రెండవ విడత కంటి వెలుగు పకడ్బందీగా నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-12-07T01:50:56+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు.

రెండవ విడత కంటి వెలుగు పకడ్బందీగా నిర్వహించాలి

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 6 : రాష్ట్ర వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. మంగళవారం జగిత్యాల కలెక్టరేట్‌ కార్యాలయం నుంచి రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు వైద్యశాఖ కమిషనర్‌ శ్వేత, హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌, హైదరాబాద్‌ నుంచి వైద్యశాఖ కార్యదర్శి సయ్యద్‌ అలీ ముర్తుజా రిజ్వితో కలిసి జిల్లా కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం నిర్వహించారు. రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. జిల్లాసమీకృత కలెక్టరేట్‌ వీడియో సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడేతో కలిసి వీడియో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రజల కంటి సమస్యలు తొలగించుటకు ముఖ్య మంత్రి ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు కార్యక్రమం చేపట్టారని, రెండవ విడత కార్యక్రమం 2023 జనవరి 18 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమర్థవంతంగా నిర్వహించుటకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని సూచించారు. జిల్లాలో గ్రామాలు, మున్సిపల్‌ వార్డుల వారీగా కంటి వెలుగు శిబిరాల షెడ్యూల్‌ను పంచాయతీ అధికారులు, మున్సిపల్‌ కమిషనర్‌లు, వైద్య శాఖ అధికారులు సమన్వయంతో తయారు చేయాలన్నారు. జిల్లాలో ఉన్న జనా భాకు అనుగుణంగా అవసరమైన మేర బృందాలను సన్నద్ధం చేసుకోవాలని, గతంలో 827 బృందాలు కంటివెలుగులో పనిచేయగా, ఇప్పుడు ఆ సంఖ్యను 1500లకు పెంచడం జరిగిందన్నారు. ప్రతీటీమ్‌లో ఒక డాక్టర్‌, ఆప్తోమెట్రిస్ట్‌, 3 ఆశాలు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, 1 డాటా ఎంట్రీ ఆపరేటర్‌, 2 సీహెచ్‌వోలు ఉండే విధంగా చూసుకోవాలని సూచించారు. జిల్లాలో బృందాలకు వసతిసౌకర్యం ఏర్పాట్లను కల్పించడం జరుగుతుందని, ప్రతీరోజు ఉదయం 9 గంటలకు గ్రామా ల్లో, వార్డుల్లో శిబిరాలు ప్రారంభించాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాల నిర్వమణకు అవసరమైన సామాగ్రిని, రీడింగ్‌ కళ్ళద్దాలను జిల్లాలకు పంపుతామని, వాటిని పీహెచ్‌సీ ద్వారా బృందాలకు పంపిణీ చేయా లని మంత్రి సూచించారు. పరీక్షల అనంతరం రీడింగ్‌ కళ్ళద్దాలు అదే రోజు డిస్టె న్స్‌, స్పెసిఫిక్‌ కళ్ళద్దాలు నెలరోజుల్లో ప్రజలకు అందజేస్తామని మంత్రి అన్నారు. డిస్టెన్స్‌, స్పెసిఫిక్‌ కళ్ళద్దాలపై బార్‌కోడ్‌ ఏర్పాటు చేసి, సదరు వ్యక్తులకు ఆశాల ద్వారా అందజేయాలన్నారు. జిల్లాలో ఆప్తమాలజిస్టుల నియామకాలను త్వరగా పూర్తి చేసి, జాబితా అందజేస్తూ సరోజినీ కంటి ఆసుపత్రి, ఎల్‌బి ప్రసాద్‌ ల్యాబ్‌లో శిక్షణ అందజేయడం జరుగుతుందని, వైద్య బృందాలకు అవసరమైన డాటా ఎంట్రీ ఆపరేటర్‌ నియామకం సైతం చేపట్టి, వారికి జిల్లా స్థాయిలో అవ సరమైన శిక్షణ అందించాలన్నారు. కంటివైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వలన సాధారణ వైద్యసేవలకు అంతరాయం కలుగకుండా చూడాలని తెలిపారు. రాష్ట్రంలో నూతనంగా 969 డాక్టర్ల నియామకం వారంలో పూర్తవుతుందని, వీరికి అదనంగా ఆర్‌ బీఎస్‌కే వైద్యులను, ఆయూష్‌ వైద్యులను వినియోగించుకోవాల న్నారు. కంటి వెలుగు శిబిరాల్లో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని, గ్రామాల్లో, వార్డుల్లో ప్రజలంతా కంటి వెలుగు శిబిరాలను వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ... జిల్లాలో ఉన్న జనాభాకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన బృందాలను ఏర్పాటు చేస్తామని, జిల్లా పంచాయతీ అధికారి మున్సిపల్‌ కమిషనర్లు, వైద్య అధికారుల సమన్వయంతో షెడ్యూల్‌ తయారు చేస్తామని అన్నారు. జిల్లాలో విజయవంతంగా కంటి వెలుగు శిబిరాల నిర్వహణకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వీడియో సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి ధనరాజ్‌, జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత, మున్సిపల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T01:50:58+05:30 IST