కొత్తరోడ్లకు మోక్షం

ABN , First Publish Date - 2022-02-19T07:05:40+05:30 IST

జిల్లాలోని రెండు ప్రధానరోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు అవరోధాలు తొలగిపోయాయి.

కొత్తరోడ్లకు మోక్షం
ఆధ్వానంగా తయారైన ఈద్గాం నుంచి కౌట్ల (కె) వెళ్లే గ్రామరోడ్డు దృశ్యం

నాలుగేళ్ల తరువాత సర్కారు గ్రీన్‌సిగ్నల్‌ 

పాత అంచనాలతోనే పనులు 

గుత్తేదారును ఒప్పించిన అధికారులు 

నిధుల మంజూరుకు ప్రపంచ బ్యాంకు సుముఖత 

నిర్మల్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని రెండు ప్రధానరోడ్ల నిర్మాణానికి ఎట్టకేలకు అవరోధాలు తొలగిపోయాయి. గత నాలుగేళ్ల కింద ఈ రోడ్డు పనులకు టెండర్‌లను సైతం నిర్వహించినప్పటికీ సకాలంలో నిధు లు విడుదల కాక ఆ పనులను దక్కించుకున్న గుత్తేదారులు చేతులేత్తేశారు. దాదాపు రూ.17 కోట్లతో ఈ రెండు ప్రధానరోడ్ల నిర్మాణాలకు అధి కారులు టెండర్‌లు నిర్వహించారు. జిల్లా కేంద్రమైన నిర్మల్‌ పట్టణంలోని ఈద్గాం నుంచి కౌట్ల(కె) వరకు 7 కిలోమీటర్ల పొడవుతో నిర్మించ తలపెట్టిన రోడ్డు కోసం రూ.8కోట్లతో ప్రతిపాదించారు. అలాగే సిర్గాపూర్‌ సారంగాపూర్‌ మండలంలోని కౌట్ల(బి) గ్రామం వరకు 7 కిలోమీటర్ల పొడవుతో నిర్మించ తలపెట్టిన మరో ప్రధానరోడ్డుకు రూ.9కోట్లతో ప్రతిపాదనలు తయారు చేశారు. మొత్తం డబుల్‌ లేన్‌ పేరిట రోడ్డు వైడింగ్‌తో పాటు కొత్తరోడ్డును నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి సంబంధించి 2018 సంవత్సరంలో ఆర్‌అండ్‌బీ శాఖ టెండర్‌లను నిర్వహించి సంబంధిత కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్‌ కూడా చేసుకుంది. అయితే అప్పట్లో ఈ రెండు రోడ్ల నిర్మాణాలకు ప్రపంచబ్యాంకు నిధులు మంజూరు అవుతాయని భావించారు. ఈ నిధులపై ఆధారపడి ప్రతిపాదనలతో పాటు టెండర్‌లు సైతం నిర్వహించారు. కాగా ప్రపంచబ్యాంకు నిధుల విడుదలకు సాంకేతిక కారణాల వల్ల వెనకడుగు వేసింది. ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు అంగీకరించని కారణంగా ప్రక్రియ నిలిచిపోయింది. ఎట్టకేలకు ఈ సంవత్సరం ప్రపంచబ్యాంకు రెండురోడ్ల నిర్మాణాలకు రూ. 17 కోట్ల నిధుల మంజూరుకు అంగీకరించడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు మళ్ళీ ఆ దిశగా కార్యాచరణ చేపట్టారు. ఇందులో భాగంగానే నాలుగు సంవత్సరాల క్రితం ఒప్పందం కుదుర్చుకున్న గుత్తేదారులతోనే ఈ రెండు రోడ్ల నిర్మాణాల పనులను చేపట్టాలని చర్చించారు. మొదట్లో గుత్తేదారులు పాతరేట్లతో పనులు చేసేందుకు నిరాకరించినప్పటికీ సంబంధిత అఽధికారుల అభ్యర్థన మేరకు పనులు ప్రారంభించేందుకు అంగీకరించినట్లు సమాచారం. ఇదిలాఉండగా గత నాలుగేళ్ల క్రితమే అప్పటి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ఈ రోడ్డు నిర్మాణ పనులకు శిలాఫలకం సైతం వేశారు. అయితే నిధుల కొరతతో పనులు నిలిచిపోగా ఎట్టకేలకు ప్రపంచ బ్యాంకు ముందుకు రావడం ఈ రెండు రోడ్ల నిర్మాణాలకు ఆటంకాలను తొలగించినట్లయ్యిందంటున్నారు.

నరకకూపంగా ఈ రెండు రహదారులు

దాదాదా దశాబ్దకాలం నుంచి ఈ రెండు ప్రధానరోడ్డు మార్గాలు నరకకూపాన్ని తలపిస్తున్నాయంటున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రోడ్డుపై ఇరువైపులా తిరుగుతున్న కారణంగా రోడ్డు మొత్తం గుంతలమయంగా మారింది. వాహనాల సంగతి దేవుడెరుగు కాని కాలినడకకు కూడా ఈ రోడ్డుపై తీవ్ర ఇబ్బం దులను కలిగిస్తోంది. ఈద్గాం నుంచి కౌట్ల (కె) వరకు గల ప్రధానరోడ్డు కూడా ఆధ్వాన్నంగా మారిపోయింది. మొత్తానికి ఏడు కిలోమీటర్ల పొడవుతో ఉన్న ఈ రోడ్డుపై తమ వాహనాలను నడిపేందుకు యజమానులు జంకుతున్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ రోడ్డు నిర్మాణం కోసం స్థానికులు ఆందోళనలు సైతం నిర్వహించారు. ఎట్టకేలకు నాలుగు సంవత్సరాల క్రితం రూ.8 కోట్ల వ్యయంతో రోడ్డు పనులను చేపట్టేందుకు ఆర్‌ అండ్‌ బీ అధికారులు సిద్ధమవ్వగా పనుల నిర్వహణ కోసం సైతం టెండర్‌లను కూడా నిర్వహించారు. టెండర్‌ ప్రక్రియ పూర్తికావడంతో ఇక రోడ్డు పనులు మొదలవుతాయని అందరు ఆశించారు. తీరా వారి ఆశలన్నీ అడి యాశలయ్యాయి. నిధుల కొరత కారణంగా కాంట్రాక్టర్‌లు పనులు చేసేం దుకు వెనకడుగు వేశారు. దీంతో పరిస్థితి ఎక్కడ వేసిన అక్కడే అన్న గొంగలిలా మారిపోయింది. దీంతో పాటు సిర్గాపూర్‌ నుంచి కౌట్ల (బి) గ్రామం వరకు బీరవెల్లి గ్రామం మీదుగా నిర్మించ తలపెట్టిన ప్రధాన రోడ్డు కూడా అస్థవ్యస్థంగా మారింది. ఈ రోడ్డుపై వాహనాలు తిరిగేం దుకు నరకయాతన అనుభవించాల్సి వస్తోందంటున్నారు. నర్సాపూర్‌, దిలావర్‌పూర్‌ మండలాలతో సారంగాపూర్‌ మండలానికి ఈ రోడ్డు కనెక్టివిటీగా ఉండడంతో ప్రతీరోజూ ఇరువైపుల జనసంచారమే కాకుండా వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ఆఽధ్వాన్నరోడ్డు కారణంగా వా హన చోదకులు ఇప్పటి వరకు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. ఎట్టకేలకు ఆర్‌అండ్‌బీ శాఖ మొత్తం రూ.18 కోట్లతో ఈ రెండు రోడ్ల నిర్మాణాలను చేపట్టబోతున్న కారణంగా స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారంటున్నారు. 

నాలుగేళ్ల క్రితం శిలాఫలకం

కాగా ఈ రెండు రోడ్ల నిర్మాణాలకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నాలుగేళ్ళ క్రితమే శిలాఫలకం వేశారు. ప్రభుత్వం మొదటి నుంచి ఆర్‌ అండ్‌ బి శాఖకు నిధుల విడుదల విషయంలో అనాసక్తి ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీంతో ఆ శాఖ చేపట్టిన పనులకు ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు కాని కారణంగా ఆ పనులు చేపట్టే కాంట్రాక్టర్‌లు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. దీంతో ఆర్‌ అండ్‌ బి శాఖ సైతం ఏమి చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఇప్పటికే నిధులు విడుదల చేయాలంటూ ఆర్‌ అండ్‌ బి శాఖ అధికారులు ప్రభుత్వానికి పలుసార్లు వినతి కూడా చేశారు. అలాగే మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దృష్టికి సైతం నిధుల విషయాన్ని తీసుకువెళ్లారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా ప్రపంచ బ్యాంకు ఈ రెండు ప్రధానరోడ్ల నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేసేందుకు అంగీకరించింది. దీంతో సంబంధిత అధికారులు ఇక పనులను మొదలుపెట్టేందుకు సిద్దమవుతున్నారు. 

ఆఽధ్వాన రోడ్డుతో అవస్థలు పడుతున్నాం 

 ఈద్గాం నుంచి కౌట్ల వరకు ఉన్న ప్రధాన రోడ్డు ఆధ్వానంగా మారిపోయింది. దారి పొడగునా భారీ గుంతలతో తాము ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పటికే పలుసార్లు ప్రజా ప్రతినిధులు అధికారులు ఈ రోడ్డు నిర్మాణం గురించి హమీ ఇచ్చారు. అయినప్పటికీ ఈ హామీ నెరవేరలేదు. తమ గ్రామానికి చేరుకోవాలంటే ఈ రోడ్డు తమ తమకు వేరే మార్గం లేదు. ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు పనులను చేపట్టాలి. 

- నర్సారెడ్డి, కౌట్ల (కె) 


మూడు మండలాలకు లింకేజీ

దిలావర్‌పూర్‌ మండలంలోని సిర్గాపూర్‌ నుంచి సారంగాపూర్‌ మండలంలోని బీరవెల్లి మీదుగా కౌట్ల గ్రామం వరకు గల రోడ్డు గందరగోళంగా మారిపోయింది. రోడ్డుపై భారీగుంతల కారణంగా తాము తీవ్ర ఇబ్బం దులు పడుతున్నాం. వాహనాల సంగతి పక్కన పెడితే కాలినడకన నడిచేందుకు కూడా ఈ రోడ్డు అనుకూలంగా లేదు. సంబంధిత శాఖ ఎప్పటికప్పుడు మరమత్తులు చేయని కారణంగానే ఈ సమస్య తీవ్రమయ్యింది. ఇకనైనా అధికారులు , ప్రజా ప్రతినిధులు స్పందించి చర్యలు తీసుకోవాలి. 

- సీహెచ్‌. మధుకర్‌, మలక్‌ చించోలి 

నిధులు మంజూరు కాగానే పనులు చేపడతాం

ఈ విషయమై రోడ్లు భవనాల శాఖ నిర్మల్‌  ఈఈ అశోక్‌ కుమార్‌ను సంప్రదించగా పనులు చేపట్టేందుకు ప్రపంచ బ్యాంకు ఆమోదం లభించిందని , నిధులు మంజూరు కాగానే రోడ్డు నిర్మాణ పనులను చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. 

- అశోక్‌కుమార్‌ , ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, రోడ్లు,భవనాల శాఖ , నిర్మల్‌ 

Updated Date - 2022-02-19T07:05:40+05:30 IST