సంబరాల సంక్రాంతి
ABN , First Publish Date - 2022-01-14T04:16:17+05:30 IST
పల్లెలు, పట్టణాలు సంక్రాంతి శోభను సంచరించుకున్నాయి. ఇండ్ల ముందు గొబ్బమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలతో పండుగ సందడి మొదలైంది. పిల్లల ఆటాపాటలు, బంధువుల రాకపోకలతో గ్రామాలు సందడిగా మారాయి. పట్టణాల్లో ఉండే వారంతా కుటుంబ సభ్యులతో స్వంత ఊరికి వచ్చారు. హరిదాసుల కీర్తనలు, బసవన్నల ఆటాపాటల కోలాహలం, ఇంటిల్లిపాది ఆనందోత్సవాలతో సందడి చేసే సంక్రాంతి పండుగ వచ్చేసింది
నేడు భోగి, రేపు సంక్రాంతి
16న కనుమ
మూడు రోజుల పాటు పండుగ సందడి
నస్పూర్/దండేపల్లి, జనవరి 13 : పల్లెలు, పట్టణాలు సంక్రాంతి శోభను సంచరించుకున్నాయి. ఇండ్ల ముందు గొబ్బమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు, పిండి వంటలతో పండుగ సందడి మొదలైంది. పిల్లల ఆటాపాటలు, బంధువుల రాకపోకలతో గ్రామాలు సందడిగా మారాయి. పట్టణాల్లో ఉండే వారంతా కుటుంబ సభ్యులతో స్వంత ఊరికి వచ్చారు. హరిదాసుల కీర్తనలు, బసవన్నల ఆటాపాటల కోలాహలం, ఇంటిల్లిపాది ఆనందోత్సవాలతో సందడి చేసే సంక్రాంతి పండుగ వచ్చేసింది. శుక్రవారం భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు జరుపుకునేందుకు ప్రజలు సన్నద్ధమయ్యారు. ప్రకృతి శక్తులను పూజించే చర్యల్లో భాగంగా ఆచరించే పండుగల్లో మకర సంకాంత్రికి ప్రథమ స్థానంలో ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఆరుగాలం శ్రమించిన రైతన్న ధాన్యం ఇంటికి తరలించే కాలం, ఇంటి నిండా ధాన్యరాశులతో తులతూగే సమయంలో అన్నదాత ఆనందం పిల్లాపాపలతో, కుటుంబసభ్యులు బంధుగణం కలిసి ఉత్సాహంతో జరుపుకునే పండుగ సంక్రాంతి.
సంస్కృతికి చిహ్నం
సంక్రాంతి వస్తుందంటే వివిధ రకాల ముగ్గులు ఇళ్ళ వాకిళ్ళకు సరికొత్త అందాన్ని తెచ్చి పెడుతాయి. ఇంటి ముందు ముగ్గులు వేయడానికి మహిళలు పోటీ పడుతారు. ఇంటి ముందర కళ్లాపి చల్లి ముగ్గు వేసి రంగులను నింపి ఆవు పేడతో తయారు చేసిన గొబ్బిమ్మలను, రేగుపండ్లను, ధాన్యాన్ని పెడతారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనల సందడితో పండగ కళ తెచ్చి పెడుతోంది. రంగవల్లులు, గొబ్బిళ్ళతో అలంకరణలతో పల్లె, పట్టణ వాకిళ్ళు చూడముచ్చటగా కనిపిస్తాయి. హరిదాసులు చేతిలో చిరుతలు, మరో చేతిలో తంబుర వాయిద్యం, తలమీద గుమ్మడి కాయ ఆకారంలో అక్షయ పాత్రను పెట్టుకుని నగర సంకీర్తనకు వస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు గాలిపటాల ఎగురవేయడంలో పోటీ పడుతారు. పతంగుల ఎగురవేతలో పిల్లల కేరింతలు, ఆనందోత్సవాల నడుమ పతంగుల సంబరాలను జరుపుకుంటారు.
కాత్యాయని వ్రతాన్ని గోదాదేవి నియమ నిష్ఠలతో మాసం రోజులపాటు ఆచరించి భగవంతుని అనుగ్రహం పొందింది. గోదాదేవిని రంగనాథస్వామి స్వీకరించిన శుభదినమే భోగి పండగగా పిలుస్తారు. వామనావతారంలో ఉన్న మహావిష్ణువు పాతాళానికి తొక్కిన బలి చక్రవర్తి ఏడాదికి ఒకసారి భువిపై వచ్చేది కూడా భోగి అని మరో కథ కూడా ప్రచారంలో ఉన్నది. బలి చక్రవర్తిని ఆహ్వానించే క్రమంలో వేసిన మంటలు కాలనుగుణంగా భోగి మంటలుగా మారినట్లు చెబుతున్నారు. యజ్ఞం హోమాగ్ని ప్రతి రూపాల భోగి మంటలని భక్తుల నమ్మకం. ఇదే సమయంలో చలి నుంచి తట్టుకునేందుకు మంటలు వేయడం వలన భోగి మంటలుగా పేరు వచ్చింది. ఆ మంటల సెగలో నీటిని కాచుకుని ఆ నీటితో స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇతర రోజుల కంటే భోగి రోజున వాకిళ్ళు రంగురంగుల ముగ్గులతో తీర్చిదిద్దుతారు. భోగి పండ్లతో దేవుడికి నైవేద్యం పెట్టి ఇరుగుపొరుగు మహిళలకు శనగలను వాయనంగా అందజేస్తారు. చిన్న పిల్లలకు నాణేలతో దిష్టితీయడం, పిల్లలపై పడిన చెడు దృష్టి తొలిగిపోతుందని ప్రజలు నమ్ముతారు.
సంక్రాంతి పర్వదినం సందర్భంగా పల్లెల్లో, పట్టణాల్లో పండగ వాతావరణం, వాకిళ్ళలో రంగురంగుల ముత్యాల ముగ్గులు, ఇంటిల్లిపాది కుటుంబ సభ్యులతో ఆనందోత్సవాల మధ్య పండగ సందడి నెలకొంటుంది. 27 నక్షత్రాలు, నక్షత్రానికి నాలుగు పాదాలు, మొత్తం 108 పాదాలు, ఆ పాదాలను 12 రాశులుగా విభజిస్తే సూర్యుడు నెలకో రాశిలోకి వెళుతాడు. ఈ నెలలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడం వలన మకర సంక్రాంతిగా పిలుస్తారు. పల్లెలు వదిలి ఉపాధి కోసం వెళ్ళిన కూలీలు, వ్యాపారులు, ఉద్యోగాలకు వారు కుటుంబాలతో పండగకు స్వగ్రామాలకు చేరుకుంటారు.
మూడు రోజుల సంక్రాంతి పండగలో చివరిది కనుమ. వ్యవసాయంలో కీలకంగా వ్యవహరించే ఎద్దులు, ఆవులు, మేకలు ఆ రైతు కుటుంబంలో భాగంగా నిలుస్తాయి. వ్యవసాయ రంగంలో కష్టసుఖాల్లో తోడూ నీడగా నిలిచిన పశువులకు ప్రత్యేకంగా పూజించే ఆచారం ఆనాదిగా వస్తుంది. పండగ రోజున పశువులకు స్నానం చేయించి కుంకుమ, పసుపు, రాసి, బొట్టు పెట్టి మెడలో పూలమాలతో పూజిస్తారు. పాడి పంటల అభివృద్ధికి అనుగ్రహించాలని దేవతామూర్తులను ప్రార్థిస్తారు. పుట్టింటికి వచ్చిన ఆడ బిడ్డలు, ఆల్లుళ్ళు, కుటుంబ సభ్యులతో ఇంటిల్లిపాది సంతోషంగా గడుపుతారు.
మార్కెట్లో సందడి
జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో గురువారం మార్కెట్లలో పండుగ సందడి నెలకొంది. సంక్రాంతి నోములకు సంబంధించిన సామగ్రి కొనుగో లు, పతంగులు, ధారం, చరఖాలు, పూలు, పండ్లతోపాటు ముగ్గులకు వినియోగించే రంగులు తదితర వాటిని వినియోగదారులు కొనుగోలు చేశారు. ఇతర పూజకు విని యోగించే చిలుకలు, దారాలు తదితర అమ్మకాలతో దుకాణాల్లో సందడి నెలకొంది.