బురద రోడ్లతో ఇంకెన్నాళ్లీ అవస్థలు

ABN , First Publish Date - 2022-09-26T04:11:24+05:30 IST

కాగజ్‌నగర్‌ ప్రజలు రోడ్లపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇంకెన్నాళ్లో మాకీ అవస్థలు అని ఆందోళన చెందుతున్నారు. ప్రతీ వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

బురద రోడ్లతో ఇంకెన్నాళ్లీ అవస్థలు
కాగజ్‌నగర్‌ అటవీ శాఖ సమీపంలో రోడ్డు దుస్థితి(ఫైల్‌)

-మట్టి రోడ్లతో తంటాలు

-ఇబ్బందులు పడుతున్న ప్రజలు

-మున్సిపాల్టీలో అధ్వాన్న రోడ్లు 

-వర్షం వస్తే తంటాలు

కాగజ్‌నగర్‌, సెప్టెంబరు 25: కాగజ్‌నగర్‌ ప్రజలు రోడ్లపై తమ అసహనాన్ని వ్యక్తం చేస్తూ ఇంకెన్నాళ్లో మాకీ అవస్థలు అని ఆందోళన చెందుతున్నారు. ప్రతీ వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. సిర్పూరు నియోజవకర్గంలో ఎక్కువగా అంత్గతరోడ్లు, ప్రధాన రోడ్లు పూర్తి మట్టివికావడంతో అవస్థలు పడాల్సి వస్తోంది. వర్షాలు కురిస్తే ఈ మట్టి రోడ్లపై ద్విచక్రవాహనాలు కదలలేని పరిస్థితి. ఇక నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సిర్పూరు(టి), దహెగాం, కాగజ్‌నగర్‌, బెజ్జూరు, పెంచికల్‌పేట మండలాల్లో మట్టి రోడ్లతో తంటాలు పడాల్సి వస్తోంది. ఇక కాగజ్‌నగర్‌ మండలంలో గాంధీనగర్‌ రోడ్డు మరింత దారుణంగా తయారైంది. గతంలోఉన్న రోడ్డుపై మొరం పోసి పనులు చేపట్టారు. మూడు రోజలుగా వర్షాలు కురుస్తుండటంతో ఇప్పుడు మొరం రోడ్డంతా బురదమయంగా మారింది. ఈ రోడ్డుపై నడుస్తూ పలువురు కిందపడ్డారు. మొరం పోసిన తర్వాత రోలర్‌తో తొక్కించకపోవటం పనులన్నీ కూడా తూతూ మంత్రాంగా చేశారని కాలనీ వాసులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటం ఏంటనీ అంతా ప్రశ్నిస్తున్నారు. మంచి రోడ్డుపై మొరం పోసి అంతా చెడగొట్టారని పేర్కొంటున్నారు. 

కాగజ్‌నగర్‌ పరిస్థితిలో మరింత దారుణం

కాగజ్‌నగర్‌లో అత్యవసరంగా రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నప్పటికి వర్షానికి కొట్టుకొని పోతున్నాయి. దీంతో మళ్లీ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది. ఎన్టీఆర్‌ చౌరస్తా నుంచి మార్కెట్‌ ఏరియా వరకు గుంతలు తేలిఉంది. భారీ వాహనాలు నిత్యం వస్తుండటంతో రోడ్లు అధ్వానంగా తయారవుతున్నాయి. రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి పొట్టి శ్రీరాములు చౌరస్తా వరకు కూడా ఇదే పరిస్థితి ఉంది. అధికారులు స్పందించి బీటీరోడ్డు వేస్తే బాగుండేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ విషయంలో పాలకవర్గ సభ్యులు కూడా ఎనిమిది నెలల క్రితం తీర్మాణం చేసినప్పటికీ ఉన్నతాధికారులు పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. దీంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. ప్రజలు అధికారులపై సోషల్‌ మీడియాలో మంత్రి కేటీఆర్‌కు పోస్టులు పెట్టారు. అలాగే సీఎం కేసీఆర్‌కు ట్విట్టర్‌లో కూడా పోస్టులు పెట్టారు. మాస్టర్‌ ప్లాన్‌ అమలు చేసి రోడ్ల వెడల్పు చేసేందుకు పెండింగ్‌లో పెట్టినట్టు తెలిసింది. వాస్తవంగా అత్యవసర పరిస్థితి ఉన్నందున పనులకు గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వాలని పలువురు కాలనీవాసులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో మున్సిపల్‌ ఛైర్మన్‌ సద్దాంహుస్సేన్‌ స్వయంగా రోడ్ల పరిస్థితిపై పరిశీలించారు. వర్షాలు మళ్లీ కురుస్తుండటంతో ఎక్కడలేని ఇబ్బందులు పడాల్సి వస్తోందని ద్విచక్రవాహనదారులు తెలిపారు.

మొరం పోయడంతో అంతా బురదయింది

-రాజయ్య, గాంధీనగర్‌-2, కాగజ్‌నగర్‌

మా కాలనీకి గతంలో ఉన్న రోడ్డుపై మొరం పోశారు. ఇప్పుడు వర్షాలు కురుస్తున్నాయి. నడిచేందుకు కూడా వీలు లేనిపరిస్థితి ఉంది. ఈ రోడ్డుపై పలువురు వృద్ధులు కిందపడ్డారు. అందరికి ఇబ్బందులే. చాలా కష్టంగా ఉంది. రోడ్డంతా బురదతోనే నిండిపోయి ఉంటుంది. ఎప్పుడు ఎవరు పడుతారో తెలియని పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు సమస్యను పరిష్కరిస్తే బాగుంటుంది.

రోడ్లన్నీ అధ్వానం

-అంబాల ఓదెలు, కాగజ్‌నగర్‌ 

కాగజ్‌నగర్‌ పట్టణ రోడ్లు పూర్తిగా గుంతలు తేలి ఉన్నాయి. అధికారులు ప్రజల అవస్థలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. మళ్లీ వర్షాలు కొడితే పాతపరిస్థితి ఏర్పడుతుంది. అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకుంటే బాగుటుంది. రాత్రిళ్లు వర్షం నీరు గుంతల్లో నిండిదంటే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎన్టీఆర్‌చౌరస్తా వద్ద అతి ప్రమాదకరంగా ఉన్నాయి.

Read more