10 వేలకు పైగా వేతనం చెల్లించడంతో పాటు అదనంగా ట్రావెల్ అలవెన్స్‌లు సైతం ఇస్తుంటే తమకు మాత్ర ఏడు వేల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేతనం కోసం ఐదు నెలలుగా ఎదురుచూపులు
కడెం మిషన్ భగీరథ గ్రిడ్ పరిధిలో పనిచేస్తున్న సిబ్బందికి ఐదు నెలలుగా వేతనాలు అందడం లేదని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి ఓ కంపెనీ కాంట్రాక్టు తీసుకొని మరో కంపెనీకి సబ్‌కాంట్రాక్టు ఇవ్వడం ఆ సబ్‌కాంట్రాక్టు తీసుకున్న కంపెనీ సైతం స్థానికంగా మరో కాంట్రాక్టర్‌కు మళ్లీ సబ్‌కాంట్రాక్టు ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బందికి వేతనాలు ఇవ్వడంలో జాప్యం జరుగుతున్నట్లు అధికారులు చెప్పకనే చెబుతున్నారు. పలుసార్లు కాంట్రాక్టు చేతులు మారుతూ వస్తుండడంతో క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందికి వేతనాల కోత తప్పడం లేదని తెలుస్తోంది. ప్రభుత్వం చెల్లిస్తున్న రూ. 490 దినసరి వేతనం నుండి క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న వాటర్ లైన్మెన్లకు వేతనం చెల్లించే సరికి కేవలం రూ. 233 మాత్రమే అందు తుంది. ఇచ్చే అరకొర వేతనాలను సైతం ఐదు నెలల పాటు ఆరు నెలల పాటు నిలిపి వేస్తుండడంతో తమ జీవనం సాగడం ఇబ్బంది అవుతుందని మిషన్ భగీరథ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిన నీటి సరఫరా
తమకు వేతనాలు చెల్లించకపోవడం పట్ల ఆగ్రహించిన మిషన్ భగీరథ కడెం గ్రిడ్ సిబ్బంది ఖానాపూర్ మండలంలోని సత్తనపెల్లి గ్రామంలో రెండు రోజుల క్రితం ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఈ సమావేశంలో వేతనాలు చెల్లించే వరకు విధులకు వెళ్లేది లేదని నిర్ణయించుకుని సమ్మేకు దిగారు. ఈ నెల 5వ తేదీన సైతం వేతనంలో చెల్లింపుపై సమ్మేకు దిగిన కడెం మిషన్ భగీరథ గ్రిడ్ సిబ్బందితో అధికారులు మాట్లాడి ఈ నెల 10వ తేదీలోపు వేతనాలు చెల్లించేలా చర్యలు చే పడతామని చెప్పడంతో సమ్మేను విరమించుకున్నారు. కానీ ఇచ్చిన గడువు లోపల వేతనాలు చెల్లించకపోగా అడిగిన సిబ్బందిని తొలగిస్తామని బెదిరింపులకు గురి చేస్తున్న క్రమంలో మరోసారి సమ్మేకు దిగక తప్పలేదని సిబ్బంది చెబుతున్నారు. తామంతా వేతనాలు సరిగ్గా చెల్లించకపోయినప్పటికీ విధులు నిర్వహిస్తూ వచ్చామని, ఇప్పుడు జీతాలు ఇవ్వమని అడిగితే విధుల్లోంచి తొలగిస్తామని బెదిరించడం ఎంతవరకు సబబని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో తమ సమస్యను పరిష్కరించే వరకు నీటి విడుదల చేయబోమని సిబ్బంది భీష్మించుకు కూర్చోవడంతో ఖానాపూర్, కడెం సెగ్మెంట్ పరిధిలోని ఐదు మండలాలకు శనివారం నుండి మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. తాము విధులు నిర్వహించే సమయంలో సైతం తమకు ఎటువంటి భద్రత లేదని వాటర్ వాల్స్‌లో పాములు, తేళ్లు లాంటివి ఉంటున్నాయని చెబుతున్నారు. తమకు ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత కల్పించాలని వారు కోరారు.
ఐదు నెలలుగా వేతనాలు లేవు
మాకు ఐదు నెలలుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాం. మాకు గతంలో పీఎల్ఆర్ కంపెనీ ద్వారా వేతనాలు చెల్లించేవారు. ఇప్పుడు మరో కాంట్రాక్టర్‌కు సబ్ కాంట్రాక్టు ఇచ్చారు. దీంతో మాకు వేతనాలు సరైన సమయానికి అందడం లేదు. వేతనాలు చెల్లించి మాకు అండగా నిలవాలి.
- పి. శేఖర్, మిషన్ భగీరథ కడెం గ్రిడ్ వాటర్ లైన్మెన్
జీతాలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తాం
ఐదు నెలల నుండి పనులు చేయించుకుని జీతాలు చెల్లించడం లేదు. జీతాలు చెల్లించే వరకు పోరాటం కొనసాగిస్తాం. నెలల తరబడి జీతాలు ఇవ్వకపోతే మాకు ఇబ్బందిగా ఉంది.
బేర తిరుమలేష్, మిషన్ భగీరథ ఆపరేటర్
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
కడెం, ఖానాపూర్ మిషన్ భగీరథ సెగ్మెంట్ పరిధి లో పనిచేస్తున్న సిబ్బందికి నాలుగునెలలుగా వేతనా లు రాక సమ్మెకు దిగిన మాటవాస్తవమే. క్షేత్ర స్థాయి లో వారి సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లాం. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్ వేతనాలు చెల్లిం చక పోతే వచ్చే నెల నుండి పీఎల్ఆర్ కంపెనీ ద్వారానే వేతనాలు చెల్లించేలా చర్యలు చేపడుతాం.