మద్యాన్ని సీజ్ చేసి.. ఆ పై గుట్టుగా తీసుకెళ్లి..!
ABN , First Publish Date - 2022-05-19T07:05:48+05:30 IST
మద్యాన్ని సీజ్ చేసి.. ఆ పై గుట్టుగా తీసుకెళ్లి..!

ఆంధ్రజ్యోతి, నిర్మల్/ పెంబి, మే 18 : నకిలీ మద్యాన్ని అమ్ముతున్నారంటూ ఆ వైన్ షాప్‌ను ఎక్సైజ్ శాఖాధికారులు సీజ్ చేశారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా అదే వైన్ షాపు సీజ్‌ను తెరిచి.. రాత్రి వేళ రహస్యంగా మందును తరలించేందుకు యత్నించారు. గ్రామస్తులు తిరగబడడంతో.. మెల్లగా అక్కడి నుంచి ఎక్సైజ్ సిబ్బంది జారుకున్న ఘటన బుధవారం రాత్రి జిల్లాలోని పెంబిలో చోటు చేసుకుంది. స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసిన ఘటన వివరాల్లోకి వెళితే.. పెంబి మండల కేంద్రంలోని ఎంఎస్ఆర్ వైన్స్‌లో నకిలీ మద్యం విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ శాఖాధికారులు గత సోమవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మద్యంషాప్ నిర్వాహకులపై కేసు నమోదు చేసి.. దుకాణాన్ని బుధవారం సీజ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. రాత్రి వేళ రహస్యంగా ఎక్సైజ్ ఎస్సై కిశోర్ మళ్లీ ఎంఎస్ఆర్ వైన్స్ వద్దకు వచ్చాడు. వేసిన సీజ్‌ను చట్టవిరుద్ధంగా ఓపెన్ చేసి.. 9 కాటన్ల మద్యాన్ని గుట్టు చప్పుడు కాకుండా తమ వాహనంలో తరలించేందుకు యత్నించాడు. అదే సమయంలో అక్కడే ఉన్న గ్రామస్తులు, యువకులు ఎక్సైజ్ ఎస్సై కిశోర్‌తో పాటు సిబ్బందిని అడ్డుకున్నారు. సీజ్ చేసిన వైన్స్ నుంచి మద్యాన్ని ఎలా తరలిస్తారని నిలదీశారు. ఎక్సైజ్ సీఐ ఆదేశాల మేరకు తాము వైన్‌షాప్‌ను ఓపెన్ చేసినట్టు వివరణ ఇచ్చారు. అయినప్పటికీ గ్రామస్తులు ఎంత మాత్రం వినలేదు. రాత్రి వేళ రహస్యంగా మద్యాన్ని ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పాలని పట్టుబట్టారు. ఎస్సై కిశోర్ ఎలాంటి సమాధానం చెప్పకపోవడంతో.. రహదారిపైనే బైఠాయించారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తడంతో.. ఎక్సైజ్ ఎస్సై కిశోర్‌తో పాటు సిబ్బంది మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి.. ఆ మద్యాన్ని పెంబి పోలీసు స్టేషన్లో భద్రపరిచారు.