బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

ABN , First Publish Date - 2022-08-02T05:06:41+05:30 IST

జిల్లాలో మద్యం దుకాణాలపై టాస్క్‌ఫోర్సు కొరడా ఝలిపిస్తోంది. జిల్లాలోని 15మండలాల్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు అమ్మకాలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రభుత్వం విక్రయాలపై నిఘా పెంచింది.

బెల్ట్‌ షాపులపై టాస్క్‌ఫోర్స్‌ కొరడా

-అటు దాడులు.. ఇటు టార్గెట్లు

-మద్యం వ్యాపారుల్లో దడ

-బెల్టు తీస్తే టార్గెట్‌ సేల్స్‌ క్టషమేనంటున్న వ్యాపారులు 

(ఆంధ్యజ్యోతి, ఆసిఫాబాద్‌)

జిల్లాలో మద్యం దుకాణాలపై టాస్క్‌ఫోర్సు కొరడా ఝలిపిస్తోంది. జిల్లాలోని 15మండలాల్లో ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలు అమ్మకాలు గణనీయంగా పడిపోతుండటంతో ప్రభుత్వం విక్రయాలపై నిఘా పెంచింది. ఈ క్రమంలో కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ సర్కిల్‌ పరిధిలో సేల్స్‌ తక్కువగా జరుగుతున్న మద్యం దుకాణాలపై దృష్టిపెట్టి అకస్మాత్తుగా దాడులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా ఆరుమద్యం దుకాణాలపై కేసులు నమోదయ్యాయి. ఇందులో అధికధరలకు మద్యం విక్రయించడం, అక్రమంగా బెల్టు షాపులు నిర్వహించడం, మద్యం కల్తీ చేయడం వంటి ఉదంతాలపై టాస్క్‌ఫోర్సు బృందాలు దాడులు నిర్వహించి పలువురిపై కేసులు నమోదు చేశారు. దాంతో జిల్లా మద్యం వ్యాపారుల్లో దడ మొదలైంది. ఈ ఏడాది మద్యం అమ్మకాలకు సంబంధించి ఎక్సైజ్‌ ఓ వైపు వ్యాపారులకు టార్గెట్‌ విఽధిస్తూనే మరో వైపు బెల్టుషాపులను కట్టడి చేసేందుకు దాడులకు శ్రీకారం చుట్టడంతో మద్యం వ్యాపారులు ఎటూ పాలు పోని పరిస్థితిని ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. గతేడాది జూలైలో ఆసిఫాబాద్‌ ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిఽధిలో 14వేల కేస్‌లు అమ్ముడుపోగా ఈ ఏడాది జూలైలో కాస్త అమ్మకాలు తగ్గినట్టు గుర్తించారు. అయితే జూలై మాసాంతానికి గతేడాది సేల్స్‌ను చేరుకోగలినా కాగజ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో మాత్రం అమ్మకాల్లో భారీతేడా కన్పించడంతో ఎక్సైజ్‌ యంత్రాంగం ఆ డివిజన్‌పై ప్రధానంగా దృష్టిసారించినట్టు కన్పిస్తోంది. ఇక్కడ గతేడాది జూలైలో 17వేల కేస్‌లు విక్రయించగా ఈ ఏడాది జూలై ముగిసే సరికి కేవలం 10,500 కేస్‌లు మాత్రమే విక్రయించారు. సరాసరి 6500మద్యం కేస్‌ల తగ్గడంతో ఇక్కడ మద్యం విక్రయాలు తగ్గేందుకు కారణాలు ఏమిటన్న దానిపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. అయితే అమ్మకాలు పడిపోయేందుకు ప్రధానంగా మహారాష్ట్రలో నిషేధం ఎత్తివేయడం కారణమని స్థానిక ఎక్కైజ్‌ అధికారులు చెబుతుండగా అదే సమయంలో మహారాష్ట్ర నుంచి అక్రమమార్గాల ద్వారా దేశీదార్‌ మద్యం భారీగా జిల్లాలోకి ప్రవహిస్తున్నట్టు గుర్తించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 50కిపై దేశీదారు మద్యం కేసులు నమోదు కావడం ఈ సందర్భంగా అధికారులు ప్రస్తావిస్తున్నారు. అయితే ఈ ఒక్క అంశమే కాకుండా స్థానికంగా కొంతమంది వ్యాపారులు అక్రమార్కులతో కుమ్మక్కై మద్యం కల్తీ దందా పెద్ద ఎత్తున చేపడుతుండటమే అమ్మకాలు పడిపోయేందుకు కారణమని భావిస్తున్నారు. ఇలా మిక్సింగ్‌ చేసిన మద్యాన్ని ఎక్కువగా బెల్టు షాపుల్లో విక్రయిస్తున్నట్టు టాస్క్‌ఫోర్సుకు ఉప్పందడంతో హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బృందాలు మూడో కంటికి తెలియకుంగా జిల్లాలో ఆకస్మిక దాడులకు శ్రీకారం చుట్టినట్టు భావిస్తున్నారు. తాజా గత నెలలో కాగజ్‌నగర్‌లో మూడు మద్యం దుకాణాలపై కేసులు నమోదు చేయగా ఆసిఫాబాద్‌ డివిజన్‌లోని కేవలం రెబ్బెన మండలంలోనే ఒకటి మిక్సింగ్‌ కేసు, ఒకటి అధిక ఎంఆర్‌పీలకు మద్యం విక్రయిస్తుండగా కేసు నమోదు అయింది. ప్రస్తుతం ఈ రెండు దుకాణాలను అధికారులు సీజ్‌ చేశారు. అయితే మద్యం దుకాణాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు టార్గెట్‌ విధిస్తూనే బెల్టు షాపులకు మద్యం విక్రయించకుండా ఆటంకాలు కల్పించటం ఎంటనీ వ్యాపారులు ఎక్సైజ్‌ అధికారులను నిలదీస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ఒక్కొక్క మద్యం షాపు పరిధిలో 30కిపైగా బెల్టు షాపులు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ బెల్టు షాపుల నిర్వాహకులు సంబంధిత మద్యం వ్యాపారులతో సంబంధాలు పెట్టుకొని రూ.20నుంచి రూ.30అధిక ధరలకు కొనుగోలు చేసి గ్రామాల్లో రూ.50కి విక్రయాలు జరుపుతున్నారన్న ఆరోపణలున్నాయి. దీనిపైన టాస్క్‌ ఫోర్సుకు ఫిర్యాదులు అందడంతో మద్యం దుకాణాల కౌంటర్‌ సేల్స్‌పై నిఘా పెంచినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే రెబ్బెన, కాగజ్‌నగర్‌లో కేసులు నమోదయ్యాయి. అంతకుముందు కెరమెరి మద్యం దుకాణం పరిధిలోనూ కేసులు నమోదయ్యాయి. అయితే టాస్క్‌ఫోర్సు ఉన్నట్టుండీ జిల్లాలో మద్యం దుకాణాలపై దాడులు పెంచటం వెనుక ఆంతర్యమేమిటన్న దానిపై మద్యం వ్యాపారులు మల్లగుల్లాలు పడుతున్నారు. బెల్టు దుకాణాల కట్టడికి సంబంధించి సడలింపులివ్వక పోతే ప్రభుత్వం నిర్ధేశించే లక్ష్యాలను పూర్తి చేయడం సాధ్యం కాదని జిల్లా ఎక్సైజ్‌ అధికారులకు తేల్చి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అయితే జిల్లా ఎక్సైజ్‌ అధికారులు వ్యాపారులను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమచారం. 

కల్తీ మద్యమే ప్రధాన సమస్య..

జిల్లాలో కల్తీ మద్యం తయారీ కొంతమందికి కుటీర పరిశ్రమగా మారిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ముఖ్యంగా కాగజ్‌నగర్‌ సర్కిల్‌ పరిధిలో మద్యం దుకాణాలు నిర్వహిస్తున్న ఒకరిద్దరు వ్యాపారులు మూతలు తీసి మద్యాన్ని కల్తీ చేయడంలో సిద్ధహస్తులైన కొంత మంది అక్రమార్కుల సహాయంతో పెద్దఎత్తున మద్యాన్ని కల్తీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో జరిపిన పలు దాడుల్లో ఈ విషయం రూఢీ అయింది కూడా. ఇటీవల సర్‌సిల్క్‌ ఏరియాలో మద్యాన్ని కల్తీ చేస్తున్న ముఠాను పట్టుకొని భారీ పరిమాణంలో కల్తీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే మద్యం దుకాణాల్లోనే కొన్ని చోట్ల ఖరీదైన మద్యం సీసాల్లో సగం లిక్కరును తీసి నీటిని నింపటం ద్వారా అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని కూడా ఇటీవల గుర్తించారు. ఈ తరహాలోనే మద్యం అమ్ముతున్నట్టు ఆరోపణలు విన్పిస్తున్న రెబ్బెన మండలం గంగాపూర్‌ మద్యం దుకాణంపై దాడులు జరిపి విషయాన్ని పసిగట్టడంతో ప్రస్తుతం దాని సీజ్‌ చేశారు. అయితే కల్తీ మద్యాన్ని నిర్థారించేందుకు దాడులు జరిపిన సందర్భాల్లో నమునాలను సేకరించి కల్తీ జరిగిందా లేదా..? అనే విషయాన్ని ల్యాబరేటరీకి పంపి నిర్ధారిస్తారు. ఈ క్రమంలో జరుగుతున్న కాలయాపన కారణంగా ఈ లోపే మద్యం వ్యాపారాలు నకిలీలు లేదా కల్తీ మద్యాన్ని మాయం చేసి పరిస్థితిని చక్కబెట్టుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది జనవరి నుంచి మొత్తం ఆరు కేసులు నమోదు కాగా, 51దేశీదారు అక్రమ డంపింగ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 51మందిపై కేసులు నమోదు చేయగా మొత్తం 796లీటర్ల మహారాష్ట్ర మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. 

కఠినంగా వ్యవహరిస్తాం..

-విలాస్‌, ఎక్సైజ్‌ సీఐ కాగజ్‌నగర్‌ 

అక్రమ మద్యం, ఎంఆర్‌పీ కంటే ఎక్కువ రుసుము వసూలు చేయడం అక్రమ బెల్టు షాపుల నిర్వహణ వంటి విషయాలను సీరియస్‌గా పరిగణిస్తాం. మద్యం వ్యాపారులు నిబంధనలు అనుగుణంగా మద్యం విక్రయాలు జరపాలి. మద్యాన్ని కల్తీ చేసినట్టు తేలినా, మిక్సింగ్‌ చేస్తున్నట్టు రుజువైనా వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. అలాగే మహారాష్ట్ర నుంచి దేశీదారు మద్యం తీసుకవచ్చి విక్రయించినా, అక్రమంగా కలిగి ఉన్నా వారిపైన కూడా కేసులు నమోదు చేస్తాం. 

Read more