ఆర్టీసీ ఇంటిబాట

ABN , First Publish Date - 2022-09-25T07:02:19+05:30 IST

సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీసంస్థ తన మనుగడను నిలుపుకుంటూ తిరిగి పూర్వ వైభ వం సాధించాలన్న తపనతో అడుగులు వేస్తోంది.

ఆర్టీసీ ఇంటిబాట
సోన్‌ మండలంలో ఇంటింటా ప్రచారం చేస్తున్న ఆర్టీసీ అధికారులు

సేవలపై గ్రామాల్లో ఇంటింటా ప్రచారం 

ప్రైవేటును అడ్డుకునేందు కోసమే కొత్త ఎత్తుగడలు 

తాము అందిస్తున్న సేవలపై వివరణ 

ప్రతీ ఊరిలో వీడీసీల సహకారం 

ఇప్పటికే అమలవుతున్న వీఆర్‌ఎస్‌

రంగంలోకి సంస్థ ఉన్నతాధికారులు 

నిర్మల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి) : సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న ఆర్టీసీసంస్థ తన మనుగడను నిలుపుకుంటూ తిరిగి పూర్వ వైభ వం సాధించాలన్న తపనతో అడుగులు వేస్తోంది.   ప్రైవేటు వాహనాల నుంచి పోటీని తట్టుకొని ప్రయాణికులను ఆకర్షించేందుకే కాకుండా సంస్థ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఆర్టీసీ తన రూటు మార్చుకుంది. ఇప్పటి వరకు డిపో, బస్టాండ్‌, బస్సుషెల్టర్‌లకే పరిమితమైన ఆర్టీసీ ఇక గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టింది. నిర్మల్‌ డిపోకు సంబంధించిన అధికారులు గత పదిరోజుల నుంచి డిపోకు సంబంధించిన అధికారులు డిపో పరిధిలోని పలుగ్రామాల్లో పర్యటిస్తున్నారు. డీఎం సాయన్న ఆధ్వర్యంలో రెండు, మూడు గ్రామాలకు ఓ గ్రామాన్ని ఎంపిక చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ గ్రామా ల్లో ఆర్టీసీ ఇంటింటా ప్రచారం చేస్తూ ప్రజలతో మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ప్రతీరోజూ ఎక్కువ మంది ప్రయాణించే రూట్లపై అధికారులు దృష్టి కేంద్రీకరించారు. ప్రైవేటు వాహనాలు ఎక్కువగా తిరిగే గ్రామాలను గుర్తించి ఆ గ్రామాలను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆటోరిక్షాల్లో ప్రయాణం ప్రమాదకరమని వీరు ప్రజలకు సూచిస్తున్నారు. ఆటోరిక్షాల్లో ప్రయాణం సందర్భంగా జరుగుతున్న యాక్సిడెంట్‌లను వీరు వివరిస్తున్నారు ప్రజల వద్దకు ఆర్టీసీ పేరిట చేపడుతున్న ఈ కార్యక్రమం ఆయా గ్రామాల్లో మంచి స్పందన లభిస్తుందని అంటున్నారు. తాము వెళుతున్న గ్రామాలకు ఆర్టీసీ బస్సులు ఏఏ సమయాల్లో తిరుగుతాయో, అలాగే ఎలాంటి సౌకర్యాలు అందుతున్నాయోననే వివరాలను వీరు ప్రజలకు చెబుతున్నారు. ఆర్టీసీ ద్వారా వివాహాది శుభకార్యాల కోసం ముందుగానే బస్సులను బుక్‌ చేసుకున్న వారికి 20 శాతం రాయితీ కల్పిస్తున్నామని, అలాగే పుణ్యక్షేత్రాలకు, జాతరకు 30 మందికి పైగా కలిసి వెళ్లాలనుకునే వారి కోసం వారి ఇంటివద్దకే బస్సును పంపుతామని చెబుతున్నారు. పదవతరగతి చదివే ఆడపిల్లలకు ఉచిత బస్సు పాస్‌లు అందిస్తున్నామని 12 సంవత్సరాల్లోపు బాలురకు కూడా ఉచిత బస్సు పాసులు అందిస్తున్నామంటూ అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యంగా ఆయా గ్రామాల్లోని వీడీసీ సభ్యుల సహకారాన్ని కోరుతున్నారు. ప్రైవేటు వాహనాలను పూర్తిస్థాతయిలో అడ్డుకోవాలని, ఇక నుంచి ఆర్టీసీ పరం గా అన్ని రకాల సేవలు అందిస్తామంటూ వీరు ప్రచారం చేస్తున్నారు. అయితే ఆర్టీసీ ఉన్నతాధికారులు తమ గ్రామానికి వచ్చి సేవలపై హామీ ఇస్తుండడంతో ఇప్పటికే పలు గ్రామాలు ప్రైవేటు వాహనాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే అమలవుతున్న వీఆర్‌ఎస్‌

కాగా ఆర్టీసీ సంస్థలో సిబ్బందిని తగ్గించుకునేందు కోసం ఆ సంస్థ వీఆర్‌ఎస్‌ను అమలు చేస్తోంది. దాదాపు జిల్లావ్యాప్తంగా 50 మందికి పైగా కండక్టర్‌లు, డ్రైవర్‌లు వీఆర్‌ఎస్‌ పేరిట స్వచ్చంద ఉద్యోగ విరమణను చేశారు. అయితే మరికొంతమంది కూడా వీఆర్‌ఎస్‌ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. కొద్దిరోజుల్లోనే వీరికి కూడా సంస్థ వీఆర్‌ఎస్‌ కోసం అనుమతినిచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఆర్టీసీలో అన్ని విభాగాలను ప్రైవేటీకరించిన యాజమాన్యం క్రమంగా తన వ్యయాన్ని తగ్గించుకునే దిశగా చర్యలు చేపట్టింది. పనికి తగిన వేతనం మాత్రమే అన్న నినాదంతో ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను నియమించుకుంటోంది. అయితే రెగ్యులర్‌ సిబ్బంది వేతనాలు, ఇతర ప్రయోజనాలతో పాటు నిర్వహణ వ్య యం కూడా సంస్థను నష్టాల వైపు పయనింపజేస్తోంది. ఇలాంటి వ్యవహారాలను దృష్టిలో పెట్టుకొని వీఆర్‌ఎస్‌ను తాజాగా తెరపైకి తెచ్చారు. దీంతో కండక్టర్‌లు, డ్రైవర్‌లు, మెకానిక్‌ల నుంచి సంస్థ దరఖాస్తులు కూడా స్వీకరించింది. ఈ దరఖాస్తులకు అనుగుణంగా అర్హతలను బట్టి వీఆర్‌ఎస్‌కు అనుమతులు ఇస్తోంది. నిర్మల్‌, భైంసా డిపోల్లో చాలా మంది కండక్టర్‌లు, డ్రైవర్‌లు వీఆర్‌ఎస్‌ తీసుకున్నారు. అలాగే మరికొంతమంది కూడా ముందు రోజుల్లో వీఆర్‌ఎస్‌ తీసుకోనున్నట్లు చెబుతున్నారు. 

వీడీసీల సహకారం కోసం ప్రయత్నాలు

కాగా ఆర్టీసీ సంస్థ ప్రైవేటు వాహనాలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. ప్రతీ గ్రామానికి ఆర్టీసీ బస్సును తిప్పించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే ప్రైవే టు వాహనాలను నియంత్రిస్తే ఆదాయం పెరుగుతుందన్న ఉద్దేశంతో ఇంటింటా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే గ్రామాల్లో ప్రస్తుతం వీడీసీలు కీలకపాత్ర పోషిస్తున్న కారణంగా ఆర్టీసీ అధికారులు మొదట వీడీసీ సభ్యులతో సమావేశమవుతున్నారు. ఆ తరువాత గ్రామ పంచాయతీల వద్ద ఆర్టీసీ గ్రామసభ పేరిట సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రైవేటు వాహనాల కారణంగా జరుగుతున్న ప్రమాదాలు, ఆర్టీసీ బస్సుల్లో సురక్షిత ప్రయాణానికి సంబంధించి అంశాలను వివరిస్తున్నారు. ఆర్టీసీకీ సంబంధించిన ఉన్నతాధికారులంతా తమ గ్రామానికి వచ్చి ఆర్టీసీ సేవలు, కల్పిస్తున్న సౌకర్యాలపై వివరిస్తున్న కారణంగా ఆ సంస్థ కొంతవరకైనా ప్రయోజనం చేకూర్చవచ్చంటున్నారు. 

సేవల విస్తరణ.. సంస్థ ఆదాయం పెంచేందుకే

సేవల విస్తరణ, ఆదాయం పెంపుతో పాటు ఆర్టీసీ సంస్థను పరిరక్షించుకునేందుకే ఊరూరా ప్రచారం చేపడుతున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు వాహనాల కారణంగా నష్టం వాటిల్లుతోంది. దీనికి సరిదిద్దుకునేందుకు ఇక నుంచి మెరుగైన సేవలతో పాటు అన్ని గ్రామాలకు బస్సులను తిప్పుతాం. గ్రామీణ ప్రాంత ప్రజలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణాన్ని ఆపేసి ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేయాలి. సంస్థను కాపాడేందుకు ప్రతి ఒక్కరు సహాకరించాలి. 

- సాయన్న, డిపో మేనేజర్‌, నిర్మల్‌

Read more