సంతలు..చింతలు..
ABN , First Publish Date - 2022-05-16T04:25:40+05:30 IST
పట్టణంలో రోజూవారీ, వారాంతపు సంతలను రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు 60యేళ్లు దాటినా ఇప్పటివరకు సరైన మార్కెట్ సౌకర్యం లేదు. ఇటీవల మంజూరైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు స్థల సేకరణలో జాప్యం వలన నిర్మాణానికి నోచుకోవడం లేదు.

- రోడ్లపైనే వారాంతపు, రోజూవారీ సంతలు
- నిర్మాణంకాని ఇంటిగ్రేటెడ్ మార్కెట్
- రాకపోకలకు అంతరాయం
- స్థల సేకరణలో జాప్యం
కాగజ్‌నగర్ టౌన్, మే 15: పట్టణంలో రోజూవారీ, వారాంతపు సంతలను రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ ఏర్పడి దాదాపు 60యేళ్లు దాటినా ఇప్పటివరకు సరైన మార్కెట్ సౌకర్యం లేదు. ఇటీవల మంజూరైన ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌కు స్థల సేకరణలో జాప్యం వలన నిర్మాణానికి నోచుకోవడం లేదు. మార్కెట్ నిర్మాణానికి, ప్రస్తుతం ఉన్న మార్కెట్‌ను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అయినా సమస్య తీరే దారి కనిపించడం లేదు.
రాకపోకలకు అంతరాయం...
పట్టణంలోని మెయిన్ మార్కెట్‌తో పాటు సర్‌సిల్క్, ఎస్‌బీఐ సమీపంలో రోడ్డుపైనే కూరగాయల విక్రయాలు జరుపుతుండడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా ప్రధాన ఆస్పత్రి ఉండడంతో అంబులెన్స్ వెళ్లలేని పరిస్థితి ఉంది. సంతల ద్వారా ఆదాయం సమకూరుతున్నప్పటికీ కనీస సౌకర్యాలు కల్పించడంలేదు. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించేందుకు అంగళ్లకు వస్తుంటారు. అయితే ఇక్కడ వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేసేందుకు కనీస ఏర్పాట్లు ఉండడం లేదు. దీంతో మట్టిలోనే సంచులు వేసుకొని రోడ్లుపైనే కుప్పలు పోసి విక్రయాలు జరుపుతున్నారు. సంత ముగిసిన తర్వాత చెత్త వేసేందుకు స్థలం, సౌకర్యం లేకపోవడం వలన రోడ్ల పక్కనే పారబోస్తున్నారు. దీంతో వేస్టేజ్ కుళ్లిపోయి దుర్గంధం వ్యాపిస్తోంది. లక్షల్లో ఆదాయం వచ్చే మార్కెట్‌ల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది.
నిధులున్నా లేని ఫలితం
కాగజ్‌నగర్‌లో నూతనంగా రెండు మార్కెట్ల కోసం రూ.7కోట్లు మంజూరు అయ్యాయి. అయితే స్థల సేకరణ జరగాల్సి ఉంది. గతంలో 3 చోట్ల స్థలాన్ని అధికారులు పరిశీలించారు. పలు కారణాలతో అవి నిలిచిపోయాయి. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం కోసం ఈఎస్‌ఐ ఆస్పత్రి స్థలంలో నిర్మించేందుకు అనుమతి రాలేదు. అలాగే ఆర్టీసీ స్థలం వివాదంలో ఉంది. మరో చోట 10 వార్డులో భూమి పూజ చేసినా కూడా అనుకూలంగా లేదని వాయిదా వేశారు. వెజ్, నాన్‌వెజ్ మార్కెట్ వేర్వేరుగా ఉండేందుకు సువిశాలమైన సుమారు రెండెకరాల స్థలం కావాల్సి ఉంది. ఈ విషయంలో తర్జనభర్జన పడుతున్నారు. స్థలం లేకపోవడంతో వాయిదా వేస్తున్నారు. పట్టణంలో మూడు చోట్ల తాత్కాలికంగా మార్కెట్‌లను ఏర్పాటు చేశారు. కాగజ్‌నగర్‌లోని 30వార్డులకు అనుకూలంగా ఉండేవిధంగా స్థలం చూసేందుకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. ప్రజలకు సౌకర్యంగా ఉండేవిధంగా, పెరుగుతున్న జనాభాకు అనుకూలంగా క్రయ, విక్రయాలతో పాటు ఇతరత్ర గోదాంలు కూడా ఉండేవిధంగా మార్కెట్ రూపొందించాలన్న ఉద్దేశ్యంతోనే ప్రయత్నాలే సఫలం కావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం రూ.7.20 లక్షలు మంజూరు చేయగా పబ్లిక్‌హెల్త్ ఆధ్వర్యంలో టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ మార్కెట్ నిర్మాణం త్వరితగతిన చేపట్టాలని పట్టణవాసులు కోరుతున్నారు.
ఎండకు ఎండుతున్నారు...వానకు తడుస్తున్నారు...
-విజయ్‌సింగ్, కాగజ్‌నగర్
వ్యాపారులు ఇక్కడ ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ విక్రయాలు జరపాల్సిన పరిస్థితి. అధికారుల నిర్లక్ష్యంతో పారిశుధ్య లోపం ఏర్పడుతోంది. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలోనూ ఇది షరామమూలే. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలి.
అధికారుల దృష్టికి తీసుకెళుతున్నాం
-సీవీఎన్ రాజు, మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం విషయంలో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళుతున్నాం. ఆర్టీసీ స్థలం వివాదం తీరిపోయింది. అక్కడ ఉన్న 4 ఎకరాల స్థలం కోసం కలెక్టర్, ఆర్టీసీ ఎండీకి విన్నవించాం. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల కోసం వేచిచూస్తున్నాం. టెండర్ పూర్తయినా స్థల సమస్యతో మార్కెట్ నిర్మాణం జరగడం లేదు. అన్ని సదుపాయాలతో కూడిన మార్కెట్ నిర్మాణాన్ని త్వరలోనే చేపడుతాం.