‘శాలివాహన’పై నీలినీడలు
ABN , First Publish Date - 2022-12-02T22:07:55+05:30 IST
జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన విద్యుత్ ప్లాంటుపై నీలినీడలు కమ్ముకు న్నాయి. 20 సంవత్సరాలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వెలుగులు నింపిన కంపెనీ భవిష్యత్తు చీకటిమయం కానుంది. ప్లాంటులో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి టీఎస్ ట్రాన్స్‌కోతో ఉన్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) ఈనెల 6తో ముగియనుంది.
మంచిర్యాల, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పాత మంచిర్యాలలో గల శాలివాహన విద్యుత్ ప్లాంటుపై నీలినీడలు కమ్ముకు న్నాయి. 20 సంవత్సరాలుగా విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వెలుగులు నింపిన కంపెనీ భవిష్యత్తు చీకటిమయం కానుంది. ప్లాంటులో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి టీఎస్ ట్రాన్స్‌కోతో ఉన్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ (పీపీఏ) ఈనెల 6తో ముగియనుంది. ప్రభుత్వం ఇప్పటి వరకు పీపీఏను పునరుద్దరించలేదు. దీంతో ప్లాంటుపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడ్డ దాదాపు 320 మంది కార్మికులతోపాటు వందలాది కార్మికేతర కుటుంబాల భవిష్యత్తుపై అమోయం నెలకొంది.
20 ఏండ్లుగా విద్యుత్ ఉత్పత్తి
శాలివాహన గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ పేరుతో ఆరు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో బయో మాస్ పవర్ ప్లాంటును 2001లో యాజమాన్యం ప్రారంభించింది. ప్లాంటులో 2002 డిసెంబర్ 7న వ్యవసాయ వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. ఉనుక, పత్తి కర్ర, కొబ్బరి బొండాలు, రంపపు పొట్టు, చెరుకు పిప్పితోపాటు కాలం చెల్లిన ధాన్యాలు ముడి వనరులుగా గంటకు 6 మెగావాట్ల (గంటలో 6వేల యూనిట్లు) చొప్పున ఉత్పత్తి కాగా, రోజూ తయారైన 1లక్ష 44వేల పైచిలుకు యూనిట్లను యాజమాన్యం ప్రారంభంలో ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసేది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి యూనిట్‌కు రూ.5.30 చొప్పున యాజమాన్యం పీపీఏ (పవర్ పర్చేస్ అగ్రిమెంటు)తో 2022 డిసెంబర్ 6వ తేదీ వరకు టీఎస్ ట్రాన్స్‌కోకు విక్రయించేలా యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. 20 సంవత్సరాలపాటు నిరంత రాయంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేయగా పీపీఏ అగ్రిమెంటును పొడిగించ కపోవడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
బిల్లుల జాప్యంతో ఇబ్బందులు
శాలివాహన ప్లాంటులో ఉత్పత్తి అయిన విద్యుత్‌ను టీఎస్ ట్రాన్స్‌కో కొనుగోలు చేస్తోంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించవలసిన ప్రభుత్వం జాప్యం చేస్తుండటంతో కంపెనీ మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో యాజమాన్యం 2019 నవంబర్ 7న ఉత్పత్తిని నిలిపివేసింది. అప్పటికే సంవత్సర కాలంగా టీఎస్ ట్రాన్స్‌కో నుంచి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతుందని, కొద్ది నెలలపాటు కార్మికుల వేతనాలు తాము సర్దుబాటు చేసినప్పటికీ, ఇక మీదట భరించే స్థితిలో లేనందున ప్లాంటును లాకౌట్ చేస్తున్నట్లు యాజమాన్యం కార్మికు లకు నోటీసులు పంపింది. మూడు నెలలుగా రైస్ మిల్లులు నడవకపోవ డంతో ముడి ఇంధనాల్లో ప్రధానమైన ఊక కొరత ఏర్పడింది. రోజుకు 200 టన్నుల నుంచి ఇంధనం అవసరం కాగా 70 శాతం ఊకను వాడు తున్నారు. ఊక లేకపోవడంతో మూడు నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది. అలాగే ప్రభుత్వం నుంచి నెల నెల బిల్లులు రాకపోవడంతో ఉద్యోగులు, కార్మికులకు జీతాలు ఇవ్వలేని పరిస్దితి నెలకొంది. బిల్లులు రూ. 3 కోట్లతోపాటు ఇంటెన్సివ్ మరో రూ.8 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నాయని యాజమాన్యం తెలిపింది. నిరంతరాయంగా టీఎస్ ట్రాన్స్‌కోకు విద్యుత్‌ను సరఫరా చేస్తున్నప్పటికీ ప్రభుత్వం బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తుం డటంతో యాజమాన్యం చేతులెత్తేసింది. దీంతో 13 రోజులపాటు కార్మికు లకు డ్యూటీలు లేని కారణంగా ప్లాంటు ఆవరణలో ఆందోళనకు దిగారు.
రోడ్డున పడనున్న కార్మికులు
విద్యుత్ ప్లాంట్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 300 పై చిలుకు కుటుంబాలు ఆధారపడి బతుకుతున్నాయి. ఇందులో రెగ్యులర్ ఉద్యో గులు, వర్కర్లు సుమారు 120 మంది ఉన్నారు. ట్రాక్టర్లు, లారీలు, ఇతర పనులు చేసే వారు మరో 200 మంది ఉన్నారు. వీరంతా 20 ఏండ్లుగా చాలీచాలని జీతాలతో నెట్టుకొస్తున్నారు. రెగ్యులర్‌గా జీతాలు ఇవ్వకున్నా ప్లాంటును నమ్ముకొని బతుకుతున్నారు. పీపీఏ అనుమతులు లభించక ప్లాంటును మూసివేసే పరిస్థితి రావడంతో రోడ్డున పడతామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది రిటైర్డ్‌మెంట్‌కు దగ్గరలో ఉండడంతో ఈ వయసులో ఎట్లా బతకాలని వాపోతున్నారు.
ప్రజాప్రతినిధులు చొరవ చూపాలి
చెట్టి శ్రీనివాస్, ప్లాంటు యూనియన్ నాయకుడు
20 సంవత్సరాలుగా ప్లాంటునే నమ్ముకొని జీవనం సాగిస్తున్నాం. వందలాది మంది కార్మికులకు జీవనోపాధి లభిస్తోంది. కంపెనీ మూత పడితే దానిపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వస్తుంది. సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళాం. ప్రభుత్వం పీపీఏ అగ్రిమెంట్‌ను పదేళ్లపాటు పొడిగించే వరకు దశలవారీగా ఆందోళనలు చేపడుతాం. ప్రజా ప్రతినిధులు కంపెనీని కాపాడేందుకు చొరవ తీసుకోవాలి.