పోస్టుమెట్రిక్‌ ‘వసతి’పై పాలకుల చిన్నచూపు

ABN , First Publish Date - 2022-11-16T00:53:50+05:30 IST

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ నిరుపేద విద్యార్థిసైతం ఉన్నత విద్యను అభ్యసించాలనే గొప్పలక్ష్యంతో కేజీటుపీజీ ఉచితవిద్య అందజేస్తామని రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు.

పోస్టుమెట్రిక్‌ ‘వసతి’పై పాలకుల చిన్నచూపు
నిర్మల్‌ పట్టణ బీసీ బాలుర పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహంలో దుప్పట్లు లేక ముడుచుకొని పడుకున్న విద్యార్థులు

జిల్లావ్యాప్తంగా 12 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలు

11 హాస్టళ్లు అద్దె భవనాల్లోనే..

చలికాలం వచ్చినా విద్యార్థులకు అందని దుప్పట్లు

ఫ్రీ మెట్రిక్‌ ఇచ్చే సౌకర్యాలైనా తమకు ఇవ్వాలంటున్న విద్యార్థులు

ఖానాపూర్‌, నవంబరు 15 : పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ నిరుపేద విద్యార్థిసైతం ఉన్నత విద్యను అభ్యసించాలనే గొప్పలక్ష్యంతో కేజీటుపీజీ ఉచితవిద్య అందజేస్తామని రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే అన్నివర్గాలకు సంబంధించిన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు వీలుగా గురుకులాలతో పాటు, వసతిగృహాలు ఏర్పా టు చేస్తున్నట్లు ఓవైపు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ వసతి గృహాల్లో ఫ్రీ మెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ రెండురకాల వసతిగృహాలను ఏర్పా టు చేశారు. ఒకటి నుంచి పదవతరగతి వరకు చదివే విద్యార్థులకు పాఠశాలల్లో అయితే మధ్యాహ్న భోజనం వసతిగృహాల్లో అయితే ఆశ్ర యంతో పాటు పుస్తకాలు, పెన్నులు, ట్రంకుపెట్టెలు, దుప్పట్లు, స్వెటర్లు, యూనిఫాంతో పాటు పలు రకాల సౌకర్యాలను కల్పించారు. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ పోస్టుమెట్రిక్‌ విద్యార్థులయిన ఇంటర్‌, డిగ్రీ, పీజీ విద్యార్థుల పట్ల పాలకులు చిన్నచూపు చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వసతుల్లేక పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు తప్పని తిప్పలు

గురుకులాలలో చదివే విద్యార్థులే కాకుండా ఫ్రీమెట్రిక్‌ వసతి గృహా లలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు ప్రభుత్వం పలు రకాల సౌక ర్యాలను కల్పిస్తుంది. కానీ తమను మాత్రం పట్టించుకోవడం లేదని పోస్టుమెట్రిక్‌ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేవలం తమకు భోజనం, వసతిమాత్రమే కల్పిస్తున్న ప్రభుత్వం ఇతర ఏ సౌకర్యాలు అందజేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోస్టుమెట్రిక్‌ విద్యా ర్థులకు సైతం ప్రభుత్వం నుంచి పుస్తకాలు, పెన్నులు, కాస్మోటిక్స్‌తో పాటు చలితీవ్రత నుంచి తట్టుకునేలా దుప్పట్లు, స్వెటర్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్రీ మెట్రిక్‌, పోస్ట్‌ మెట్రిక్‌ వసతిగృహాల నిర్వహణలో తేడాలు చూపించడం పట్ల పలు విద్యార్థిసంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుత సీజన్‌లో చలితీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాల్లో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు వెచ్చని దుస్తులను, దుప్పట్లను పంపిణీ చేయాలని కోరుతున్నారు.

ఒక్కటి మినహా మిగతావన్నీ అద్దె భవనాలే

నిర్మల్‌లోని ఎస్టీ బాలికల వసతిగృహం మినహా జిల్లాలో నిర్వహి స్తున్న పోస్ట్‌మెట్రిక్‌ వసతి గృహాలన్నీ అద్దెభవనాల్లోనే కొనసాగుతు న్నాయి. సొంత భవనాలు లేకపోవడంతో సైతం పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాల్లో ఆశయం పొందుతున్న విద్యార్థులకు వసతులు కల్పించడానికి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 12 పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహాలున్నాయి. ఇందులో బీసీ విభాగంలో 5 వసతి గృహాలు ఉండగా ఖానాపూర్‌, భైంసా, నిర్మల్‌లో ఒక్కొక్క బాలుర వసతి గృహాలు ఉన్నాయి. ఇందులో ఖానాపూర్‌లో 39 మంది విద్యార్థులు, భైంసాలో 45 మంది విద్యార్థులు, నిర్మల్‌లో 100 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఇక బాలికల విభాగంలో నిర్మల్‌లో ఒక వసతిగృహం ఉండగా వంద మంది విద్యార్థులు, భైంసాలో ఒక వసతి గృహం ఉండగా 56 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఎస్టీ విభాగంలో జిల్లా కేంద్రంలో బాలికల వసతిగృహం ఒకటి, బాలుర వసతిగృహం ఒకటి ఉంది. బాలుర వసతిగృహంలో 83 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతుండగా బాలికల వసతిగృహంలో 75 మంది విద్యార్థులు ఆశ్రయం పొందుతున్నారు. ఎస్సీ విభాగంలో జిల్లా లో ఐదు పోస్టుమెట్రిక్‌ వసతి గృహాలున్నాయి. కాగా నిర్మల్‌, భైంసాలలో బాలుర విభాగంలో ఒక్కొక్క వసతిగృహం ఉండగా బాలికల విభా గంలో నిర్మల్‌లో రెండు, భైంసాలో ఒకటి చొప్పున వసతిగృహాలు ఉన్నాయి. సోషల్‌వెల్ఫేర్‌ విభాగంలో ప్రస్తుతం 400ల మంది విద్యా ర్థులు పోస్ట్‌మెట్రిక్‌హాస్టళ్లలో ఆశ్రయం పొందుతున్నారు. జిల్లా వ్యాప్తం గా ఇప్పటి వరకు 898 మంది విద్యార్థులు పోస్టుమెట్రిక్‌ వసతిగృహాల్లో ఆశ్రయం పొందుతుండగా ప్రస్తుతం అడ్మిషన్లు కొనసాగుతున్న నేప థ్యంలో ఈ సంఘం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇంత మంది విద్యార్థులకు ఆశ్రయం కల్పిస్తున్న పోస్టు మెట్రిక్‌ వసతిగృహాలపై పాలకులు ఇప్పటికైనా చిన్నచూపును వీడి సొంత భవనాలు ఏర్పాటుతో పాటు హాస్టళ్లలో అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులతో పాటు పలుసంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. పోస్ట్‌ మెట్రిక్‌ వసతిగృహాలను అభివృద్ధి చేయడం ద్వారా సామాన్య విద్యార్థులకు సైతం ఉన్నతవిద్యను అభ్యసించే అవకాశాన్ని కల్పించినట్లు అవుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉన్న పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాలు అన్నింటికీ సొంత భవనాల ఏర్పాటుతో పాటు విద్యార్థులకు అన్నిరకాల సౌకర్యాలు కల్పించాలని డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది. వసతిగృహాల నిర్వహణపై పర్య వేక్షణ చేయాల్సిన జిల్లాస్థాయి అధికారులు సైతం నిర్లక్ష్యంగా వ్యవహ రిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంబంధిత ఆరోపణలపై జిల్లా అధికారులను వివరణ కోరేందుకు ఆంధ్రజ్యోతి ప్రయత్నించగా ఫోన్‌లో వారు స్పందించలేదు.

సౌకర్యాలు కల్పించాలి

పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాలలో సరైన సౌకర్యాలులేవు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ఫ్రీ మెట్రిక్‌ విద్యార్థులకు వసతిగృహాలలో కల్పిస్తున్న సౌకర్యాలను పోస్ట్‌ మెట్రిక్‌ విద్యార్థులకు సైతం కల్పించాలి

- వి. ఆద్యిత, పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం విద్యార్థి, నిర్మల్‌

చలి తట్టుకోలేకపోవతున్నాం .. దుప్పట్లు ఇవ్వండి

ప్రస్తుతం జిల్లాలో చలితీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో హాస్టళ్లలో సరైన దుప్పట్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. ఫ్రీ మెట్రిక్‌ విద్యార్థులకు అందించినట్లు పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాల్లో ఆశ్రయం పొందుతున్న తమకు కూడా స్టడీ మెటీరియల్‌తో పాటు దుప్పట్లను స్వెటర్లను పంపిణీ చేయాలి

- శివరామకృష్ణ, ఇంటర్మీడియట్‌ విద్యార్థి, నిర్మల్‌

జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపాలి

జిల్లాలో పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాలలో ఆశ్రయం పొందుతున్న విద్యార్థులకు సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాస్థాయిలో పర్యవేక్షణ బాధ్యత లు చూస్తున్న అధికారుల నిర్లక్ష్యంతో విద్యార్థులకు మరిన్ని తిప్పలు తప్పడం లేదు. రాష్ట్రంలోనే చలితీవ్రత అత్యధికంగా ఉండే ప్రాంతంలో ఒకటైన నిర్మల్‌ జిల్లాలో విద్యార్థులకు వెచ్చని దుప్పట్లను, స్వెటర్లను పంపిణీ చేయాలి. ఈ అంశంపై జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ చూపి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలి.

ఎంబడి చంద్రశేఖర్‌, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు

Updated Date - 2022-11-16T00:53:50+05:30 IST

Read more