26లోగా ఓటరు నమోదు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-15T01:40:56+05:30 IST

ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియను డిసెంబరు 26 నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు.

26లోగా ఓటరు నమోదు పూర్తి చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌, అధికారులు

ఆదిలాబాద్‌ టౌన్‌, డిసెంబరు 14: ఓటరు నమోదుకు సంబంధించిన ప్రక్రియను డిసెంబరు 26 నాటికి పూర్తి చేయాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ అన్నారు. బుధవారం హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, ఈఆర్‌వోలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు నమోదు తదితర దరఖాస్తులకు సంబంధించిన డిజిటలైజ్‌ ప్రక్రియను ఈనెల 26 నాటికి పూర్తి చేయాలని అన్నారు. జనాభా, ఓటర్ల నిష్పత్తి, జెండర్‌ నిష్పత్తిపై దృష్టిసారించాలని సూచించారు. అదేవిధంగా కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ మాట్లాడుతూ ఫారం-6 ద్వారా 24,655 డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ఈ నెల 26 నాటికి అన్ని రకాల ప్రక్రియ పూర్తిచేయాలని అన్నారు. జనాభా ఆధారంగా ఓటర్ల నిష్పత్తి పెంచాలని ఈఆర్‌వోలను ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ నటరాజ్‌, బోథ్‌ ఈఆర్‌వో వెంకటేశ్వర్లు, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియ, స్వీప్‌ నోడల్‌ అధికారి లక్ష్మణ్‌, తహసీల్దార్‌ సతీష్‌, నాయబ్‌ తహసీల్దార్లు ప్రవీణ్‌, మహేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-15T01:41:00+05:30 IST