‘రియల్‌’ ఆగడాలు

ABN , First Publish Date - 2022-11-16T22:48:59+05:30 IST

యల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన ఏరియాల్లో విచ్ఛల విడిగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలను తోసిరాజని న యా పైసా ఖర్చులేకుండా కోట్లకు పడగలెత్తుతున్నారు.

‘రియల్‌’ ఆగడాలు
పాత గర్మిళ్లలో అక్రమంగా ఏర్పాటు చేసిన వెంచర్‌

- క్వారీ రోడ్డులో రాత్రికి రాత్రే నాలా కబ్జా

- చోద్యం చూస్తున్న మున్సిపల్‌ అధికారులు

- ప్రభుత్వ ఖజానాకు భారీ గండి

మంచిర్యాల, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన ఏరియాల్లో విచ్ఛల విడిగా అక్రమ వెంచర్లు ఏర్పాటు చేస్తూ ప్రజలకు అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలను తోసిరాజని న యా పైసా ఖర్చులేకుండా కోట్లకు పడగలెత్తుతున్నారు. మున్సిపాలిటీ పరిధిలో పదుల సంఖ్యలో అక్రమ వెంచర్లు వెలుస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. మరోవైపు పురాతన నాలాను సైతం ఆక్రమిస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వాటి లో కూడా వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. అఽధికారులకు ముడుపులు ముట్టజెప్పుతున్న రియల్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ప్లాట్లు ఏర్పాటు చేస్తుండ డంతో వాటిని కొనుగోలు చేసే ప్రజలు నిలువునా మోసపోతు న్నారు. దీంతో పాటు ప్రభుత్వ ఖజానాకు సైతం భారీగా గండి పడుతోం ది. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం అక్రమ వెంచర్లు ఏర్పాటు చేయవద్దని, సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తున్నది. ఇక్కడ మాత్రం అఽధికారులు అక్రమార్కులకు వంతపాడుతున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

- రాత్రికి రాత్రే వెలుస్తున్న వెంచర్లు..

జిల్లా కేంధ్రంలోని గర్మిళ్ల శివారు పాత గర్మిళ్లలో రాత్రికి రాత్రే వెంచరు ఏర్పాటు చేయడం గమనార్హం. పాత గర్మిళ్లలోని 6వ వార్డు పోచమ్మ ఆలయం సమీపంలో సుమారు రెండెకరాల్లో అక్రమ వెంచరు ఏర్పాటు చేసి, హద్దురాళ్లు కూడా పాతారు. అక్రమ వెంచరు ఏర్పాటు చేయడంలో అధికార పార్టీకి చెందిన ఓ కౌన్సిలర్‌ భర్త హస్తముందనే ప్రచారం జోరుగా సాగుతోంది. కౌన్సిలర్‌ భర్త మరో ఇద్దరు నాయకులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా వెంచర్‌ ఏర్పాటు చేసి ప్లాట్లు కూడా విక్రయిం చినట్లు తెలుస్తోంది. వారం పది రోజులుగా స్థలాన్ని చదును చేస్తూ, హ ద్దులు రాళ్లు వేస్తున్నా...ఈ అక్రమ బాగోతం అధికారుల దృష్టికి రాకపో వడం శోచనీయం. పాత గర్మిళ్లలో అక్రమంగా వెంచర్‌ ఏర్పాటు చేసిన రియల్టర్లు చదరపు గజం ఒక్కంటికి 15వేల రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. వెంచర్‌లో 25 ప్లాట్లు ఏర్పాటు చేయగా అందులో ఇప్పటికే సింహభాగం విక్రయించారు. అనధికార వెంచర్లలో స్థలాలు కొనుగోలు చేస్తే భవిష్యత్తులో ఎదరయ్యే సమస్యలపట్ల అవగాహన లేని అమాయక జనానికి ప్లాట్లు అంటగడుతున్నారు.

నాలా కబ్జా..

మున్సిపాలిటీ పరిధిలోని ఏసీసీ క్వారీ రోడ్డులో గల నాలాను రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు కబ్జా చేశారు. నాలాను ఆనుకొని వెంచరు ఏర్పాటు చేస్తున్న వ్యాపారులు అందులో మట్టిపోసి చదును చేశారు. కబ్జాకు గురైన నాలా వర్షాకాలంలో వరదనీటితో ఉధృతంగా ప్రవహిస్తుంది. నాలా ఉప్పొంగి ప్రవహిస్తుంటే భారీ వాహనాలు కూడా ఆ రోడ్డులో రాకపోకలు సాగించలేని పరిస్థితి ఉంటుంది. నీటి ప్రవాహం తగ్గేంత వరకు వేచి చూడాల్సిందే. సదరు నాలాలో కొట్టుకుపోయి గతంలో అప్పటి ఏసీసీ కంపెనీ అధికారి ఒక్కరు గల్లంతయ్యారు. అంతపెద్ద నాలా ప్రస్తుతం క బ్జాలతో చిన్న ఒర్రెలా దర్శనమిస్తోంది. ధనార్జనే ధ్యేయంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న కొందరి వల్ల నాలా గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది. ఎక్కడికక్కడే నాలాను పూడ్చివేసి ప్లాట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల స్థానికంగా వెలిసిన ఓ వెంచర్‌ (అనుమతులు లేవు) మట్టిని రాత్రికి రాత్రే నాలాలో పోసి పూడ్చివేశారు. ప్రస్తుతం నాలాను పూడ్చివేసిన ప్రదేశంలో చదరపు గజం ఒక్కంటికి రూ. 30వేల పై చిలుకు ధర పలుకుతోంది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే క్వారీ రోడ్డును ఆనుకొని ఉన్న నాలా కబ్జాకు గురవుతున్నా అధికారుల దృష్టికి రాకపోవడం గమనార్హం.

నిబంధనలు గాలికి...

మున్సిపాలిటీలు, పంచాయతీల పరిధిలో వెంచర్లు ఏర్పాటు చేయాలం టే ప్రభుత్వ నిబంధనలు పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. పట్టా భూముల్లో వెంచర్లు ఏర్పాటు చేసే ముందు విధిగా సంబంధింత అధికారులకు నిబంధనల మేరకు లే అవుట్‌ అనుమతుల కోసం ప్రభుత్వా నికి నిర్ణీత రుసుం చెల్లించి, దరఖాస్తు చేసుకోవాలి. వెంచరు ఏర్పాటు చేయబోయే స్థలం విస్తీర్ణంలో 10 శాతం స్థానిక సంస్థల పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించాలి. అందులో సొంత ఖర్చులతో ప్రజల సౌకర్యార్థం పార్కు, ఇతర ఏర్పాట్లు చేపట్టాలి. పార్కులో వివిధ రకాల మొక్కలు నాటి వాటిని సంరక్షించాలి. పరిపూర్ణమైన అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, కనీసం 30 ఫీట్ల వెడల్పుగల అంతర్గత రోడ్లు ఏర్పాటు చేయాలి. తాగునీటి వసతుల కోసం ఓవర్‌హెడ్‌ వాటర్‌ ట్యాంకుల నిర్మాణం, విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి. స్థలంలో గుడి, బడి కోసం నిర్ణయించిన మేర స్థలం వదలి పెట్టాలి. అప్పుడే లే అవుట్‌ అనుమతులు మంజూరు అవుతాయి. అప్పు డు ఆ వెంచర్‌లో నిర్మితం అయ్యే ఇళ్లకు అనుమతులు, బ్యాంకు రుణా లు పొందేందుకు ఇబ్బందులు ఉండవు. కాగా అక్రమార్కులు అందుకు భిన్నంగా నిబంధనలను గాలికి వదిలి వెంచర్లు ఏర్పాటు చేయడం గమనార్హం. అధికారుల మెతక వైఖరి కారణంగా మున్సిపల్‌శాఖ ఫీజుల రూపేణా భారీగా ఆదాయాన్ని కోల్పోతున్నది. స్థలాలు కొనుగోలు చేసిన ప్రజలు నిలువునా మోసపోతున్నారు.

చర్యలు తీసుకుంటాం..

సత్యనారాయణ, టౌన్‌ ప్లానింగ్‌ అధికారి సత్యనారాయణ

అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే వెంచర్లపై కఠిన చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ పరిధిలో ఒకటి, రెండు అనధికార వెంచర్లు ఏర్పాటు చేసిన విషయం దృష్టికి వచ్చింది. మున్సిపల్‌ కమిషనర్‌ ఆదేశాల మేరకు సదరు వెంచర్లో ప్లాట్లు కొనుగోలు చేసేవారి పేరిట ఎలాంటి రిజిస్ట్రేషన్లు చేయవద్దని సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నోటీసులు అంద జేశాం. అనధికార వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఇంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వం. వెంచర్లు ఏర్పాటు చేసే వారు తప్పని సరిగా అను మతులు తీసుకోవాలి.

Updated Date - 2022-11-16T22:48:59+05:30 IST

Read more