నాణ్యతకు తిలోదకాలు!

ABN , First Publish Date - 2022-10-07T06:06:57+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాల్లో అడుగడుగున అవినీతి అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభానికి ముందే పగుళ్లు తేలి శిథిలాలుగా మారుతున్నాయి. దాదాపుగా అన్ని చోట్ల రైతు వేదికల నిర్మాణం పనులు పూర్తయిన నిరుపయోగంగానే దర్శనమిస్తున్నాయి.

నాణ్యతకు తిలోదకాలు!
తలమడుగు మండలం ఝరి రైతు వేదిక

జిల్లాలో మున్నాళ్ల ముచ్చటగానే మారిన రైతు వేదికల నిర్మాణం

ప్రారంభానికి ముందే పగుళ్లు తేలుతున్న వైనం

నాణ్యత విభాగం అధికారుల పరిశీలనలో డొల్లతనం

బాధ్యతలు అప్పగించినా.. కన్నెత్తి చూడని ఏఈవోలు


ఆదిలాబాద్‌, అక్టోబరు6 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాల్లో అడుగడుగున అవినీతి అక్రమాలు జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని చోట్ల ప్రారంభానికి ముందే పగుళ్లు తేలి శిథిలాలుగా మారుతున్నాయి. దాదాపుగా అన్ని చోట్ల రైతు వేదికల నిర్మాణం పనులు పూర్తయిన నిరుపయోగంగానే దర్శనమిస్తున్నాయి. క్లస్టర్ల వారీగా రైతులతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ వారికి పంటల సాగు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో నిర్మించిన రైతు వేదికలను నిరుపయోగంగానే వదిలేస్తున్నారు. ఒక్కో రైతు వేదికకు రూ.22లక్షలు ఖర్చు చేసి నిర్మించిన ఏ మాత్రం ప్రయోజనం లేదంటున్నారు. ప్రభుత్వ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో మాత్రం పరిస్థితులు దానికి భిన్నంగా కనిపిస్తున్నాయి. జిల్లాలో 101 క్లస్టర్ల పరిధిలో 101 రైతు వేదికలను నిర్మించారు. ఆదిలాబాద్‌, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌ నియోజక వర్గాల పరిధిలో కొన్ని రైతు వేదికలను అందుబాటులోకి తెచ్చిన మరికొన్నింటిని ప్రారంభించకుండానే వదిలేశారు. కానీ ఊరికి దూరంగా ఉండడం, విద్యుత్‌ సౌకర్యం లేక పోవడంతో నిర్వాహణ ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఎందుకంటే జిల్లాలో పని చేస్తున్న ఏఈవోలలో సగం మంది మహిళా అధికారులే కావడంతో ఒంటరిగా రైతు వేదికలలో విధులు నిర్వహించడం కష్ట సాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రారంభంలో అడప దడపగా అధికారులు సమావేశాలు నిర్వహిస్తు రైతు వేదికలకు వచ్చి పోయిన ప్రస్థుతం అటువైపు కన్నెత్తి చూడడం లేదని రైతులు పేర్కొంటున్నారు. 

అన్ని రైతు వేదికల్లో లోపాలే..

జిల్లాలో నిర్మించిన అన్ని రైతు వేదికల్లోనూ లోపాలే కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా క్వాలిటి కంట్రోల్‌ (క్యూసీ) విభాగం అధికారులు క్షేత్ర స్థాయిలో రైతు వేదికల నిర్మాణ పనులను పరిశీలించగా ఏ ఒక్కటి నాణ్యతగా నిర్మించ లేదని తేలింది. జిల్లాలో నిర్మించిన 101 రైతు వేదికల్లో ఇప్పటి వరకు అధికారులు 65 రైతు వేదికల పనులను పరిశీలించారు. అన్నింటిల్లోనూ నాణ్యతా ప్రమాణాలు లోపించినట్లు అధికారులు గుర్తించారు. దీంతో సంబంధిత సర్పంచ్‌లకు రికవరీ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పంచాయతీ ఇంజనీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ సక్రమంగా లేక పోవడంతోనే నాణ్యతా ప్రమాణాలు పాటించ లేదని క్యూసీ విభాగం అధికారులు అంచనా వేస్తున్నారు. ఏఈ నుంచి ఈఈ వరకు కమిషన్లకు కక్కుర్తి పడి నాణ్యత ప్రమాణాలను గాలికి వదిలేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పర్సంటేజీలు ఇస్తే బిల్లులు చెల్లించిన పీఆర్‌ అధికారులు క్యూసీ విభాగం అధికారుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక తడబడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో నిర్మించిన అన్ని రైతు వేదికలపై విజిలెన్స్‌ విచారణ జరిపిస్తే అసలు అవినీతి బయట పడే అవకాశం ఉంది. దీనిపై జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక దృష్టిని సారించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. 

మూసిన తలుపులు తెరిచెదెప్పుడో..

జిల్లాలో దాదాపుగా రైతు వేదికల నిర్మాణం పనులు పూర్తికావడంతో వీటి నిర్వాహణ బాధ్యతను వ్యవసాయ శాఖ అధికారులకు అప్పగించారు. కానీ నెలల తరబడి మూసిన తలుపులు తెరవక పోవడంతో ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం లేదు. కనీసం నెలలో ఒకటి రెండు సార్లు కూడా ఏఈవోలు, రైతు వేదికలను సందర్శించిన దాఖలాలు కనిపించడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం ఫర్నీచర్‌, నిర్వాహణ నిధులను కూడా అందిస్తున్న ఏఈవోలు పక్కదారి పట్టించారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. లక్షల రూపాయలు వెచ్చించి రైతు వేదికలను నిర్మించిన అందుబాటులోకి రాక పోవడంతో రైతులు గతంలో మాదిరిగానే గ్రామ ప్రధాన కూడళ్లు, చెట్ల కిందనే సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ తమ సమస్యలను చర్చించుకోవడం కనిపిస్తోంది. కొన్ని చోట్ల స్థానిక ప్రజలు విందులు, ఫంక్షలను జరుపుకోవడం కూడా కనిపిస్తోంది. మరికొన్ని చోట్ల రైతులు ఎరువులు, విత్తనాలను నిల్వ చేసుకునేందుకు ముందుకు వస్తున్న అధికారులు మాత్రం అనుమతించకుండానే తాళం వేసి ఉంచుతున్నారు. ఇప్పటికే పలు రైతు వేదికల తాళాలను పగులగొట్టిన మందు బాబులు అడ్డాలుగా మార్చుకుని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. నిర్వహణ ఇలానే ఉంటే రైతు వేదికలు శిథిలాలుగా మారే అవకాశం ఉందంటున్నారు. నిర్వాహణ సక్రమంగా లేక పోవడంతో పలు రైతు వేదికలు పిచ్చిమొక్కల మధ్య అధ్వానంగా కనిపిస్తున్నాయి. కనీసం లోనికి వెళ్లేందుకు దారి కూడా కనిపించడం లేదు. 

ప్రారంభానికి ముందే పగుళ్లు

పది కాలాల పాటు పదిలంగా ఉండాల్సిన రైతు వేదికల నాణ్యత మూన్నాళ్ల ముచ్చటగా నే మారింది. కొన్ని చోట్ల ప్రారంభానికి ముందే పగుళ్లుబారి కనిపిస్తున్నాయి. అధికారుల అంచ నాలకు భిన్నంగా నిర్మాణాలను చేపట్టినట్లు రుజువవుతుంది. అంచనాల ప్రకారం కాకుండా కొందరు సర్పంచ్‌లు అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టడంతోనే నాణ్యత కొరవడిందని తెలు స్తోంది. దీంతో రైతు వేదికల నిర్మాణాలపై ఎన్నో అనుమానాలు తలెత్తుతు న్నాయి. జిల్లా లోని ఏ ఒక్క రైతు వేదిక నిర్మాణం నాణ్యత ప్రమాణాలతో నిర్మించినట్లు కనిపించడమే లేదు. అకస్మాత్తుగా ఈదురు గాలులు సంభ విస్తే పైకప్పులు ఎగిరి పడే ప్రమాదం ఉందం టున్నారు. సరిగ్గా క్యూరింగ్‌ చేయక పోవడంతో అప్పుడే గోడలు పగుళ్లు తేలి కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల మెట్లకు వేసిన టైల్స్‌ పగిలి అధ్వానంగా మారాయి. మరుగుదొడ్ల నిర్మాణం అసంపూర్తిగానే మిగిలి పోయాయి. తలుపులు, కిటికీలు విరిగి పోయాయి. ఇప్పుడే ఇలాంటి పరిస్థితి ఉంటే రాబోయే రోజుల్లో రైతు వేదికల నిర్మాణాల నాణ్య త ఎలా ఉంటుందోనన్న అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.

Read more