ధరలు తగ్గడంతో తెల్లబోతున్న పత్తి రైతు

ABN , First Publish Date - 2022-12-07T22:10:16+05:30 IST

ఆసిఫాబాద్‌, డిసెంబరు 7: పత్తి ధరలు తగ్గడంతో రైతులు తెల్లబోతున్నారు. తెల్ల బంగారం పండించిన రైతన్నను కంటనీరు పెట్టిస్తోంది. అతివృష్టి, తెగుళ్లతో దెబ్బతిన్న పంటలను వ్యయప్రయాసలకోర్చి కాపాడుకుంటే చేతికి వచ్చే సమయానికి ధర పతనం కావడంతో బావురుమంటున్నారు.

ధరలు తగ్గడంతో తెల్లబోతున్న పత్తి రైతు

- క్వింటాలుకు రూ.9,250 నుంచి రూ.8,500కు తగ్గిన ధర

- ధర తగ్గడంతో ఇళ్లలోనే పత్తి నిల్వలు

- ధర కోసం రైతన్నల నిరీక్షణ

ఆసిఫాబాద్‌, డిసెంబరు 7: పత్తి ధరలు తగ్గడంతో రైతులు తెల్లబోతున్నారు. తెల్ల బంగారం పండించిన రైతన్నను కంటనీరు పెట్టిస్తోంది. అతివృష్టి, తెగుళ్లతో దెబ్బతిన్న పంటలను వ్యయప్రయాసలకోర్చి కాపాడుకుంటే చేతికి వచ్చే సమయానికి ధర పతనం కావడంతో బావురుమంటున్నారు. ఒకవైపు ప్రతికూల వాతావరణం కారణంగా దిగుబడులు పడిపోయాయి. మరో వైపు మార్కెట్‌లో పత్తి ధర రోజురోజుకు తగ్గిపోతోంది. సీజన్‌ ఆరంభంలో పత్తి ధర నాణ్యతను బట్టి రూ.9వేలకు పైగా ధర పలికింది. దీంతో లాభాలు రాకపోయిన పెట్టుబడి అయిన తిరిగి వస్తుందని రైతులు ఆశించారు. ఐతే రోజురోజుకు ధర పడిపోవడంతో దిగాలు పడుతున్నారు. సీసీఐ మద్దతు ధర తక్కువగా ఉండడంతో బహిరంగ మార్కెట్‌లోనే రైతులు పత్తిని విక్రయిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 3.5లక్షల ఎకరాలలో రైతులు పత్తిపంటను సాగుచేశారు.

ఆరంభంలో ఊరించి..

సీజన్‌ ఆరంభంలో పత్తికి నాణ్యతను బట్టి రూ.9వేల నుంచి రూ.9,500 వరకు ధర పలికింది. దీంతో రైతులు దిగుబడి తగ్గిన ధర బాగానే ఉందను కుంటుండగా వారం రోజులుగా ధర క్రమేపీ తగ్గుతూ వస్తున్నది. దీంతో రైతులు దిగాలు చెందుతున్నారు. బుధవారం ప్రైవేటులో రూ.8300నుంచి 8500 వరకు క్వింటాలుకు ధర పలకడంతో రైతులు పత్తిని విక్రయించేందుకు మొగ్గు చూపడంలేదు. దీంతో రైతులు సేకరించిన పత్తిని ఇళ్లలోనే నిల్వ ఉంచుతున్నారు. గతేడాది క్వింటాలుకు రూ.10వేల మద్దతు ధర లభించగా ఈ ఏడాది కూడా రూ.10వేల నుంచి 12వేల వరకు ధర పలుకుతుందని భావించిన రైతులకు నిరాశే ఎదురవుతోంది. రాబోవు రోజుల్లో పత్తి మద్దతు ధర పెరుగుతుందేమోనన్న ఆశతో ఎదురు చూస్తున్నారు రైతులు.

వ్యాపారులు, దళారులు కుమ్మక్కు..

పత్తి ధర క్రమేపీ తగ్గడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అంతర్జా తీయ మార్కెట్‌లో కాటన్‌ ధరలు, పత్తి గింజలు, పత్తి నూనె ధరలు నిలకడగా ఉన్నప్పటికీ స్థానికంగా రేటు తగ్గడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సీసీఐ మద్దతుధర రూ.6380 ఉండగా బహిరంగ మార్కెట్‌లో ధర ఆధికంగా చెల్లించడంతో రైతులు ప్రైవేటులోనే పత్తిని విక్రయించారు. దీంతో వ్యాపా రులు మధ్యదళారులు ఒక్కటై పత్తి ధరను తగ్గిస్తున్నారని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు ఉన్న ధర రేపు ఉండటంలేదని రైతులు వాపోతున్నారు. పెరిగిన ఖర్చులతో క్వింటాలుకు రూ.12వేలు చెల్లిస్తేనే గిట్టుబాటు అవుతుందని లేదంటే భారీగా నష్టపోక తప్పదని రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

క్వింటాలుకు రూ.12వేలు చెల్లించాలి..

మారుతి, బీసీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు

పత్తి క్వింటాలుకు రూ.12వేలు చెల్లించాలి. అతివృష్టి తెగుళ్లతో పత్తిపంట పూర్తిగా దెబ్బతింది. దీంతో దిగుబడి ఈ ఏడాది చాలా తగ్గింది. ప్రైవేటులో రోజురోజుకు ధర తగ్గడంతో రైతులు పత్తిని విక్రయించకుండా ఇళ్లలోనే నిల్వ చేస్తున్నారు. ధర పెరుగుతుందని చాలామంది రైతులు ఎంతో ఆశతో ఉన్నారు. అధికారులు చొరవచూపి ధర పెరిగేలా చుడాలి.

Updated Date - 2022-12-07T22:11:41+05:30 IST