సింగరేణిలో ఇష్టారాజ్యం

ABN , First Publish Date - 2022-09-27T03:40:32+05:30 IST

సింగరేణి సంస్థలో అధికా రుల ఇష్టారాజ్యంగా నడుస్తోంది. అనునాయిలకు కొమ్ముకాస్తూ అక్రమ పద్ధతుల్లో మస్టర్లు ఇస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. గిట్టని కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ సొంత పనులు చేసి పెట్టే వారిని అందలమెక్కిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీరాంపూర్‌ డివిజన్‌లో అక్రమ పద్ధతుల్లో మస్టర్లు వేయించుకున్న ఐదుగురు కార్మికులను అధికారులు బదిలీ చేయగా అందుకు సహకరించిన వారిపై చర్యలు తీసు కోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.

సింగరేణిలో ఇష్టారాజ్యం

విధుల్లో ఉండని వారికీ మస్టర్లు  

విజిలెన్స్‌ విచారణలో వెలుగులోకి 

ఐదుగురు కార్మికులపై బదిలీ వేటు  

సహకరించిన వారిపై చర్యలు శూన్యం  

మంచిర్యాల, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): సింగరేణి సంస్థలో అధికా రుల ఇష్టారాజ్యంగా నడుస్తోంది. అనునాయిలకు కొమ్ముకాస్తూ అక్రమ పద్ధతుల్లో మస్టర్లు ఇస్తున్నా అడిగే నాథుడు కరువయ్యారు. గిట్టని కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తూ సొంత పనులు చేసి పెట్టే వారిని అందలమెక్కిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీరాంపూర్‌ డివిజన్‌లో అక్రమ పద్ధతుల్లో మస్టర్లు వేయించుకున్న ఐదుగురు కార్మికులను అధికారులు బదిలీ చేయగా అందుకు సహకరించిన వారిపై చర్యలు తీసు కోకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. విజిలెన్స్‌ అధికారుల తనిఖీల్లో అక్రమ బాగోతం బయట పడగా దానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగా కార్మికులపై బదిలీ వేటు వేసినట్లు ప్రచారం జరుగుతోంది. అక్రమాలపై విచారణ చేపట్టిన విజిలెన్స్‌ అధికారులు అందుకు ప్రధాన కారకులైన వారిపైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌లు సర్వత్రా వినిపిస్తున్నాయి. 

విధుల్లో లేకపోయినా మస్టర్లు

విధులకు హాజరై డ్యూటీ మధ్యలో వెళ్లిపోయే కొందరు కార్మికులకు అధికారులు వత్తాసు పలుకుతున్నారనే ఆరోపణలున్నాయి. డ్యూటీ సమ యపాలనతో సంబంధం లేకుండా  ఇష్టం వచ్చినట్లు గనులపైకి వస్తున్నా అడిగే వారు లేకపోవడంతో కొందరు పలుకుబడి ఉన్న కార్మికులు క్లరికల్‌ సిబ్బందిని లెక్క చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంఘాల అండతో ఎలాగోలా  సిబ్బందిని మచ్చిక చేసుకుంటూ అక్రమంగా మస్టర్లు పొందుతున్న విషయం ఇటీవల వెలుగుచూసింది. కొందరు అవినీతి అధికారులు కార్మికులతో  తమ సొంత పనులు చేయించుకుంటూ అసలు విధులు నిర్వహించకపోయినా ఉచితంగా మస్టర్లు, ఓటీలు ఇస్తున్నారనే ఆరోపణలున్నాయి. శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్టుకు సంబంధించి ఇటీవల ఐదుగురు కార్మికులపై అధికారులు బదిలీ వేటు వేశారు. వీరికి పూర్తి స్థాయిలో హాజరు శాతం ఉండడంతో అనుమానం వచ్చిన విజిలెన్స్‌ విభా గం అధికారులు విచారణ చేపట్టారు. కార్మికులు విధుల్లో లేకపోయినా అధికారులకు సొంత పనులు చేస్తున్నారని తేలడంతో చర్యలకు ఆదే శించారు. దీంతో ఒకరిని ఆర్జీ-3 ఆడ్రియాల, మరొకరిని భూపాలపల్లి, ముగ్గురిని మణుగూరు, సత్తుపల్లి ఏరియాలకు బదిలీ చేస్తూ యాజమా న్యం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. 

వాడుకొని వదిలేశారు...?

అక్రమ మస్టర్ల వ్యవహారంలో కార్మికులను కొందరు అధికారులు తమ అవసరాలకు వాడుకొని తీరా సమయానికి వదిలేసి చేతులు దులుపుకు న్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఐదుగురు కార్మికులు శ్రీరాంపూర్‌ ఓపెన్‌కాస్టు ఏర్పాటు సమయంలో సంస్థకు అనుగుణంగా  ప్రోత్సాహం అందించినట్లు ప్రచారం జరుగుతోంది. ఓసీ ఏర్పాటును ఆయా గ్రామాల ప్రజలు వ్యతిరేకించిన సమయంలో బదిలీ వేటుకు గురైన కార్మికులే ఒప్పించినట్లు సమాచారం. వీరి అండతోనే అధికారులు గ్రామాల ప్రజలను తమ దారికి తెచ్చుకోవడంతో మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది. వీరికి సంఘాల అండ ఉండడంతో పూర్తిస్థాయిలో యాజమాన్యానికి సహకరించడం ద్వారా ఓసీ ఏర్పాటుకు ఎనలేని సేవలు అందించినట్లు తెలుస్తోంది. ఓసీ ఏర్పాటయ్యేంత వరకు తమ సేవలను వాడుకున్న అధికారులు విజిలెన్స్‌ విచారణలో తమకు సహకరించక పోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల మద్దతు ఉందనే ఉద్దేశంతో ఎప్పుడు పడితే అప్పుడు  రాత్రి పగలు తేడా లేకుండా ఓసీ ఏర్పాటుకు కృషి చేశామని, గనిలో సైతం  సమయ పాలన లేకుం డా సేవలందించినట్లు వాపోతున్నారు. తమను అన్ని విధాలా వాడుకొని ఇప్పుడు వదిలేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికులపై బదిలీ వేటు వేసిన అధికారులు ఒక్క రోజు ముందు చార్జిషీట్‌ ఇచ్చి వారి వాదన వినాల్సి ఉండగా నిబంధనలను పట్టించుకోలేదనే ఆరోపణలు న్నాయి. చార్జిషీట్‌ ఇచ్చిన మరుసటిరోజే బదిలీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

అసలు కారకులపై చర్యలేవి...?

కార్మికులు విధులకు హాజరైనప్పటి నుంచి తిరిగి వెళ్లేంత వరకు పరి శీలించాల్సిన అధికారులు విఽధుల్లో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలు వెల్లువె త్తుతున్నాయి. ఇన్‌, ఔట్‌ మస్టర్‌ పడేంత వరకు కార్మికుడు విధుల్లో ఉన్నట్లే లెక్క. అయినప్పటికి కార్మికులు డ్యూటీ మధ్యలో బయటకు ఎలా వెళ్లారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. డ్యూటీ సమయంలో బయటకు  వెళ్లి వచ్చినా అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది ఎందుకు పట్టించుకోలేదో వారికే తెలియాలి. విజిలెన్స్‌ విషయంలో కార్మికులను తప్పుపట్టిన అధికారులు వారిపై బదిలీ వేటు వేశారు. అయితే వారికి సహకరించిన అధికారులు, క్లరికల్‌ సిబ్బందిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సింగరేణిలో  కార్మికులకు  ఒక న్యాయం, అధికారులకు మరొక న్యాయమా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. క్లరికల్‌ సిబ్బంది, పై అధికారుల సహకారం లేనిదే కార్మికులు విఽధుల్లో నుంచి మధ్యలో బయటకు వెళ్ళడం అసాధ్యమని, ఈ విషయంలో విజిలెన్స్‌ విభాగం వారి పాత్రపైనా పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌లు వ్యక్తమవుతున్నాయి. సింగరేణిలో కార్మికులతో అధికారులు సొంత పనులు చేయించుకోవడం పరిపాటేనని చెబుతుండడం  కొసమెరుపు. ఈ విధానానికి స్వస్తి పలికి కార్మికులను పూర్తి స్థాయిలో సంస్థ అభివృద్ధికి ఉపయోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  

Updated Date - 2022-09-27T03:40:32+05:30 IST