నూతన కమిటీపైనే పోడు రైతుల ఆశలు

ABN , First Publish Date - 2022-09-23T04:24:52+05:30 IST

జిల్లాలో ఏళ్లు గడుస్తున్నా పోడు సమస్యలు పరిష్కారం కావడం లేదు. పోడు భూములను బీద రైతులు సాగుచేసి జీవనం గడుపుతున్నా పట్టాలు మాత్రం రావడం లేదు. ప్రభుత్వం నియమించిన కమిటీలకు గ్రామాలవారీగా వచ్చిన ధరఖాస్తులు చేసినా ఇప్పటికీ వాటిపై చర్యలు చేపట్టలేదు.

నూతన కమిటీపైనే పోడు రైతుల ఆశలు
దుక్కి దున్నుతున్న రైతు

- జిల్లాలో ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాని పోడు సమస్య

- ధరఖాస్తులు స్వీకరించి.. భూసర్వే చేపట్టని అధికారులు

- పోడు రైతుల సమస్యలు పరిష్కారమయ్యేనా..?

- జిల్లాలో 31,311 మంది రైతుల దరఖాస్తులు 

చింతలమానేపల్లి, సెప్టెంబరు 22: జిల్లాలో ఏళ్లు గడుస్తున్నా పోడు సమస్యలు పరిష్కారం కావడం లేదు. పోడు భూములను బీద రైతులు సాగుచేసి జీవనం గడుపుతున్నా పట్టాలు మాత్రం రావడం లేదు. ప్రభుత్వం నియమించిన కమిటీలకు గ్రామాలవారీగా వచ్చిన ధరఖాస్తులు చేసినా ఇప్పటికీ వాటిపై చర్యలు చేపట్టలేదు. ఇప్పటికీ పోడురైతులు తమ భూముల పట్టాల కోసం నిత్యం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. జిల్లా అధికారులకు నిత్యం తమగోడు వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోడు సమస్య ఉండడంతో ప్రభుత్వం కొత్త సమన్వయ కమిటీని నియమించింది. దీనితోనైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయా అని రైతులు ఎదురు చూస్తున్నారు.

జిల్లాలో దరఖాస్తులు

జిల్లాలోని 15మండలాల పరిధిలో 1.18లక్షల ఎకరాల కోసం 31,311 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 63,023ఎకరాల కోసం 15,479 మంది ఆదివాసీ రైతులు దరఖాస్తులు చేసుకున్నారు. అలాగే 55,048 ఎకరాల పోడుభూముల కోసం 15,832మంది గిరిజనేతర రైతులు దరఖాస్తు చేసుకున్నారు. 22నవంబరు 2021వరకు అధికారికంగా దరఖాస్తులు స్వీకరించగా ఆ తర్వాత డిసెంబరు నెలాఖరు వరకు కూడా దరఖాస్తులను తీసుకున్నారు. అయితే దీనిపై ఇంతవరకు పురోగతి లేకపోవడంతో పోడు రైతుల్లో అసహనం వ్యక్తం అవుతోంది. అయితే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పోడు సమస్యల పరిష్కారం కోసం ఓ కమిటీని వేయడంతో ఇప్పుడైనా తమ సమస్యలు పరిష్కారం అవుతాయా అన్న ఆశలో పోడు రైతులు ఉన్నారు. 

గ్రామాల వారీగా కమిటీలు

రాష్ట్ర వ్యాప్తంగా పోడు రైతుల సమస్యలు ఎక్కువగా ఉండడంతో గత సంవత్సరంలో ప్రభుత్వం గ్రామాల వారీగా కమిటీలను నియమించింది. ఈ కమిటీల ఆధ్వర్యంలో పోడురైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. మండల, డివిజన్‌తోపాటు, జిల్లాస్థాయిలో ఈసమస్యలను పరిష్కరించేం దుకు అధికారుల ఆధ్వర్యంలో కమిటీలను వేసింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు. ప్రభుత్వం పోడు భూములపైన కమిటీలను నియవించి దరఖాస్తులు స్వీకరించినా వాటిని పరిష్కరించేం దుకు గైడ్‌లైన్స్‌ ఇవ్వకపోవడంతో ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దరఖాస్తులు చేసుకున్న రైతుల సమస్యలు పరిష్కరించలేదు. కొన్ని గ్రామాల్లో అటవీ, రెవెన్యూ అధికారులు జాయింట్‌ సర్వేలు నిర్వహించినా అన్నిగ్రామాల్లో చేపట్టలేదు. మొత్తం సర్వే పూర్తై అటవీ, రెవెన్యూ భూములు తేలిన తర్వాతే  పోడు భూములు సాగు చేసుకునే రైతులకు పట్టాలు అందించనున్నారు.          

సమన్వయ కమిటీతో పరిష్కారమయ్యేనా

రాష్ట్ర ప్రభుత్వం పోడు భూముల సమస్యలు పరిష్కరించేందుకు ఇటీవల జిల్లా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి ఉత్తర్వులను జారీచేసింది. ఉత్తర్వుల ప్రకా రం జిల్లా ఇన్‌చార్జీ మంత్రిని చైర్మన్‌గా, జిల్లా కలెక్టర్‌ కన్వీనర్‌గా నియమిం చేందుకు ఉత్తర్వులు విడుదల చేశారు. అలాగే ఈ కమిటీలో పోలీస్‌ కమిషనర్‌, ఇద్దరు అదనపుకలెక్టర్‌లు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి, గిరిజనాభివృద్ధి అధికారి సభ్యులుగా ఉంటారు. వీరితోపాటు ఈ కమిటీకి ప్రత్యేక ఆహ్వానితులుగా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జడ్పీచైర్మన్‌లు ఉంటారు. వీరి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి పోడుభూములపై నిర్ణయం తీసుకోనున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ విధివిధానాలు తయారు చేసి పోడుభూములపై నిబంధనలు విడుదల చేస్తే తప్ప రైతుల సమస్యలు పరిష్కారం అయ్యేలా కనిపించడం లేదు. ఏది ఏమైౖనా పోడు రైతుల సమస్యను రాష్ట్ర ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ కమిటీల ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకొని హక్కులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతు న్నారు.

Updated Date - 2022-09-23T04:24:52+05:30 IST