గిరిజనులకు ‘దారి’ చూపిన పోలీసులు

ABN , First Publish Date - 2022-12-15T22:50:16+05:30 IST

తిర్యాణి, డిసెంబరు 15: అదొక్క మారుమూల గిరిజన గ్రామం. ఆ గ్రామానికి కనీస రవాణా సౌకర్యం లేక ఏడు దశాబ్ధాలుగా పడుతున్న బాధ వర్ణణాతీతం. చుట్టూ దట్టమైన అడవులతో కూడిన గుట్టల మధ్య ఉండే ఈ గ్రామ ప్రజలు ఎటు వెళ్లాలన్నా కొండలు, కోనలు ఎక్కుతూ దిగుతూ మృగాల బారిన పడకుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలినడకన వాగులు వంకలు దాటుతూ రాకపోకలు కొనసాగించాల్సిందే. అలాంటి ఈ గ్రామానికి పోలీసులు దారి చూపి వారికి రహదారి సౌకర్యం కల్పించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు.

గిరిజనులకు ‘దారి’ చూపిన పోలీసులు

- తొలిగిన రహదారి కష్టాలు

- ఏడు గూడాల ప్రజలకు నెరవేరిన ఏడుదశాబ్దాల కల

తిర్యాణి, డిసెంబరు 15: అదొక్క మారుమూల గిరిజన గ్రామం. ఆ గ్రామానికి కనీస రవాణా సౌకర్యం లేక ఏడు దశాబ్ధాలుగా పడుతున్న బాధ వర్ణణాతీతం. చుట్టూ దట్టమైన అడవులతో కూడిన గుట్టల మధ్య ఉండే ఈ గ్రామ ప్రజలు ఎటు వెళ్లాలన్నా కొండలు, కోనలు ఎక్కుతూ దిగుతూ మృగాల బారిన పడకుండా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలినడకన వాగులు వంకలు దాటుతూ రాకపోకలు కొనసాగించాల్సిందే. అలాంటి ఈ గ్రామానికి పోలీసులు దారి చూపి వారికి రహదారి సౌకర్యం కల్పించి వారి జీవితాల్లో కొత్త వెలుగులు నింపారు. ఏడు దశాబ్దాల వారి కలను నెరవేర్చి పోలీసులు వారికి దేవుళ్లయ్యారు. అదే గుండాల గ్రామం.

తిర్యాణి మండలంలోని గుండాల గ్రామానికి కనీస రహదారి సౌకర్యం లేకపోవడంతో అక్కడి ప్రజలు ఎటు వెళ్లాలన్నా కాలినడకే శరణ్యం. ఇటీవల జిల్లా ఎస్పీ సురేష్‌కుమార్‌ గుండాల గ్రామానికి రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గుండాల పరిధిలోని రాజగూడ, చిట్లగూడ, దాబగూడ, అర్జుగూడ, పూనగూడ, గుడివాడ, దొడ్డిగూడ ఈ ఏడు గూడాల ఆదివాసీలు పడుతున్న అవస్థలను చూసి చలించిపోయారు. ఎలాగైనా వీరి సమస్యను పరిష్కరించాలని తాపత్రాయపడ్డారు. దీనికి తోడు తిర్యాణి ఎస్సై సుంచు రమేష్‌ వారి పరిస్థితిని ఎస్పీ సురేష్‌కుమార్‌, సీఐ నరేందర్‌కు కళ్లకు కట్టినట్లు వివరించారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ, పోలీసులు గ్రామ ప్రజల సహకారంతో రొంపల్లి నుంచి గుండాల వరకు ఏడు కిలో మీటర్ల మేర మట్టి రోడ్డును ఏర్పాటు చేశారు. దీంతో కాలినడకే కష్టమయ్యే దారి నేడు వాహనాలు వెళ్లే రహదారిగా తయారవడంతో ఆ గ్రామాల ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఈ ఏడు గూడాల్లో సుమారు 850మంది జనాభా నివసిస్తున్నారు. రోడ్డు సౌకర్యంతో తమకు మండల కేంద్రానికి రవాణా సౌకర్యం మెరుగు పడిందని తమకు దారి చూపిన దేవుళ్లు పోలీసులేనని కొనియాడుతున్నారు. రోడ్డు సౌకర్యం లేనప్పుడు రొంపల్లి నుంచి రేషన్‌ సరుకులను నెత్తి మొపుల ద్వారా తెచ్చుకుంటూ అవస్థలు పడేవాళ్లమని, కనీసం ద్విచక్ర వాహనం వెళ్లలేని మార్గం ఉండడంతో ఎవరైనా అనారోగ్యం బారిన పడినప్పుడు మంచంపై పడుకోబెట్టి నలుగురు మోసుకెళ్తు ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందించిన సందర్భాలు ఉన్నాయన్నారు. గర్భిణులు ప్రసవ సమయంలో వైద్యశాలకు వెళ్లాలంటే వారికి మరో జన్మ ఎత్తినంత ఇబ్బంది ఉండేదన్నారు. ఈ రహదారి సౌకర్యంతో తమ కష్టాలు తీరిపోయాయని ఆయా గూడాల ప్రజలు పేర్కొంటున్నారు. ఏదీ ఏమైనా మారు మూల ఆదివాసీ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసిన పోలీసులను గ్రామస్థులు అభినందిస్తున్నారు. కాగా గుండాల పరిధిలోని ప్రజల భాగస్వామ్యంతో సింగరేణి యజమాన్యం సహకారంతో ఈ రోడ్డు నిర్మించామని, దీనికి అయిదు లక్షల వరకు ఖర్చు అయిందని ఎస్పీ పేర్కొన్నారు. గతంలో రోడ్డు దుస్థితి గురించి ఎన్నో కథనాలు రాసిన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికను ఈ సందర్భంగా అభినందించారు.

- నడక గోస తప్పింది..

- అడ తిరుపతి, గుండాల

మా తాతల తండ్రుల కాలం నుంచి ఎటు వెళ్లాలన్న రోడ్డులేక కాలినడకనే వెళ్లేవాళం. పోలీసులు మట్టి రోడ్డు ఏర్పాటు చేయడంతో మా నడక గోస తప్పింది. ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం.

- ఇక నుంచి రేషన్‌ సరుకులు ఊర్లోనే తీసుకోవచ్చు

- అశోక్‌, గుండాల

మా ఊరికి రోడ్డు లేకపోవడంతో ఆదివాసీలు రొంపల్లికి వాగులు, వంకలు దాటి కాలినడకన నెత్తిన మోపులతో ఏడు కిలో మీటర్లు నడిచి సరుకులను తెచ్చుకునే వాళ్లం. ఇక నుంచి ఊర్లోనే తీసుకోవచ్చు. పోలీసులకు ధన్యవాదాలు.

- ప్రజా శ్రేయస్సే పోలీసుల ధ్యేయం..

- రమేష్‌, ఎస్సై, తిర్యాణి

శాంతిభద్రతలు సామాజిక కార్యక్రమాలు మాకు రెండు కళ్లు. ప్రజల సమస్యలను తెలుసుకంటూ సాధ్యమైంతన మేర అందరి భాగస్వామ్యంతో పరిష్కరిస్తున్నాం. గుండాల ప్రజలు రోడ్డు లేక పడుతున్న అవస్థలను చూసి చలించిపోయాం. పోలీసు ఉన్నతాధికారులకు నివేదించడంతో ఎస్పీ సురేష్‌కుమార్‌ ప్రత్యేక దృష్టిసారించడంతో గుండాలకు ఏడు కిలోమీటర్ల మట్టి రోడ్డు వేశాం. అలాగే పలు స్వచ్ఛంద సంస్థల ద్వారా వైద్యశిబిరాలతోపాటు దుప్పట్లు, యువతకు క్రీడా సామగ్రి పంపిణీ చేస్తున్నాం. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీసులను సంప్రదించాలి.

Updated Date - 2022-12-15T22:50:17+05:30 IST